చదరంగంలో.. మెదడే ఓ రణభూమి! ప్రతి గడీ ముఖ్యమే. ప్రతి ఎత్తూ కీలకమే. రాజులా ఆలోచించాలి. మంత్రిలా వ్యూహం పన్నాలి. గజబలమై సాగాలి. అశ్వదళమై దుమ్మురేపాలి. సిపాయిలా ఏ త్యాగానికైనా సిద్ధపడాలి. ప్రస్తుతం, హంగరీలో అంతర్జాతీయ చెస్ టోర్నీ ఆడుతున్న తెలంగాణ తేజం రాజా రిత్విక్ రాజవరం ఆ వ్యూహ ప్రతివ్యూహాలన్నీ ఉగ్గుపాలతోనే నేర్చాడు. అమ్మ ఒడిలో రాటుదేలాడు. ‘విజయాల్లో, అపజయాల్లో నా పక్కన అమ్మ లేకపోతే.. నేనీ స్థానంలో ఉండేవాడినే కాదు’ అంటాడు రిత్విక్.
‘ఇదొక విలక్షణమైన ఆట. ప్రత్యర్థిని పావును చేయడమా? ప్రత్యర్థి చేతిలో పావుగా మారడమా? .. అనేది మన ఎత్తుల్లోనే ఉంటుంది. అందుకే, చెస్ నాకు మాంచి కిక్ ఇచ్చే గేమ్’ అంటున్నాడు రిత్విక్ రాజవరం. ఈ పదిహేడేండ్ల వరంగల్ పిల్లగాడు తెలంగాణ నుంచి మూడో గ్రాండ్‌మాస్టర్. భారత్ నుంచి 70వ గ్రాండ్‌మాస్టర్ (జీఎం). హంగరీలోని బుడాపెస్ట్ వేదికగా జరుగుతున్న అంతర్జాతీయ చెస్ టోర్నీలో జీఎం హోదా సంపాదించాడు రిత్విక్. ఎక్కడికెళ్లినా సరే, తనతోపాటు చదరంగం బల్ల ఉండాల్సిందే, అమ్మ తోడుగా రావాల్సిందే. అసలే రిత్విక్ శాకాహారి. విదేశాలకు వెళ్లినప్పుడు ఆహారం తీవ్ర సమస్య అవుతుంది. ఆకలికి, ఆలోచనలకు అవినాభావ సంబంధం ఉంటుంది. సరైన పోషక విలువలు అందకపోతే, ఆరోగ్యం పాడవుతుంది. ఏకాగ్రత దెబ్బ తింటుంది. బిడ్డ ఆకలి, అవసరాలు అమ్మకు కాక ఇంకెవరికి అర్థం అవుతాయి? కొడుకును గ్రాండ్‌మాస్టర్‌గా చూడాలన్న లక్ష్యంతో తల్లి దీపిక తన కెరీర్‌ను పక్కనపెట్టారు. కెమిస్ట్రీ లెక్చరర్ ఉద్యోగాన్ని వదిలేసి, దగ్గరుండి మరీ కొడుకు బాగోగులు చూస్తున్నారు. రిత్విక్ ఏ టోర్నీకి వెళ్లినా పక్కన తను ఉండాల్సిందే. టోర్నీ జరిగే ప్రదేశానికి దగ్గర్లో ఓ అపార్ట్మెంట్ అద్దెకు తీసుకొని, రిత్విక్‌కు నచ్చిన ఆహారం వండిపెడుతుందా తల్లి. విదేశీ టోర్నీల్లోనూ అంతే. స్థానికంగా బియ్యం, కాయగూరలు లభించకపోతే, ఆన్లైన్లో ఆర్డర్ చేసి, కొడుకు ఇంటికి వచ్చేసరికి అన్నీ సిద్ధం చేస్తారు. ఆట అంటేనే.. జయాపజయాల సమాహారం! కొన్నిసార్లు గెలుస్తారు, కొన్నిసార్లు ఓడిపోతారు. ఎంత క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించినా.. ఓటమి దెబ్బకు మనసు చివుక్కుమంటుంది. ఆ సమయంలో అమ్మగా దీపిక ధైర్యం చెబుతారు. కర్తవ్యం బోధిస్తారు. గీతోపదేశాన్ని తలపించే మాతృసందేశమది! ఆ నాలుగు మాటలే డజను వ్యక్తిత్వ వికాస పుస్తకాలతో సమానం. అంతే, రిత్విక్ మళ్లీ మామూలు మనిషి అవుతాడు. అతడిలోని ఆటగాడు మరింత రాటుదేలతాడు. ‘ఒక్కమాటలో చెప్పాలంటే నాటి భీమవరం టోర్నీ నుంచి నేటి హంగరీ వరకూ ప్రతిచోటా నన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నది అమ్మ’ అని చెబుతున్నాడు రిత్విక్.
నాన్నే తొలి గురువు..
రిత్విక్ తండ్రి శ్రీనివాస్ విద్యుత్ శాఖలో ఉన్నతోద్యోగి. యూనివర్సిటీ స్థాయి చెస్ ఆటగాడు. విద్యుత్ బోర్డులు నిర్వహించే చెస్ టోర్నీలలో చాంపియన్ కూడా. అలా, రిత్విక్‌కు చదరంగం వారసత్వంగా అబ్బింది. శ్రీనివాస్ ఆఫీసు నుంచి రాగానే, తండ్రీకొడుకుల చదరంగం మొదలయ్యేది. నాన్న ఆట విధానాన్ని జాగ్రత్తగా గమనించేవాడు రిత్విక్. ఐదో ఏడు వచ్చేసరికి.. తండ్రికి సవాలు విసిరే స్థాయికి చేరాడు. అప్పుడే, కొడుకులో భవిష్యత్ గ్రాండ్‌మాస్టర్‌ను చూశారు దీపిక, శ్రీనివాస్. మెరుగైన సాధన కోసం కోచ్ బొల్లం సంపత్ దగ్గరకు పంపారు.
గ్రాండ్ మాస్టర్‌గా..
కొంత శిక్షణ తర్వాత, 2009లో భీమవరంలో జరిగిన అండర్-7 చెస్ పోటీల్లో ఎటువంటి అంచనాలూ లేకుండానే చాంపియన్‌షిప్ సాధించాడు రిత్విక్. తాజాగా హంగరీలోనూ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ.. 2,501 ఎలో రేటింగ్ పాయింట్లతో ‘గ్రాండ్‌మాస్టర్’గా అవతరించాడు. ఎక్కడికి వెళ్లినా సరే.. సాయంత్రానికి ఆట విధానాన్ని తల్లిదండ్రులతో షేర్ చేసుకోవడం, సలహాలు తీసుకోవడం తనకు అలవాటు. రిత్విక్ ఆటల్లోనే కాదు, చదువులోనూ టాపే. సికింద్రాబాద్ సైనిక్‌పురిలోని భవన్స్ శ్రీరామకృష్ణ విద్యాలయంలో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. బిడ్డ శిక్షణ కోసమే హైదరాబాద్ వచ్చేసింది రిత్విక్ ఫ్యామిలీ. ఇక్కడ, కోచ్ కె.నర్సింహారావు శిక్షణలో మరింత రాటుదేలాడు. ప్రస్తుతం ‘రేస్ చెస్ అకాడమీ’లో శిక్షణ తీసుకుంటున్నాడు. గ్రాండ్ మాస్టర్ నుంచి సూపర్ గ్రాండ్‌మాస్టర్ సాధించేందుకు ఉక్రెయిన్‌కు చెందిన కోచ్ అలెగ్జాండర్ గొలోస్చొపోవ్ దగ్గర ఆన్లైన్లో తర్ఫీదు పొందుతున్నాడు. విశ్వనాథన్ ఆనంద్ తన రోల్ మోడల్. చదువుల్లో అక్క హారిక తనకు ఆదర్శమని చెబుతాడు రిత్విక్. ఇప్పటి వరకు అధికారికంగా నిర్వహించిన టోర్నీల్లో 5 నేషనల్, 13 ఇంటర్నేషనల్ మెడల్స్ సాధించాడు. వీటిల్లో జాతీయస్థాయిలో మూడు బంగారు, రెండు రజత పతకాలు ఉన్నాయి. 13
అంతర్జాతీయ టోర్నీల్లో 10 బంగారు, రెండు రజత పతకాలు, ఒక కాంస్య పతకం సాధించాడు.
ఆర్థిక ప్రోత్సాహం కావాలి
అంతర్జాతీయ చెస్ టోర్నీలు కనీసం పదిరోజులపాటు సాగుతాయి. రిత్విక్ ఒక్కో విదేశీ టోర్నీ ఆడాలంటే ఎంట్రీ ఫీజు, విమాన చార్జీలు, వసతి, భోజన ఏర్పాట్లకు దాదాపు రూ.50వేల వరకు ఖర్చు అవుతుంది. స్పాన్సర్షిప్ లేకపోవడంతో ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నామని రిత్విక్ తల్లిదండ్రులు చెబుతున్నారు. ప్రభుత్వం నుంచి కొంత తోడ్పాటు ఉంటే బాగుంటుందని అంటున్నారు. ‘నా లక్ష్యం 2,600 పాయింట్లు. అతి త్వరలోనే దాన్నీ సాధిస్తా. సూపర్ గ్రాండ్ మాస్టర్‌కు చేరుకోవడమే నా లక్ష్యం’ అంటున్నాడు రిత్విక్.
… డప్పు రవి