ముహమ్మద్ ప్రవక్త (స) నలుగురు సహచరుల్లో హజ్రత్ అలీ (రజి) చివరివారు. ప్రవక్త (స)కు స్వయానా అల్లుడు. ఇమామ్ హుసైన్ (రజి) తండ్రి. హజ్రత్ అలీ (రజి) ఇస్లామీయ ప్రపంచంలో ఎంతో పేరుప్రఖ్యాతులు గడించారు. ఆయన నమాజులు, రోజాలు పాటించడంలో ఏ చిన్నపాటి నిర్లక్ష్యమూ వహించేవారు కాదు. ఒకసారి ఓ యుద్ధంలో హజ్రత్ అలీ (రజి) శరీరానికి మూడు బాణాలు గుచ్చుకున్నాయి. హజ్రత్ అలీ (రజి)ని చెట్టుకు కట్టేసి బాణాలు తొలగిద్దామని వైద్యుడు చెప్పాడు. దానికి హజ్రత్ అలీ ఒప్పుకోలేదు. మరి బాణాలు తీసే క్రమంలో నొప్పి భరించలేనంతగా ఉంటుంది కదా అని వైద్యులు చెప్పారు. అయితే ‘నేను నమాజులో లీనమైనప్పుడు బాణాలు తొలగించండి’ అన్నారు. అంటే ఆయన నమాజు చేస్తున్నప్పుడు ఎంతగా దైవారాధనలో నిమగ్నమవుతారో అర్థం చేసుకోవచ్చు. హజ్రత్ అలీ ఖురాన్ పాండిత్యంలో ఎంతో సుప్రసిద్ధులు. బద్ధ విరోధులు సైతం ఆయన దగ్గరికి ధర్మ సందేహాల నివృత్తి కోసం వచ్చేవారు.
జీవితాంతం ఎంతో నిజాయతీగా జీవితాన్ని గడిపారు. ఆయన్ను చూడటానికి దైవదూతలు దిగి వస్తారు అని ప్రవక్త (స) చెప్పేవారు. ఒకానొకసారి హజ్రత్ అలీ (రజి) తన విరోధితో కలబడుతున్నారు. శత్రువును నేలకూల్చారు. ఒకే ఒక్క వేటుతో శత్రువును మట్టికరిపించే అవకాశం హజ్రత్ అలీ (రజి)కి చిక్కింది. ఆ సమయంలో శత్రువు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో హజ్రత్ అలీ(రజి) మీద కాండ్రించి ఉమ్మివేశాడు. దీంతో హజ్రత్ అలీ (రజి) తన చేతిలో ఖడ్గాన్ని పక్కన పడేసి అతణ్ని మరుక్షణమే వదిలేశారు. ఒక్కసారిగా ఆ శత్రువు ఖంగుతిన్నాడు. ‘నన్ను చంపే అవకాశమున్నా వదిలేశావెందుకు?’ అని అడిగాడు. దానికి అలీ ‘నేను ఇప్పటిదాకా ధర్మం కోసమే నీతో పోరాడాను. ఎప్పుడైతే నువ్వు నా మీద ఉమ్మివేశావో అప్పుడు నాలో వ్యక్తిగత కోపం రగిలింది. ఒకవేళ నిన్ను చంపినట్లయితే నా వ్యక్తిగత ప్రతీకారంతో చంపినట్లవుతుంది. అందుకే నిన్ను వదిలేశాను’ అని జవాబిచ్చారు. ఆ మాటలు అతనిలో పరివర్తన తీసుకొచ్చాయి. మరుక్షణమే హజ్రత్ అలీ (రజి) అనుచరుడిగా మారిపోయాడు.
-ముహమ్మద్ ముజాహిద్, 96406 22076