రక్తం వృద్ధి చెందాలంటే బీట్రూట్ తినండి.. ఇది పాత ముచ్చట. చర్మం మిలమిలా మెరవాలంటే బీట్రూట్ రాయండి… ఇది కొత్త ముచ్చట. అవును, బీట్రూట్కు చర్మ సౌందర్య సాధనలోనూ మంచి స్థానం ఉంది. ఇందులోని బీటాలిన్, విటమిన్-సిలు చర్మాన్ని యవ్వనంగా ఉంచేందుకు సాయపడతాయి. బీట్రూట్లోని ఇతర పోషకాలు పిగ్మెంటేషన్‌ను, మచ్చలను తొలగించి తేమను నిలిపి ఉంచేందుకు తోడ్పడతాయి. అందుకే దీంతో ఫేస్‌మాస్క్‌లు వేసుకోవడం చలికాలంలో ఎంతో మేలు చేస్తుంది.
బీట్రూట్ రసంలో కొంచెం వేపపొడి, రోజ్‌వాటర్, బేకింగ్ సోడాలు కలిపి మిశ్రమంగా చేసి ముఖానికి రాసి ఆరిన తర్వాత కడిగేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే మొటిమల సమస్య తగ్గుతుంది.
ముల్తానీ మట్టి, రోజ్వాటర్లను బీట్రూట్ పేస్ట్‌కు జోడించి మెడ, ముఖం మీద ఐప్లె చేయాలి. పావుగంట తర్వాత గోరు వెచ్చటి నీటితో కడిగేస్తే జిడ్డు చర్మం నుంచి ఉపశమనం పొందొచ్చు.
చందనం పొడిని, మెత్తగా రుబ్బిన బీట్రూట్ ముద్దతో కలిపి ముఖానికి మందమైన మాస్క్‌లా వేసి, కాస్త ఆరిన తర్వాత కడిగేయాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే మెరిసే చర్మం సొంతమవుతుంది.