కంటెంట్ క్రియేటర్లు, సాహసికులు, ఔత్సాహిక వీడియోగ్రాఫర్లు.. ‘గో ప్రో’ కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తుంటారు. వారి నిరీక్షణకు తెర దించుతూ.. ‘మ్యాక్స్ 2’ పేరుతో మరో అత్యుత్తమమైన 360 కెమెరాను తీసుకొచ్చింది ‘గో ప్రో’ సంస్థ. అద్భుతమైన ఫీచర్లు, ఆధునిక సాంకేతికతతో తయారైన ‘మ్యాక్స్ 2’లో అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఏకైక ట్రూ 8కె 360 వీడియో క్యాప్చర్ కెమెరా ఇదేననీ సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. ఇతర కెమెరాల కన్నా 21 శాతం వరకు ఎక్కువ రిజల్యూషన్‌తో వీడియోలను అందిస్తుందని అంటున్నారు. 10-బిట్ కలర్ వీడియోలలో 1 బిలియన్ కంటే ఎక్కువ రంగులను క్యాప్చర్ చేయగలుగుతుందని పేర్కొంటున్నారు. మ్యాక్స్ 2.. కేవలం యాక్షన్ వీడియోల కోసం మాత్రమే కాదు. ప్రొఫెషనల్ ఫొటోగ్రఫీ కోసం కూడా పనికొస్తుందట. ఇందులోని 29 మెగా పిక్సెల్ కెమెరాతో అద్భుతమైన ఫొటోలు తీసుకోవచ్చు. ఈ మోడల్లోని మరో ప్రత్యేకత.. ట్విస్ట్-అండ్ గో రీప్లేసబుల్ లెన్స్‌లు. ఎంతో మన్నికగా, నీటిలోనూ వీడియోలు తీసుకునేలా ఆప్టికల్ గ్లాస్‌తో వీటిని తయారుచేశారు. సులభంగా మార్చుకునేలా రూపకల్పన చేశారు. ఇక మరో అద్భుతమైన ఫీచర్.. ఇందులో 6 మైక్రోఫోన్లు ఉంటాయి. 360 డిగ్రీల ఆడియోను అందిస్తాయి.
వైర్లెస్ బ్లూటూత్, ఆడియో ఫీల్డ్ ఆఫ్-వ్యూ, విండ్ నాయిస్ లాంటి మరిన్ని అదనపు ఫీచర్లను ఈ కెమెరాకు జోడించారు. ఎడిటింగ్‌ను మరింత సులభతరం చేయడానికి ఏఐ ఆధారిత సాఫ్ట్‌వేర్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఇక ‘గో ప్రో’ సబ్‌స్ర్కైబర్లు తమ ఫుటేజ్‌ను స్టోర్ చేసుకోవడానికి అపరిమిత క్లౌడ్ స్టోరేజీని అందిస్తున్నది. దాంతో ఫోన్, కంప్యూటర్లో స్టోరేజీ గురించి చింతించాల్సిన అవసరం లేదు. సెల్ఫీ వీడియోల కోసం ప్రత్యేకమైన మోడ్స్‌ను అందిస్తున్నారు. ఇందులో 1960ఎంఏహెచ్ సామర్థ్యం కలిగిన కోల్డ్వెదర్ ఎండ్యూరో బ్యాటరీని ఏర్పాటు చేశారు. గడ్డకట్టే చలిలోనూ అసాధారణమైన పనితీరు కనబరుస్తుంది. ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా ఎటువంటి ఆటంకం లేకుండా వీడియోలు తీసుకోవచ్చు. ఇన్‌బిల్ట్ జీపీఎస్ కలిగిన ఏకైక 360 కెమెరా కూడా ఇదే! ఇన్ని ఫీచర్లు కలిగిన ‘గో ప్రో మ్యాక్స్ 2’ కెమెరా ఖరీదు.. రూ.44,500 వరకూ ఉన్నది. త్వరలోనే బహిరంగ మార్కెట్లోకి రానున్నది.