ఆడబిడ్డ అర్ధరాత్రిపూట నడిరోడ్డుపై ఒంటరిగా, స్వేచ్ఛగా తిరిగినప్పుడే.. అసలైన స్వాతంత్య్రమన్నాడు మహాత్ముడు. కానీ, 79 ఏళ్ల స్వతంత్ర భారతంలో.. సగటు మహిళ ఏనాడూ స్వేచ్ఛగా జీవించిన పాపాన పోలేదు. అర్ధరాత్రికాదు కదా.. పట్టపగలే ఒంటరిగా ప్రయాణించలేని పరిస్థితి. ఈ తరుణంలో.. విద్యార్థినులు, మహిళలు ఒంటరిగా ప్రయాణించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటో తెలుసుకుందాం.
టీ-సేఫ్: క్యాబ్‌లు, ఆటోల్లో ప్రయాణించే మహిళలకు టీ-సేఫ్ యాప్ భద్రతనిస్తుంది. ఇందులో మానిటరింగ్, డయల్ 100 ఆప్షన్లు ఉంటాయి. ప్రయాణ సమయాల్లో మీ గమ్యస్థానం, మీరు ప్రయాణించే వాహన నంబర్‌ను ఎంటర్చేయాలి. ‘ఆపద’ అని తెలియగానే ‘డయల్ 100’ను ప్రెస్ చేస్తే.. దగ్గరలోని పోలీస్‌స్టేషన్‌కు ఆటోమెటిక్‌గా కాల్ వెళ్తుంది. నిమిషాల్లోనే పోలీసులు రంగంలోకి దిగి రక్షిస్తారు. రాత్రి విధులు నిర్వహించేవారికి ఈ యాప్ మరింత ఉపయోగకరం. స్మార్ట్ఫోన్లతోపాటు సాధారణ కీప్యాడ్ మొబైల్స్‌లోనూ ఈ సేవలు పనిచేస్తాయి. డయల్ 100కు కాల్ చేసి ఐవీఆర్ ద్వారా 8 బటన్ క్లిక్ చేస్తే పోలీసులు స్పందిస్తారు. సెల్ టవర్ ఆధారంగా లొకేషన్‌ను గుర్తించి కాపాడుతారు.
లైఫ్ ఆఫ్ గర్ల్: ప్రమాదంలో ఉన్నప్పుడు ఈ యాప్‌లోని బటన్ నొక్కితే.. దగ్గరలోని సురక్షిత ప్రాంతాలు, పోలీసులు, బంధువులకు మీ లొకేషన్ షేర్ అవుతుంది. ఇందులోని ‘ప్రెడిక్టివ్ సేఫ్టీ’ సిస్టం.. మీ చుట్టూ ఉన్న ప్రమాదకరమైన ప్రాంతాలను గుర్తిస్తుంది. సురక్షితం కానిచోట మిమ్మల్ని అలర్ట్ చేస్తుంది.
112ఇండియా యాప్: ప్రమాదమని తెలిసినప్పుడు ఎస్ఓఎస్ బటన్ నొక్కితే చాలు. బాధితురాలి లొకేషన్, పేరు, వివరాలతో కూడిన సమాచారం అత్యవసర కాంటాక్ట్ నంబర్లతోపాటు పోలీస్ కంట్రోల్ రూమ్‌కు చేరుతుంది. సమీపంలోని పోలీసులు వెంటనే మిమ్మల్ని చేరుకుంటారు. ఈ యాప్ ద్వారా మహిళల హెల్ప్‌లైన్ నెంబర్ 181 కూడా నేరుగా యాక్సెస్ అవుతుంది.
పెప్పర్ స్ప్రే: సెల్‌ఫోన్ లేనప్పుడు పెప్పర్ స్ప్రేను వెంట తీసుకెళ్లడం అవసరం. మీపై దాడి చేసేయాలని ప్రయత్నించినా, అనుమానాస్పదంగా మిమ్మల్ని వెంబడించినా.. వారి కళ్లలో పెప్పర్ స్ప్రే కొట్టి మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు.