డబ్బు అవసరం.. ఎప్పుడు, ఎలా వస్తుందో తెలియదు. వచ్చిన జీతం.. తిండి, ఇంటి కిరాయి, పిల్లల ఖర్చులకే సరిపోతుంది. ముఖ్యంగా మధ్య తరగతి జీవితాలన్నీ.. ఈఎంఐల చుట్టే తిరుగుతున్నాయి. ఇలాంటి సందర్భంలో అనుకోని సంఘటన ఎదురైతే ‘అప్పు’ తప్ప మరే దారీ కనిపించదు. ఆ అప్పు పుట్టాలన్నా.. నానా తిప్పలు పడాల్సిందే! అందుకే.. ప్రతి కుటుంబం తమ ఆదాయం నుంచే అత్యవసర నిధి (ఎమర్జెన్సీ ఫండ్)ను ఏర్పాటు చేసుకోవాలి. అప్పుడే.. అనుకోని సమస్య ఎదురైనా, ధైర్యంగా బయటపడొచ్చు.
లక్ష్యం పెట్టుకోవాలి : అత్యవసర నిధి కోసం ఎంత డబ్బు కావాలో ముందే లక్ష్యంగా పెట్టుకోవాలి. అలాగే ఎన్ని నెలల్లో దాన్ని సమకూర్చుకోవాలో కూడా ముందే నిర్ణయించుకోవాలి.
బ్యాంకు అకౌంట్ : ఈ అత్యవసర నిధి కోసమే ప్రత్యేకంగా ఒక బ్యాంకు అకౌంట్ తెరవాలి. ఆ అకౌంట్‌ను పేమెంట్ యాప్స్‌తో లింక్ చేయకూడదు. ఎందుకంటే.. ఆ అకౌంట్‌ను తరచూ చెక్ చేస్తుంటే, డబ్బులు విత్ డ్రా చేయాలనిపించే అవకాశం ఉంటుంది.
ఆటోమేటిక్ ట్రాన్స్ఫర్స్ : సాలరీ అకౌంట్ నుంచి అత్యవసర నిధికి చెందిన అకౌంట్లోకి నెలనెలా ఆటోమేటిక్‌గా డబ్బు వెళ్లేలా ఏర్పాటుచేసుకోవాలి. అప్పుడు ప్రతినెలా గుర్తు పెట్టుకుని.. అకౌంట్లో డబ్బు వేయాల్సిన పని ఉండదు.
తెలివైన వాడకం : అనుకున్నంత అత్యవసర నిధి జమయ్యాక.. ప్రతి చిన్న విషయానికీ దానిని ఖర్చు చేయకూడదు. వైద్యపరమైన సమస్యలు, ఉద్యోగ సమస్యలు ఉన్నప్పుడు మాత్రమే ఉపయోగించాలి. అంతేతప్ప.. నెలనెలా వచ్చే ఖర్చు కోసం వీటిని ఎట్టిపరిస్థితుల్లోనూ వాడకూడదు.