ముత్యాల్లా మెరిసే దంతాలు.. అందానికి కొత్త వన్నెలద్దుతాయి. ముఖ సౌందర్యాన్నే కాదు.. ఆత్మవిశ్వాసాన్నీ రెట్టింపు చేస్తాయి. అయితే.. ఫ్లోరైడ్ నీళ్లు, కెఫీన్, దంత ధావనంలో నిర్లక్ష్యం.. అనేక కారణాలతో కొందరి పళ్లు పసుపు రంగులోకి మారిపోతాయి. పాచిపట్టి.. అసహ్యంగా కనిపిస్తాయి. వైద్యుల దగ్గరికి వెళ్లి శుభ్రం చేయించుకున్నా.. కొన్నిరోజులకు మళ్లీ మొదటికొస్తాయి. ఈ సమస్యకు ఆయుర్వేదంతో చెక్ పెట్టవచ్చని చెబుతున్నారు నిపుణులు. ఇంటి పెరట్లో దొరికే ఆకులతోనే.. పళ్లను సులభంగా తళతళలాడించేలా చేసుకోవచ్చని అంటున్నారు.
వేపాకు: వేప పుల్లలతో దంతధావనం.. పూర్వకాలం నుంచీ ఉన్నదే! ఆయుర్వేదంలోనూ దంతాల ఆరోగ్యానికి వేపాకులను ఉపయోగిస్తారు. వేపాకుల్లో ఉండే యాంటి బ్యాక్టీరియల్ మూలకాలు.. దంతాల్లోని బ్యాక్టీరియాను నిర్మూలిస్తాయి. పళ్ల నొప్పి, వాపు నుంచీ ఉపశమనం కలిగిస్తాయి. వేపాకుల్ని నమలడం ద్వారా.. దంతాలు, చిగళ్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. దంతాల మీద పేరుకుపోయే పాచిని తొలగించడంలోనూ వేపాకులు ముందుంటాయి.
జామ ఆకు: నోటి సంరక్షణలో ముందుండే యాంటి మైక్రోబియల్ లక్షణాలు.. జామ ఆకుల్లో పుష్కలంగా ఉంటాయి. పంటి నొప్పి, చిగుళ్ల సమస్యలు, నోటి దుర్వాసనతోపాటు పళ్లను తళతళా మెరిపించడంలోనూ ఇవి సాయపడతాయి. తాజా జామ ఆకులను శుభ్రంగా కడిగి.. తింటే చాలు. దంత సమస్యలన్నీ ఇట్టే తగ్గిపోతాయి.
తులసి : దాదాపు అందరి ఇళ్లలో తులసి మొక్కలు కనిపిస్తాయి. వీటి ఆకులు.. పోషకాల గనులు. తులసి ఆకుల్లోని యాంటి బ్యాక్టీరియల్ లక్షణాలు.. నోట్లో ఉండే బ్యాక్టీరియాను తరిమేస్తాయి. రోజూ బ్రష్ చేసిన తర్వాత తులసి ఆకుల్ని నమిలితే.. దంతాలు మరింత శుభ్రంగా మారతాయి. తులసి ఆకుల్ని క్రమం తప్పకుండా నమిలితే.. దంతాలపై పాచి వదిలిపోయి, తెల్లగా మెరిసిపోతాయి.
పుదీనా: సహజసిద్ధమైన మౌత్ ఫ్రెషనర్‌గా.. ‘పుదీనా’కు పేరు. ఇందులో యాంటి ఆక్సిడెంట్లు, పోషకాలు పుష్కలం. పుదీనా ఆకులను నమలడం వల్ల.. దంతాల పసుపు రంగు తగ్గుతుంది. పళ్లకు కొత్త మెరుపు వస్తుంది. రోజుకు ఒకట్రెండు నమిలినా.. దీర్ఘకాలంలో మంచి ఫలితం కనిపిస్తుంది.