ఆలూమగల అనుబంధ యాత్ర ఎల్లకాలం సంతోషంగా సాగి పోవాలంటే ఒకరినొకరు ప్రేమించాలి, హృదయపూర్వకంగా గౌరవించాలి. ఆ ప్రయాణంలో ఉపకరించే సూత్రాలు..
1. మనసువిప్పి మాట్లాడండి
దాంపత్య జీవితం ఆనందంగా గడిచి పోవాలంటే మన మనసు తెరిచిన పుస్తకంలా ఉండాలి. ఇద్దరి మధ్యా ఏ దాపరికాలూ ఉండకూడదు. భావాలను పంచుకోవాలి. భావోద్వేగాలను అర్థం చేసుకోవాలి.
2. తన కోసం కొంత సమయం
కాలం విలువైంది. ఆ అమూల్యమైన సమయంలో కొంత భాగస్వామికి కేటాయిస్తేనే బంధానికి అర్థం పరమార్థం. టీవీలు, ఫోన్ల ముచ్చట్లతో రోజంతా గడిచిపోతే.. బంధాలకు బీటలు ఖాయం.
3. నేనున్నాననీ..
సంతోషాలనే కాదు కష్టనష్టాలనూ పంచుకోవాలి. జీవిత భాగస్వామిని గట్టెక్కించేందుకు చేతనైన సాయం చేయాలి. ఆ ఊరడింపే అతను లేదా ఆమె పట్ల మీ ప్రేమను తెలియజేస్తుంది.
4. ఇచ్చిపుచ్చుకోవాలి
కాపురంలో అభిప్రాయ భేదాలు సహజమే. అలాంటి సందర్భంలో కూడా ఒకరిపట్ల ఒకరు గౌరవాన్ని కోల్పోకూడదు. వివాదాన్ని వ్యక్తిగతంగా తీసుకోకూడదు.
5. పట్టువిడుపులు
అన్నిసార్లూ మనమే నెగ్గాలంటే కుదరదు. అప్పుడప్పుడూ తగ్గాలి. అవతలివాళ్లు తమ తప్పు తెలుసుకునేదాకా ఆగాలి. ఏదైనా సరే, క్షణాల్లో తేలాలని పేచీ పెట్టుకుంటే బతుకు తెల్లారిపోతుంది.