స్టార్ట్ కెమెరా.. యాక్షన్.. అనగానే.. సీన్ పండించడంలో సిద్ధహస్తులు వాళ్లు. అందుకే, హీరోలుగా ఇండస్ట్రీలో పాతుకుపోయారు. అలా స్టార్డమ్ సంపాదించుకున్న హీరోల్లో కొందరు మెగా ఫోన్ పట్టుకున్నారు. స్టార్ట్ కెమెరా.. యాక్షన్.. అన్నారు. నాటి చిత్తూరు నాగయ్య దగ్గర్నుంచి నేటి విశ్వక్సేన్ వరకు ఎందరో హీరోలు దర్శకత్వ ప్రతిభను చాటుకున్నారు. వీరి సరసన తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు హీరో రామ్ పోతినేని. టాలీవుడ్లో హీరోలుగా వెలుగుతూనే.. దర్శకులుగా రాణించిన వారి ముచ్చట్లు ఇవి…
దర్శకుణ్ని కెప్టెన్ ఆఫ్ ద షిప్ అంటారు. 24 క్రాఫ్ట్లనూ లీడ్ చేసేది అతనే! సినిమా హిట్ అయితే హీరో ఖాతాలో, పరాజయం పాలైతే దర్శకుడి అకౌంట్లో పడటం ఇండస్ట్రీలో రివాజే! సినిమా భారాన్నంతా మోస్తూ.. హీరోను ఎలివేట్ చేసిన దర్శకులు ఎందరో ఉన్నారు. సినిమా ట్రెండ్ మార్చిన ఘనత కూడా దర్శకులకే దక్కుతుంది. అందుకే నిర్మాతల విషయంలో జరిగిన అన్యాయం దర్శకుల విషయంలో జరగలేదు. దర్శకుడిపై.. అప్పట్లో, ఇప్పుడు కూడా నటీనటులకు కొంత గౌరవభావం ఉంటుంది. ఆ గౌరవం కోసమనో, తన అభిరుచికి తగ్గట్టు తానైతేనే బాగా తీయగలననో, తనలోని మరో కోణాన్ని ఆవిష్కరించాలనో.. చాలామంది టాలీవుడ్ హీరోలు దర్శకులుగా అవతారమెత్తారు. అలా దర్శకుడి బాధ్యతలు చేపట్టిన హీరోల్లో దాదాపు అందరూ సక్సెస్ రుచి చూశారు.
తెలుగు సినిమా దిగ్గజ నటుల్లో ప్రథమ స్థానంలో నిలుస్తారు నాగయ్య. తొలితరం టాలీవుడ్ హీరోగా జన నీరాజనాలు అందుకున్నారాయన. భక్తిరస ప్రధాన చిత్రాల్లో అపురూపమైన నటనతో ప్రేక్షకులను కట్టిపడేశారు. ఆ రోజుల్లోనే లక్ష రూపాయల పారితోషికం అందుకున్న హీరోగా ఒక వెలుగు వెలిగారు నాగయ్య. దర్శకుడిగానూ ఆయన విజయవంతం అయ్యారు. ఆయన డైరెక్ట్ చేసిన ‘త్యాగయ్య’ సినిమా అలనాటి ఆణిముత్యం అనిపించుకుంది. నిర్మాతగానూ బాధ్యతలు చేపట్టడంతో కొన్ని సినిమాల వల్ల ఆర్థికంగా కుదేలయ్యారు. ‘రామదాసు’ సినిమా నిరాశ పర్చడంతో కోలుకోకుండా దెబ్బతిన్నారు. ఆర్థిక అంశాలు ఎలా ఉన్నా… నట చక్రవర్తిగా పేరొందిన నాగయ్య దర్శకుడిగానూ చెరగని ఖ్యాతిని మూటగట్టుకున్నారు.

తెలుగు సినిమా చరిత్రలో ఎన్టీయార్ ఓ సువర్ణాధ్యాయం. నటుడిగా ఆయన చేయని పాత్ర లేదు. పౌరాణికం, జానపదం, చారిత్రకం, సాంఘికం ఇలా అన్ని తరహా చిత్రాలు చేసి జనం గుండెల్లో శాశ్వత స్థానం సంపాదించుకున్నారు. దర్శకుడిగానూ రామారావు అనితర సాధ్యమైన విజయాలను సొంతం చేసుకున్నారు. సొంత నిర్మాణ సంస్థలో పదిహేనుకు పైగా చిత్రాలకు దర్శకత్వ బాధ్యతలు నిర్వర్తించారు. వాటిలో కొన్నిటికి కథ, స్క్రీన్ ప్లే కూడా చేపట్టారు. ప్రతినాయకుడైన రావణాసురుణ్ని కూడా నాయకుడిగా ‘సీతారామ కళ్యాణం’లో ఆయన చూపించిన తీరు అద్భుతం. శ్రీకృష్ణ పాండవీయం, తల్లా? పెళ్లామా, శ్రీ రామపట్టాభిషేకం, తాతమ్మకల, వరకట్నం ఇలా ఆయన డైరెక్ట్ చేసిన ఎన్నో సినిమాలు బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లు నమోదు చేశాయి. ‘దాన వీర శూర కర్ణ’ ఓ అద్భుతమనే చెప్పాలి. ఇందులో త్రిపాత్రాభినయం చేసి అఖండ విజయాన్ని అందుకున్నారు. ‘శ్రీమద్విరాట పర్వం’లో అయితే ఐదు పాత్రలూ పోషించి ఆయనకు ఆయనే సాటి అని నిరూపించుకున్నారు ఎన్టీయార్.
ప్రయోగాలకు, సాహసాలకు కేరాఫ్ హీరో కృష్ణ. వందల సినిమాల్లో నటించిన ఈ హీరో.. మూడు షిఫ్టుల్లో పనిచేసేవారు. అంత బిజీలోనూ మెగాఫోన్ పట్టుకున్నారు. అలాగని అల్లాటప్పా సినిమాలకు దర్శకత్వం వహించలేదు ఆయన. చరిత్రలో నిలిచిపోయిన సినిమాలను డైరెక్ట్ చేసి.. సూపర్ డైరెక్టర్ అనిపించుకున్నారు. ఆయన కెరీర్లో చిత్రరాజంగా నిలిచిపోయిన ‘అల్లూరి సీతారామరాజు’ చిత్రానికి అనధికారిక దర్శకుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసిన ‘సింహాసనం’ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. కాళిదాదా, శంఖారావం, ముగ్గురు కొడుకులు, బాలచంద్రుడు ఇలా 15 చిత్రాల వరకు దర్శకుడిగా సత్తా చాటారు.
నటనలో ఎస్వీ రంగారావును మించినవాడు అప్పట్లో ఎవరూ లేరు. ఆయన సీన్లో ఉన్నాడంటే చాలు.. మిగతా నటులు అలెర్ట్‌గా ఉండేవారు. ఏ తరహా పాత్ర అయిన అలవోకగా పండించడం ఎస్వీఆర్కు మాత్రమే తెలిసిన కిటుకు. హిరణ్యకశిపుడిగా, దక్షుడిగా, కీచకుడిగా, ఘటోత్కచుడిగా ఎస్వీఆర్ ప్రదర్శించిన నటన వెండితెరపై బంగారు సంతకం వంటిది. ఈ నట దిగ్గజం మంచి రచయిత కూడా! కథలు రాసేవారు. తన అభిరుచికి తగ్గట్టు అందమైన చిత్రాలకు దర్శకత్వం వహించారు. రాసిలో తక్కువే అయినా.. వాసికెక్కిన ఆ చిత్రాలు బంధాలకు, అనుబంధాలకు చిరునామాగా అలరించాయి. ‘బాంధవ్యాలు’, ‘చదరంగం’ చిత్రాలకు దర్శకత్వం వహించిన ఈ ప్రతినాయక పాత్రధారి.. తన మనసు ఎంత మెత్తనో చాటుకున్నారు.

దర్శకరత్న దాసరి స్కూల్ నుంచి వచ్చిన వారంతా ట్రెండ్ సెట్ చేసిన వారే. అలాంటి వారిలో ప్రముఖంగా చెప్పుకోవాల్సిన నట, దర్శకుడు ఆర్ నారాయణమూర్తి. పీపుల్స్ స్టార్ బిరుదు పొందిన స్టార్ దర్శకుడు ఆయన. కెరీర్ ఆరంభంలో చిన్నాచితకా పాత్రలు పోషించిన నారాయణమూర్తి.. దర్శకుడిగా ప్రభంజనమే సృష్టించారు. వెండితెరపై ఎర్రజెండాను రెపరెపలాడించారు. అర్ధరాత్రి స్వతంత్రంతో దర్శకుడిగా అవతారం ఎత్తిన నారాయణమూర్తి హిట్లు, ఫ్లాప్స్‌తో సంబంధం లేకుండా.. విప్లవ ఉప్పెన సృష్టించారు. బీదలపాట్లు, కర్షకుల శ్రమ, కార్మికుల కష్టాలు ఇతివృత్తాలుగా తీసుకొని.. సమాజాన్ని తన సినిమాతో ప్రశ్నించారు. ఆయన సినిమాల్లాగే అందులోని పాటలూ బహుళ జనాదరణకు నోచుకున్నాయి. దండోరా, ఎర్రసైన్యం, చీమలదండు తదితర సినిమాలు బాక్సాఫీస్ దగ్గర కూడా బంపర్ హిట్ సాధించాయి.
తొలి తరం తర్వాత రెండో తరంలో వచ్చిన బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ ఎవరూ దర్శకత్వం జోలికి వెళ్లలేదు. మెగాస్టార్ చిరంజీవి మెగాఫోన్ అయితే పట్టుకోలేదు కానీ, అడపాదడపా కొన్ని సన్నివేశాలను డైరెక్ట్ చేసి.. వాటిలో తన మార్క్ కనిపించేలా చేశారు. ఇక ఆ తర్వాతి తరంలో పవన్‌కళ్యాణ్ మాత్రం ఒకేఒక్క సినిమాను డైరెక్ట్ చేశారు. ఖుషీ బూమ్‌లో ఉండగా ప్రయోగాత్మకంగా ‘జానీ’ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ మూటగట్టుకున్నా.. పవర్‌స్టార్ అభిరుచిని తెలియజేసింది. జెన్-జీ జనరేషన్లో ‘జానీ’ విడుదలై ఉంటే మెగాహిట్ అయ్యేదని కొందరి అభిప్రాయం. పవన్ తర్వాత.. స్టార్డమ్ ఉన్న హీరోలు ఎవరూ దర్శకత్వం జోలికి వెళ్లలేదు. ఒక్కో సినిమా రెండేసి, మూడేసి సంవత్సరాలు షూటింగ్ జరుపుకొంటున్న ఈ రోజుల్లో.. దర్శకత్వం కత్తి మీద సామే అనుకున్నారేమో! స్టార్డమ్ ఉన్నంత కాలం.. హీరోయిజానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. విలక్షణ నటుడు అవసరాల శ్రీనివాస్ ఫీల్ గుడ్ మూవీస్ తీయడంలో దిట్ట అనిపించుకున్నారు. మాటల రచయితగానూ సత్తా చాటుతున్నారు. ఊహలు గుసగుసలాడే, జ్యో అచ్యుతానంద, ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి సినిమాలను డైరెక్ట్ చేసి స్మూత్ దర్శకుడు అనిపించుకున్నారు. మాస్ హీరో విశ్వక్సేన్ డిఫరెంట్ యాక్టర్‌గా నిరూపించుకున్నారు. ఆయన దర్శకత్వం వహించిన ‘ఫలక్నామా దాస్’ బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. దాస్ కీ ధమ్కీ యావరేజ్‌గా మిగిలిపోయింది. ప్రస్తుతం మరో సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. అడివి శేష్ కూడా రెండు సినిమాలకు దర్శకత్వం వహించి తన ప్రతిభను చాటుకున్నారు. తాజాగా రామ్ పోతినేని స్వీయ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నారు. ఇటీవలే షూటింగ్ మొదలైన ఈ చిత్రం రామ్‌కు 23వ సినిమా! ఈ చిత్రం విజయం మీదే ఈ హీరోలోని దర్శకుడి భవిష్యత్తు ఆధారపడి ఉంది.
హీరోలే కాదు.. పలువురు హీరోయిన్లూ మెగాఫోన్ పట్టుకున్నారు. అలనాటి మేటి నటి భానుమతి బహుముఖ ప్రజ్ఞాశాలి. నటిగా ఆమె మేరునగం. సంగీతంలో రారాజ్ఞి. నిర్మాతగా రాణించారు. దర్శకత్వంలోనూ సూపర్బ్ అనిపించుకున్నారు. చండీరాణి, భక్తధ్రువ మార్కండేయ, అసాధ్యురాలు అనే సినిమాలను ఆమె డైరెక్ట్ చేశారు. మహానటి సావిత్రి పలు చిత్రాలకు దర్శకత్వం వహించారు. చిన్నారి పాపలు, మాతృదేవత, వింత సంసారంతోపాటు రెండు తమిళ చిత్రాలనూ డైరెక్ట్ చేశారు. హీరోయిన్గా విజయం సాధించి.. దర్శకురాలిగా అంతకు మించిన విక్టరీ సొంతం చేసుకున్న నటి విజయనిర్మల. దాదాపు 45 చిత్రాలకు ఆమె దర్వకత్వం వహించారు. అత్యధిక చిత్రాలను డైరెక్ట్ చేసిన మహిళా దర్శకురాలిగా గిన్నిస్ రికార్డును కూడా సొంతం చేసుకున్నారు. మీనా, దేవదాసు (కృష్ణ), హేమాహేమీలు, భోగిమంటలు, బెజవాడ బెబ్బులి ఇలా సక్సెస్ఫుల్ సినిమాలకు విజయవంతంగా దర్శకత్వ బాధ్యతలు నిర్వర్తించారు విజయ నిర్మల.