ప్రకృతి ప్రసాదించిన వరాల్లో ఒకటి పండ్లు. వయసుతో సంబంధం లేకుండా అందరూ వీటిని ఇష్టంగా తింటారు. రుచిలోనే కాదు రంగు, ఆకృతిలోనూ అందరినీ ఆకర్షిస్తాయివి. తింటే పోషకాలు అందించే పండ్లను ఆభరణాలుగా వేసుకుంటే ఎలా ఉంటుంది? ఈ ఆలోచన నుంచి పుట్టుకొచ్చిందే ఫ్రూట్ జువెలరీ! ఫలాకృతులను ఆభరణాల్లో పొదిగి మగువల మనసులు దోచేస్తున్నారు డిజైనర్లు. నగలకు పూసి నిగనిగలాడుతున్న పండంటి నగల ముచ్చట్లు ఇవి..
నగల ఎంపికలో ఒక్కొక్కరిదీ ఒక్కో అభిరుచి. కొందరు మహిళలు సంప్రదాయ పద్ధతిలో భారీ ఆభరణాలు ఇష్టపడితే మరికొందరు తేలికగా ఉండే ఆధునిక నగల్ని ఇష్టపడతారు. అందరిలో భిన్నంగా కనిపించేలా చేసే ట్రెండింగ్ ఫ్యాషన్ నగలంటే ఈతరం మహిళలకి మరీ మక్కువ. అలాంటి అభిరుచిగల వారికోసం రూపొందినదే ఫ్రూట్ జువెలరీ. రంగురంగుల పండ్లను పోలి ఉండే డిజైన్లతో రూపొందే ఈ నగలకు ఇటీవల ఆదరణ పెరుగుతున్నది. ముఖ్యంగా ఉద్యోగినులు, కాలేజీ అమ్మాయిలు రోజూ అలంకరించుకునేందుకు వీలుగా ఎపాక్సీతో చేసిన నగలు అందుబాటులోకి వచ్చాయి. ఇవి అచ్చంగా పండ్లు, పండ్ల ముక్కలను ధరించినట్టుగానే భ్రమింపజేస్తాయి. ఎరుపు, పసుపు, నారింజ, ఊదారంగులు సహజంగా అందరి దృష్టిని ఆకర్షిస్తాయి. అందుకు అనుగుణంగానే ఆయా రంగుల్లో ఉండే పండ్లు, పండ్లముక్కల నమూనాలతో తయారయ్యే జువెలరీకి ఎక్కువ ఆదరణ లభిస్తున్నది.
మామిడి, నిమ్మ, నారింజ, అనాస, పనస, స్ట్రాబెర్రీ, చెర్రీ, ఆపిల్, దానిమ్మ, ద్రాక్ష, అవకాడో, పుచ్చకాయ తదితర పండ్ల డిజైన్లతో కూడిన ఆభరణాలు అందుబాటులోకి వచ్చేశాయి. ట్రెండీ దుస్తుల మీదకు నప్పేలా కంఠాభరణాలు, చెవికమ్మలు, బ్రేస్లెట్లు, పెండెంట్లు కూడా ఫలాలుగా మారి మగువలను కట్టిపడేస్తున్నాయి. ప్లాస్టిక్, 3డీ ప్రింటింగ్, ఎపాక్సీతో చేసిన ఫ్రూట్ జువెలరీ చాలా తక్కువ ధరలు ఉంటాయి. అయితే ఆడంబరంగా ధరించాలనుకునే వారికోసం బంగారం, ప్లాటినమ్తో తయారై వజ్రాలు, ఖరీదైన రాళ్లు పొదిగిన పండ్ల నగలు కూడా మార్కెట్లో ఉన్నాయి. పండ్లతోపాటు కూరగాయలను పోలిన నగలు కూడా వచ్చేశాయి. మరెందుకు ఆలస్యం మీరు కూడా మీకు ఇష్టమైన ఫ్రూట్ జువెలరీతో అలంకరించుకోండి!