ప్రియమైన పాఠక బంధువులారా! రస సింధువైన భాగవతంలో మధుర భక్తి రసం చేత ఓత ప్రోతమైన- పూర్తమైన (నిండిన) అనేక ‘గీతలు’న్నాయి. వాటిలో అన్యతమం- మేటి అయినది దశమ స్కంధంలోని గోపికా గీతలు. అనంతరం అంతటి రస భావ బంధురమైనవి, రసిక భావుకుల ఎదలను కదలించి కరిగించేవి, ముదము కూర్చేవి షట్పద (భ్రమర) గీతలు. గోప భామినులు ప్రేమ యోగినులు. మురారి- కృష్ణునిపై వారి ప్రేమ అవారిత- అనిరుద్ధ (అప్రతిహత)మైన నిష్కామ, నిష్కపట విశుద్ధ భక్తి. సర్వోచ్చ, స్వచ్ఛ పరాభక్తికి గోపికలే ఆదర్శమూర్తులు- ‘యథా వ్రజ గోపికానాం’. వారి తరువాతే ఇతరులెవరైనా అని భక్తి దర్శనానికి ఆచార్యుడు- ప్రవక్త నారదుడు సూత్రీకరించాడు. ‘తత్ సుఖే సుఖిత్వం’ (మాధవ- మా స్వామి సుఖమే మా సుఖం). ఇదే గోపీత్వం- గోపీభావం! ఈ ఘట్టమందు మూలంలోని రసకందాయం- రసపట్టులాంటి అందమైన 15 శ్లోకాలకు పోతన అమాత్యుని అనువాద పద్యాలు పొందలేకపోవడం తెలుగువారమైన మనమందరి మందభాగ్యం.
శుకయోగి- పరీక్షిత్తుతో.. రాజా! ఒకనాడు శ్రీకాంతుడు- కృష్ణుడు ఏకాంతంలో… ‘నాయందే మనసు నిలిపి, నన్నే అంతరాత్మగా పొంది ఉన్న గోపకాంతలు నా రాకకై ఎదురు చూస్తూ ఎంతగా వగ చెందుతున్నారో! భ్రాంత చిత్తలైన ఆ ఇంతులు పాపం, ఎంత దైన్యం పాలవుతున్నారో! కోపంతో నన్నెంతగా దిగనాడు- దూషించుతున్నారో!’ అని తలచి-
క॥ ‘సిద్ధ విచారు గభీరున్ వృద్ధ వచో వర్ణనీయు వృష్ణి ప్రవరున్
బుద్ధినిధి నమర గురు సము
నుద్ధవునిం జూచి కృష్ణ డొయ్యన పలికెన్’…
వసుదేవుని సోదరుడైన దేవభాగుని పుత్రుడు, యదువంశీయుల మంత్రివర్యుడు, కుదురైన ఉదాత్తభావాలు కలవాడు, వృద్ధులు మెచ్చేవాడు, బృహస్పతి శిష్యుడు, మహా బుద్ధిమంతుడు, అన్నింటినీ మించి వెన్నుని- వెన్నదొంగను వెన్నంటి ఉండే మిన్నయైన ఏకాంత భక్తుడూ అయిన ఉద్ధవుని పిలిపించాడు. ప్రపన్నుల ఆర్తిని హరించే అనిరుద్ధుడు శ్రీహరి ఉద్ధవుని చేతులు పుచ్చుకొని ఇలా అన్నాడు…
క॥ ‘లౌకిక మొల్లక నన్నా
లోకించు ప్రపన్నులకును లోబడి కరుణా
లోకనముల బోషింతును
నాకాశ్రిత రక్షణములు నైసర్గికముల్..’
“లోక ధర్మాలు దిగవిడిచి లోకైక పతినైన నాయందే రతి- చూపు నిలిపి, నన్నే శరణన్న వారికి నేను వశపడి ఉంటాను. దయామయ దృక్కులతో అహర్నిశం వారిని కాపాడుతుంటాను. ఉద్ధవా! నన్నాశ్రయించిన వారికి దన్నుగా నిలవడం నాకు వెన్నతో పెట్టిన విద్య- స్వభావ సిద్ధమైన గుణం. ‘అరవిందాల వంటి ఆననాలు (ముఖాలు) కలిగిన అతివలారా! సందేహం మానండి. నేను మిమ్ములను విడువను. బృందావనానికి తప్పక వస్తాను.’ అని అరవిందాక్షుడు హరి సందేశం పంపాడని నీవు రహస్యంగా గోపికలతో చెప్పు” అంటూ సిద్ధ సంకల్పుడు కృష్ణుడు ఉద్ధవుని వ్రజభూమికి సాగనంపాడు.
అసలు సంగతి ఏమిటంటే, ఇక్కడ దయాంతరంగుడు శార్ఙి సంకల్పం వేరు. ఉద్ధవునికి ‘నేను మహాజ్ఞానిని’ అన్న పెద్ద అహంకారం. ఆయనకున్నది పరోక్ష- శాస్త్ర జ్ఞానమే కాని, అపరోక్ష- స్వరూప అనుభవ జ్ఞానం కాదు. వాచా జ్ఞానానికి, అజ్ఞానానికి అభేదాన్ని చెప్పింది వేదాంతం. పరాభక్తి- అపరోక్ష జ్ఞానం కలవారికి అభిమానం- అహంకారం ఏమాత్రం ఉండే వీలు లేదు. ఉంటే అది బ్రహ్మనిష్ఠ కాదు. అట్టి వ్యక్తి బ్రహ్మవాదియే కాని బ్రహ్మవేది కాజాలడు. ఈ గర్వమే సర్వాత్మ భావ ప్రాప్తి- మోక్షానికి అఖర్వ- అధికమైన అవరోధం- ప్రతిబంధకం. భగవంతుడు భక్తునిలో అభిమానం కించిత్తు కూడా సహించడు.
ఆయనకది మహా అప్రియం. అభిమానం ఉన్నచోట ‘అమాని’ (‘అమానీ మానదో మాన్యః’- (విష్ణు సహస్రనామం))- వెన్నుడు ఉండడు. పరమాత్మకి ఎంతసేపటికీ దైన్యం- దీనత్వం అంటే చాలా ఇష్టం. అందుకే ఏదో ఒక మాయ- లీల చేసి తనవాడైన భక్తునిలోని అభిమానాన్ని తొలగిస్తాడు. అదే భక్త వాత్సల్యం! పరమాత్మకు ఉద్ధవుని యందు పరమప్రేమ. కాని, ఆయనకి అచ్యుతుని యందు గోపికలకున్నంతగా ప్రేమ లేదు. అతనిది శుష్కమైన జ్ఞానం. ఉద్ధవుడు భగవత్ ప్రేమను చవి చూడనివాడు. ‘భక్తి హీనంబులయిన జ్ఞాన, వాచా, కర్మ కౌశలంబులు నిరర్థకంబులు’ (ప్రథమ స్కంధం) అని భాగవత సిద్ధాంతం. జ్ఞానము, వాక్కు, కర్మ- ఇవి ఎంత గొప్పవైనా భక్తి లేనిచో ఇసుమంత కూడా పనికిరావు.
నిర్గుణ జ్ఞానం కూడా విష్ణుభక్తి లేనిదే విశేషంగా ప్రకాశించదు- సమగ్రమైన అపరోక్షానుభూతిని కలిగించదని భావం. కనుక ఉద్ధవుని సందేశ వాహకునిగా- తన దూతగా వ్రేతల వద్దకు పంపితే, వారి సాంగత్యంలో- సత్సంగతి, గురుత్వంలో భగవద్ రతి- దివ్యప్రేమ పాఠాల ఓనమాలు దిద్దుకుని ప్రబుద్ధుడు- పరిణత మనస్కుడు అవుతాడని భగవదాశయం. వనమాలి కృష్ణుని సంకల్పం సంపూర్ణంగా ఫలించిందనడానికి ఉద్ధవుని ఈ అనుభవ వాక్యాలే పెను నిదర్శనం… ‘నందవ్రజ- బృందావన నివాసినులైన గోపికల పాదధూళికి నేను పునఃపునః- పదేపదే వందనాలు సమర్పిస్తా. ఆ పాదరజాన్ని నా శిరస్సుపై ధరిస్తా. ఈ హేలావతులు అరవిందాక్షుని లీలా కథా విలాసాల గురించి ఆలపించిన, పాడిన- మధుర రస గీతాలు మూడు లోకాలనూ పవిత్ర పరుస్తున్నాయి.’
శుకుడు- రాజా! రథమధిరోహించి ఉద్ధవుడు గోధూళి వేళకు గోకులం చేరి నందుని మందిర ప్రవేశం చేశాడు. నందుడు ఆనందంతో ‘మా పాలిటి యదు నందనుడే- కృష్ణుడే ఇతడు’ అంటూ ఉద్ధవుని కౌగిలించుకొని సాదరంగా అర్చించాడు. సంతోషంతో ఇలా అడిగాడు…
శా॥ ‘అన్నా! భద్రమె? తల్లిదండ్రుల మమున్ హర్షించి చింతించునే?
తన్నుం బాసిన గోప గోపికల మిత్ర వ్రాతమున్ గోగణం
బున్నిత్యంబు దలంచునే? వననదీ భూముల్ ప్రసంగించునే?
వెన్నుండెన్నడు వచ్చునయ్య! యిటు మా వ్రేపల్లెకు న్నుద్ధవా!’
అన్నా! ఉద్ధవా! మథురలో మన వారంతా క్షేమంగా ఉన్నారా? కన్నయ్య, అమ్మానాన్నలమైన మమ్ము ఏనాడన్నా తలుచుకుంటాడా? తన్ను బాసిన- తనకు దూరమైన గోపన్నలను, గోపకాంతలను, కన్నెలను, మిన్నలైన బాలగోపాలురను, ఆలమందలను గూర్చి ముచ్చటిస్తూ ఉంటాడా? వెన్నుడు మా వ్రేపల్లెకు ఎన్నడు వస్తాడయ్యా?
క॥ ‘అంకిలి కలుగక మా కక
లంకేందుని పగిది గాంతి లసితంబగు త
త్పంకజ నయనుని నెమ్ముగ
మింక విలోకింప గలనె యీ జన్మమునన్’
కందు (కళంకం) లేని చందురుని చందంగా (వలె) అందాలు చిందిస్తూ వెలుగులు వెదజల్లే ఆ వనజాక్షుని సదయమైన- దయతో కూడిన వదనాన్ని కనగలిగే అదృష్టం ఈ జన్మలో కలుగుతుందా? ఈ విధంగా నందుడు, గోవిందుడు మున్ను గోకులంలో చేసిన మన్ను తినడం, వెన్న దొంగిలడం, కన్నెలతో విహరించడం- మొదలైన వన్నె చిన్నెల పనులన్నీ చెప్పిచెప్పి బొంగురు పోయిన గొంతుతో వికలుడై మాట్లాడలేక, కన్నీటితో కలకబారిన కన్నులతో మిన్నకుండిపోయాడు.
యశోదమ్మ కూడా తన తనయునితో పెనవేసుకొన్న ఆత్మీయత కతన- కారణాన మనలేక ప్రేమతో పరవశించిన మనసు కలదై, చనుమొనల నుండి వాత్సల్య క్షీరము- పాలు జాలువారగా, కనుగొనల నుండి కరుణా నీరము- కన్నీటి ధారలు కారగా చలించి పోయింది. కృష్ణుని యందు వారికున్న అనురాగంతో కుందుతున్న యశోదా నందులను చూచి ఉద్ధవుడు వారికి ఇలా విన్నవించాడు- జననీ జనకులైన మిమ్ము కనుగొన- దర్శించడానికి వనజాక్షుడు త్వరలోనే వస్తాడు. మీకు శుభాలు కలిగిస్తాడు. మీరు మనసులో దిగులు పడక ధైర్యంగా ఉండండి…
మ॥ ‘బలుడుం గృష్ణుడు మర్త్యులే! వసుమతీ భారంబు వారింప వా
రల రూపంబుల బుట్టినాడు హరి నిర్వాణ ప్రభుం, డెవ్వడు
జ్జలుడై ప్రాణ వియోగ కాలమున దత్సర్వేశు జింతించు, వా
డలఘు శ్రేయము బొందు బ్రహ్మమయుడై యర్కాభుడై నిత్యుడై’.
– ‘కృష్ణరాములు సామాన్య మానవులా? సృష్టికి నిమిత్త ఉపాదాన కారణాలు. పురుషుడు కృష్ణుడు. ఆ పురుష శక్తి- ప్రధానం (ప్రకృతి) బలరాముడు. భూ భారాన్ని వారించడానికి మోక్షాధిపతి నారాయణుడే వారిగా- రామకృష్ణులుగా అవతరించాడు. ఆయనపై మీ మనసులు అనన్యంగా నిలిచాయి. ఆయనను కొలిచిన మీరు ఎంతో ధన్యులు. ఆ స్వామికి మాతాపితరులు, పుత్రకళత్రాలు, శత్రుమిత్రులు, ఇష్టులు అయిష్టులూ అంటూ ఎవ్వరూ ఉండరు. జనన మరణాలు లేవు. త్రిగుణ రహితుడైనా సజ్జన హితానికై గుణాలు ధరించి హేల (విలాసం)గా సృష్టి, స్థితి, లయాలు అనే లీలలు సాగిస్తూ ఉంటాడు. నందా! కృష్ణుడు తప్ప తత్తతః- తాత్తికంగా చెప్పదగినది, నిర్వచింపదగింది అయిన మరో వస్తువే లేదు. ఆ భగవంతుని తలుస్తూ మరణించిన జ్ఞానీభక్తుడు, సూర్యుని వలె తేజోవంతుడై, బ్రహ్మ స్వరూపుడై ముక్తిని పొందుతాడు.’ శుకుడు- రాజా! ఇలా పలువిధాల ఉద్ధవుడు నగధరుని మహిమలు ముచ్చటిస్తూ ఆ రాత్రిలో సగపాలు గడిపాడు.
తెల్లవారుతుండగానే గొల్ల పడుచులు మేల్కాంచి, ఇళ్లలో దీపాలు వెలిగించి వాస్తు (గడపలు, గుమ్మాల) పూజ గావించి, చల్ల- పెరుగు చిలకడం మొదలెట్టారు. ఆ చప్పుళ్లు విని ఉద్ధవుడు నిద్ర లేచి అనుష్ఠానం ముగించుకుని ఏకాంతంగా ఉన్నాడు. ఆయనను కని సిగ్గుతో కూడిన నవ్వులు, చూపులతో గొల్ల చెలువలు మనసులు తనియగా- ఉల్లసిల్లగా అచ్చటికి చేరి ఉద్ధవునితో ఇలా ముచ్చటించారు…
(సశేషం)
-తంగిరాల రాజేంద్రప్రసాద శర్మ 98668 36006