‘మీరు వాడేసిన వస్తువులు ఇవ్వండి. చద్దర్లు కానివ్వండి, వేసుకునే దుస్తులు అవ్వనివ్వండి.. మాకు ఇవ్వండి! వాటిని అనాథాశ్రమాల్లోని పిల్లలకు పంచుతాం’ అంటూ ఆటోలో తిరుగుతూ ప్రచారం చేస్తుంటారు. మనమూ చాలాసార్లు సాయం చేసే ఉంటాం. కానీ, ఆ కుటుంబ సభ్యులు మాత్రం.. ‘మీరు చదివేసిన పుస్తకాలు మాకివ్వండి… పది మందినీ చదివిస్తాం’ అని కోరుతారు. అలా సేకరించిన పుస్తకాలతో గ్రంథాలయాలు ఏర్పాటు చేస్తూ.. సాహితీ పరిమళాలను పంచుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థుల్లో పఠనాసక్తిని పెంచుతున్నారు. పాఠశాల విద్యార్థులు మొదలుకొని..జైళ్లలో మగ్గే ఖైదీల వరకు సాహితీ విలువలు పంచాలనే లక్ష్యంతో కృషి చేస్తున్నారు హైదరాబాద్‌కు చెందిన షెఫాలీ రావు,మాధురి శర్మ. ‘ఫుడ్ 4 థాట్’ స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసి, సెకండ్ హ్యాండ్ పుస్తకాలను సేకరిస్తూ.. దేశవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో లైబ్రరీలు స్థాపిస్తున్న వీరిద్దరినీ ‘జిందగీ’ పలకరించింది..
మన పొరుగు రాష్ట్రమైన కర్ణాటకలో అనేకల్, హోస్పేట్ ప్రాంతాల్లోని ఏ ప్రభుత్వ పాఠశాలను సందర్శించినా వివిధ రకాల పుస్తకాలతో కొలువైన లైబ్రరీలు కనిపిస్తుంటాయి. ప్రతి రోజూ రీడింగ్ పీరియడ్‌లో అకడమిక్ పుస్తకాలు కాకుండా కథల పుస్తకాలు, ఇంగ్లిష్ సాహిత్యం చదివే విద్యార్థులు అక్కడ మనకు కనిపిస్తారు. కేవలం ఒక్క కర్ణాటకలోనే కాదు..దేశవ్యాప్తంగా ఉన్న పలు పాఠశాలల్లో ఇలాంటి సన్నివేశాలే కనిపిస్తాయి. రేపటి తరాలకు అందించే ఆస్తులేమైనా ఉన్నాయంటే అది చదువు మాత్రమే అని నమ్మిన ఓ కుటుంబం తీసుకొచ్చిన మార్పు ఇది. హైదరాబాద్ గడ్డమీద ఏర్పాటు చేసిన ‘ఫుడ్ 4 థాట్’ ఫౌండేషన్ ద్వారా దేశవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో లైబ్రరీలు ఏర్పాటుచేస్తూ పఠనాసక్తిని పెంచడానికి కృషి చేస్తున్నది.
రేపటి కోసం..
గుజరాత్‌కు చెందిన షెఫాలీ వివాహం హైదరాబాద్‌కు చెందిన శ్రీనివాస్ రావుతో జరిగింది. దంపతులిద్దరు కలిసి హైదరాబాద్‌లోనే ఓ ప్రైవేట్ కన్సల్టెన్సీని ప్రారంభించారు. శ్రీనివాస్‌రావు సోదరి మాధురి శర్మ సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేది. షెఫాలీకి కూడా సామాజిక స్పృహ ఎక్కువే! ఇద్దరూ కలిసి రేపటి తరానికి ఉపయోగపడే మంచి కార్యక్రమం చేయాలని భావిస్తూ ఉండేవాళ్లు. ఇద్దరికీ పుస్తక పఠనం అంటే ఆసక్తి! మార్కులు, ర్యాంకుల పోటీలో చిక్కుకుపోయిన ఈ తరం అకడమిక్ పుస్తకాలు తప్ప మరే సాహిత్యమూ చదవడం లేదని వాళ్లు భావించారు. నానాటికీ తగ్గుతున్న పఠనాసక్తికి ఊపిరులూదాలని అనుకున్నారు. మొక్కై వంగనిది మానై వంగదు కదా! అందుకే, తాము చేపట్టబోయే మంచి పనిని పాఠశాల స్థాయి నుంచే ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. అలా షెఫాలీ, మాధురి ఇద్దరూ శ్రీనివాసరావుతో కలిసి 2015లో “ఫుడ్ 4 థాట్’ స్వచ్ఛంద సంస్థను నెలకొల్పారు. లైబ్రరీ సౌకర్యం లేని ప్రభుత్వ పాఠశాలల్లో గ్రంథాలయం ఏర్పాటు చేయడమే లక్ష్యంగా కృషి చేస్తున్నారు.
657 లైబ్రరీలు ఏర్పాటు..
తాము చేసే మంచి పనిలో అందరినీ భాగస్వామ్యం చేయాలనుకున్నారు షెఫాలీ, మాధురి. తమ సంస్థ ఉద్దేశం తెలియజేస్తూ… ‘మీరు చదివేసిన పుస్తకాలు మాకివ్వండి’ అంటూ పుస్తకాల సేకరణకు పూనుకున్నారు. ‘ఫుడ్ 4 థాట్’ లక్ష్యాలను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. మొదట్లో ఆశించిన స్పందన రాకపోయినా.. తమ ప్రయత్నాన్ని విరమించుకోలేదు. కొన్నాళ్లకు వారి సోషల్ మీడియా పోస్టులకు స్పందన రావడం మొదలైంది. హైటెక్ సిటీ, మాదాపూర్ లాంటి ప్రాంతాల్లో ఉండే ఐటీ ఉద్యోగులు తమ ఇండ్లలో పిల్లలు చదివేసిన కథల పుస్తకాలను తీసుకొచ్చి ఇచ్చారు. మిగతావారు కూడా తమ వద్దనున్న నిఘంటువులు, కథల పుస్తకాలు, ఇంగ్లిష్ నవలలు, జనరల్ నాలెడ్జీ పుస్తకాలు అందివ్వడం మొదలుపెట్టారు. ఇలా సేకరించిన పుస్తకాలతోపాటు వాళ్లూ కొన్ని పుస్తకాలు స్వయంగా కొనుగోలు చేసి ప్రభుత్వ పాఠశాలల్లో గ్రంథాలయాలు నెలకొల్పుతూ వచ్చారు. ఆయా పాఠశాలల్లో విద్యార్థులు ఏ తరహా పుస్తకాలు చదవడానికి ఎక్కువగా ఇష్టపడతారో తెలుసుకొని అలాంటి వాటిని సమకూరుస్తున్నారు. ఇలా దేశవ్యాప్తంగా 21 రాష్ర్టాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో కలిపి 657 ప్రభుత్వ పాఠశాలల్లో గ్రంథాలయాలు ఏర్పాటు చేశారు. దాదాపు 1.85 లక్షల పుస్తకాలను వాటిలో అందుబాటులో ఉంచారు. లక్షమందికి పైగా విద్యార్థులు ఈ పుస్తకాలను ఇష్టంగా చదువుతున్నారు. ఇప్పటివరకు 501 పుస్తకాలను డిజిటలైజ్ చేసి పిల్లలకు అందించారు. ఇంగ్లిష్ భాషా సామర్థ్యాలు పెంచే లక్ష్యంతో ప్రతి లైబ్రరీలో ఆంగ్ల సాహిత్యానికి సంబంధించిన 150 పుస్తకాలను అందుబాటులో ఉంచుతున్నారు. స్థానిక భాషకు సంబంధించిన 50 పుస్తకాలు సమకూర్చుతున్నారు.
కారాగారంలోనూ..
తాతలు, తల్లిదండ్రుల పేరు కోసం, వ్యక్తిగత ప్రతిష్ఠ కోసం కొందరు గ్రంథాలయాలు నెలకొల్పుతూ ఉంటారు. సరైన పర్యవేక్షణ లేకపోవడంతో అవి కొన్నాళ్లు మాత్రమే ఉనికిలో ఉంటాయి. ‘ఫుడ్ 4 థాట్’ ఏర్పాటు చేసిన లైబ్రరీలకూ ప్రారంభంలో ఇలాంటి పరిస్థితే వచ్చింది. మంచి పుస్తకాలతో గ్రంథాలయం ఏర్పాటు చేసినా, వాటిని పిల్లలకు పరిచయం చేసేవాళ్లు లేకపోవడంతో షెఫాలీ, మాధురి శ్రమంతా వ్యర్థమయ్యేది. రెండు నెలల తర్వాత పరిస్థితి గమనించడానికి వెళ్తే.. అక్కడ నాలుగైదు పుస్తకాలు మాత్రమే కనిపించేవి. తమ సంకల్పానికి విఘాతం వాటిల్లకుండా లైబ్రరీ నిర్వహణకు వలంటీర్లను నియమించారు. స్థానికంగా రిటైర్డ్ ఉపాధ్యాయులు, యువత సహకారం తీసుకొని లైబ్రరీలకు రక్షణ కల్పించారు. ఈ వలంటీర్లు నిత్యం బడికి వెళ్లి విద్యార్థులకు పుస్తకాలు ఇవ్వడం, చదివించడం, వారినుంచి అభిప్రాయం సేకరించడం చేస్తుంటారు. వలంటీర్లు లేనిచోట.. ఆయా పాఠశాలల్లోని ఉపాధ్యాయులకే ఆ బాధ్యత అప్పగించారు. పాఠశాలల్లో మాత్రమే లైబ్రరీలు ఏర్పాటు చేసి ఆగిపోలేదు వీళ్లు. పలు గ్రామాలు, అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాల్లోనూ గ్రంథాలయాలు నెలకొల్పారు. సాహిత్యం రుచి మరిగితే ఖైదీల్లో పరివర్తన వస్తుందని నమ్మారు. ఈ మేరకు వరంగల్ కారాగారంలోనూ లైబ్రరీ నెలకొల్పారు. ఇలా పఠనాసక్తిని దేశవ్యాప్తం చేస్తూ, ఈ తరాన్ని చదువరులుగా తీర్చిదిద్దుతున్న ‘ఫుడ్ 4 థాట్’ పుస్తక ప్రయాణం మరింత విశేషంగా సాగాలని మనమూ ఆశిద్దాం!
వెయ్యి గ్రంథాలయాలే లక్ష్యం
పుస్తకాలయాలు ఏర్పాటు చేయడమే కాదు.. సాహిత్య పోటీల్లో ఒకటైన రీడింగ్ డెకథ్లాన్లో విద్యార్థులు పాల్గొనేలా ప్రోత్సహిస్తున్నది ‘ఫుడ్ 4 థాట్’. ఇప్పటివరకు జాతీయ స్థాయిలో పలువురు విద్యార్థులు సత్తా చాటడం విశేషం. పఠనాసక్తిని పెంచడంలో భాగంగా దేశవ్యాప్తంగా వెయ్యికిపైగా లైబ్రరీలను ఏర్పాటు చేయడమే తమ లక్ష్యం అంటున్నారు నిర్వాహకులు. పాఠశాలల్లో, గ్రామాల్లో లైబ్రరీలు ఏర్పాటు చేయాలనుకునేవారు www.food4thoughtfoundation.orgలో పూర్తి వివరాలతో రిజిస్టర్ చేసుకోవచ్చనిచెబుతున్నారు.
-రాజు పిల్లనగోయిన