పుట్టింట వంటబట్టించుకున్న కళ అత్తారింట కొత్త సొబగులు అద్దుకుంది. భర్త కష్టానికి తన సృజనాత్మకతను జోడిస్తూ అనుబంధాల మగ్గంపై బాధ్యతల వస్త్రం నేసిందామె. పడుగు, పేక కుదిరితే చాలదు.. తమ ఉత్పత్తులు ఎన్నో కళల కలనేత అనిపించుకోవాలంటే రంగులు, హంగులు అన్నీ ఉండాలనుకుంది. ఆ దిశగా భర్తకు చేదోడువాదోడుగా నిలిచి.. వస్త్ర వ్యాపారంలో నిలదొక్కుకుంది. ఇప్పుడు జాతీయ స్థాయి చేనేత పురస్కారానికి ఎంపికైంది నల్లగొండ జిల్లాకు చెందిన గజం నర్మద. పట్టుదలతో పట్టువస్ర్తాల నేతలో తమకంటూ ప్రత్యేకత చాటుకున్న నర్మద విజయ ప్రస్థానమిది..
ఎంత సృజనాత్మకత ఉన్నా.. మరెంత కష్టపడే గుణం ఉన్నా.. నేతన్న బతుకులు భారంగానే సాగిపోతుంటాయి. అలాంటి చేనేత కుటుంబంలోనే పుట్టింది నర్మద. నల్లగొండ జిల్లా కనగల్ మండలం శాబ్దుల్లాపురం ఆమె సొంతూరు. తాత, తండ్రి చేనేత వృత్తిలోనే కొనసాగారు. మగ్గం ఆటనే లాలి పాటగా వింటూ పెరిగింది నర్మద. అమ్మతో కలిసి రాట్నంతో పాటు చిటికీలు తిప్పడం ఆమెకు ఆటవిడుపుగా ఉండేది. సరదాగా చేసిన పనితో ఎన్నో పాఠాలు నేర్చుకుంది. ఇంటర్లో ఉండగానే నర్మదకు పెండ్లి సంబంధాలు చూశారు. చేనేత వస్ర్తాల ఉత్పత్తిలో పట్టున్న పుట్టపాకకు చెందిన గజం నరేందర్‌తో ఆమెకు వివాహమైంది.
భర్త కుటుంబానికి చేనేతే జీవనాధారం. వారిది మరో శైలి. సొంతంగా తయారు చేసుకున్న డిజైన్లను మగ్గం మీద నేసేవారు వాళ్లు. వాటిని పోచంపల్లి, హైదరాబాద్‌కు తీసుకెళ్లి విక్రయించేవారు. కలర్ కాంబినేషన్లు, డిజైనింగ్‌పై ఆసక్తి ఉన్న నర్మదకు మంచి వేదిక దొరికినట్టయింది. భర్త పనిలో తానూ భాగమైంది. మార్కెటింగ్‌లో మరింత రాణించాలనే ఉద్దేశంతో 2001లో నర్మద, నరేందర్ దంపతులు తమ మకాం హైదరాబాద్‌కు మార్చారు. తాము నేసిన డిజైనింగ్ పట్టు చీరలను ఇక్కడి పెద్ద పెద్ద షోరూమ్స్‌లో విక్రయించడానికి ప్రయత్నించారు. మొదట్లో పెద్దగా స్పందన వచ్చేది కాదు. అయినా విశ్రమించలేదు. మరింత నాణ్యతతో కూడిన వినూత్నమైన చీరల ఉత్పత్తి ప్రారంభించారు. మెల్లగా డిమాండ్ పెరగసాగింది. చందనా బ్రదర్స్, బొమ్మన బ్రదర్స్, కళాంజలి లాంటి షోరూమ్స్ నుంచి వీరికి ఆర్డర్లు రావడం మొదలైంది.
వ్యాపారం కాస్త కుదురుగా సాగుతుండటంతో 2013లో నరేందర్ హ్యాండ్లూమ్స్ పేరుతో ఫర్మ్ రిజిస్టర్ చేశారు. రూ.లక్షతో బిజినెస్ మొదలుపెట్టారు. డిజైన్లు, కలర్ కాంబినేషన్ల ఎంపికలో నర్మద కీలకంగా వ్యవహరించేది. ఆమె ఆసక్తిని గమనించిన నరేందర్ ఈ ఫర్మ్ ప్రొప్రైటర్ బాధ్యతలు భార్యకే అప్పగించాడు. ఏ డిజైన్ కావాలి, ఏ రంగుల్లో కావాలో చెప్పి కార్మికులతో చీరలు నేయించేది ఆమె. మారుతున్న కాలానికి అనుగుణంగా, కస్టమర్ల అభిరుచికి తగ్గట్టుగా నయా డిజైన్లు సృష్టించేది.
అదే సమయంలో క్వాలిటీలో రాజీపడకుండా ప్రయత్నాలు కొనసాగించేది. పట్టుచీరలతోపాటు ఇక్కత్ డిజైన్‌లో పట్టు దుపట్టాలు, ఫ్యాబ్రిక్, పటోలా, డ్రెస్ మెటీరియల్స్ ఉత్పత్తి కూడా ప్రారంభించి అందులోనూ సక్సెస్ అయ్యారు. మొదట్లో హైదరాబాద్‌లోని షోరూమ్‌లకు మాత్రమే పరిమితమైన వీరి ఉత్పత్తులు తర్వాత దేశవ్యాప్తంగా 15 నగరాలకు ఎగుమతి జరిగే స్థాయికి చేరుకున్నాయి. ఢిల్లీలోని గ్రీన్వెస్ట్ షోరూమ్, ముంబయిలోని రూప్ కళాశారీస్, కోల్‌కతాలోని ప్రముఖ వస్త్ర దుకాణాలకూ నరేంద్ర హ్యాండ్లూమ్స్ వస్ర్తాలు సప్లయ్ అవుతున్నాయి.
మొదట్లో తమ సొంత మగ్గంపైనే వస్ర్తాలు నేసేవారు. వ్యాపారం పెరిగేకొద్దీ ఇతర నేతన్నలకూ ఉపాధి కల్పించడం మొదలుపెట్టారు. ఇలా పది, ఇరవై, యాభై, వంద మగ్గాలపై వస్ర్తాలు నేయించుకుంటూ ముందుకువెళ్లారు. ఇప్పుడు నరేందర్ ఫర్మ్ కోసం ఏకంగా 300 మగ్గాలు నిరంతరం పని చేస్తున్నాయి. అలా మూడు వందల కుటుంబాలకు ఉపాధి దొరికినట్టయింది. పుట్టపాకతోపాటు గట్టుప్పల్, తేరట్ పల్లి, చండూరు, నారాయణపురం, మునుగోడు తదితర గ్రామాల్లోని నేతన్నలు వీరి పనిలో పాలుపంచుకుంటున్నారు. ముడిసరుకు ఫర్మ్ ద్వారా అందజేస్తారు.
ఇలా ఉత్పత్తి అయిన వస్ర్తాలను నరేందర్ హ్యాండ్లూమ్స్ ద్వారా విక్రయిస్తారు. తమ వ్యాపారం విస్తరించడం ద్వారా 300 కుటుంబాలకు ఉపాధి దొరకడం ఆనందంగా ఉందంటున్నది నర్మద. రూ.10వేల నుంచి రూ.50వేల విలువైన పట్టుచీరలు వీళ్లు రూపొందిస్తున్నారు. ఏటికేడూ విక్రయాలు పెంచుతూ 2023 నాటికి రూ.6 కోట్ల టర్నోవర్ చేరుకున్నారు. మరుసటి ఏడాదికే రూ.8 కోట్ల టర్నోవర్ సాధించారు. ఈ క్రమంలో తమ కృషిని తెలియజేస్తూ జాతీయ చేనేత అవార్డుకు దరఖాస్తు చేసుకోగా.. ఆ పురస్కారానికి నర్మద ఎంపికైంది. ఆగస్టు 7న రాష్ట్రపతి చేతుల మీదుగా ఆమె ఈ పురస్కారం అందుకోనున్నది. పట్టుదలతో ఒక్కో మెట్టు ఎక్కి.. నమ్ముకున్న కళకు తన సృజనతో వన్నె తెచ్చిన నర్మదను మనమూ అభినందిద్దాం!!
నాకు కలర్స్, మ్యాచింగ్, మార్కెట్ ట్రెండ్స్‌పై ఆసక్తి ఎక్కువగా ఉండేది. నా ఎంపికపై మా ఆయనకు ఎంతో నమ్మకం ఉండేది. అదే నేను ఈ వ్యాపారంలోకి రావడానికి కారణమైంది. హైదరాబాద్‌కు వచ్చిన కొత్తలో చిన్నస్టోర్ పెట్టి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాం. కానీ, నాకు, మా ఆయనకు పట్టుదల ఎక్కువ. ప్రముఖ షోరూమ్స్‌ను సంప్రదించి కొత్త డిజైన్లు రూపొందించాం. నిదానంగా నిలదొక్కుకున్నాం. కరోనా సమయంలో స్టాక్ పేరుకుపోయి చాలా ఇబ్బందులు పడ్డాం. ఈ సమయంలోనే దేశంలోని ఇతర నగరాలపై దృష్టి పెట్టి సక్సెస్ అయ్యాం. ఇప్పుడు రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకోనుండటం చాలా సంతోషంగా అనిపిస్తున్నది. ఈ అవార్డుతో మా బాధ్యత మరింత పెరుగుతుంది. మా వ్యాపారంతోపాటు చేనేత వృత్తి పెంపుదలకు నిరంతరం శ్రమిస్తూనే ఉంటాం. మరింతమంది కార్మికులకు ఉపాధి కల్పించడమే మా లక్ష్యం.
-మర్రి మహేందర్‌రెడ్డి