బాలీవుడ్ హీరోయిన్లు ఏదో ఒక కారణంగా వార్తల్లో నిలుస్తూ ఉంటారు. మిగిలినవాళ్లతో పోలిస్తే.. కరీనాకపూర్ మీద రెండు స్టోరీలు ఎక్కువే వస్తుంటాయి. వివాహితుడైన సైఫ్ అలీఖాన్‌ను పెండ్లి చేసుకోవడం దగ్గర నుంచి ఇద్దరు కొడుకులకు జన్మనివ్వడం వరకూ.. నిత్యం ఏదో ఓ వార్త. ఇటీవల ‘ప్రెగ్నెన్సీ బైబిల్’ పేరుతో కరీనా రాసిన పుస్తకం కూడా హాట్ టాపికే! గర్భం దాల్చిన మొదటిరోజు నుంచి కాన్పు తర్వాత తల్లి శరీరంలో వచ్చే మార్పుల వరకూ అన్ని దశలనూ అందులో శాస్త్రీయంగా ప్రస్తావించింది కరీనా. గైనకాలజిస్ట్, న్యూట్రిషనిస్ట్, సోనోలజిస్ట్, సైకాలజిస్ట్ మొదలైన వైద్య నిపుణుల సలహాలు, సూచనలను చేర్చింది. తన రచన గురించి చెబుతూ “పబ్లిషర్స్ నన్ను పుస్తకం రాయమని అడిగినప్పుడు చాలా సంతోషంగా అనిపించింది. వెంటనే కలం, కాగితం ముందేసుకొని కూర్చున్నాను. ఈ పుస్తకం ప్రతి మహిళ దగ్గరా ఉండాలి. తల్లులు తమ కూతుళ్లకు దీన్ని బహుమతిగా అందించాలి, ఇందులో తల్లిపాల ప్రాధాన్యం, బరువు పెరగడం, ప్రెగ్నెన్సీ సమయంలో కలిగే ఆశలు, రుచి చూడాలనిపించే పదార్థాలు, మానసిక సమస్యలు, శరీరంలో వచ్చే మార్పులతో పాటు ప్యాండమిక్‌లో ప్రెగ్నెన్సీ గురించి కూడా వివరంగా చర్చించాం” అంటున్నది కరీనా.