స్నేహ బంధం కలకాలం నిలవాలంటే, కొన్ని రూల్స్ పాటించాల్సిందేనని అంటున్నారు మానసిక నిపుణులు. అవేమిటో మీరూ తెలుసుకోండి..
నమ్మకమే పునాది: మీరు మీ ఫ్రెండ్ను నమ్మడం లేదంటే, అతను మీ నేస్తమే కాదని అర్థం. ఒకరి పట్ల ఒకరికి నమ్మకం ఉండటం, ఒకరితో ఒకరు నిజాయతీగా వ్యవహరించడం చాలా ముఖ్యం.
చెప్పేది వినండి: ఏదైనా విషయం గురించి నేస్తం చెబుతున్నది ఓపిగ్గా వినండి. వాళ్లు ఆ సందర్భంలో ఏం కోరుకుంటున్నారన్నది అర్థం చేసుకోండి. పరస్పర అవగాహనతోనే స్నేహం నిలుస్తుంది.
అంగీకరించండి: మీరు నమ్మినదానికి భిన్నంగా ఉన్నా సరే మిత్రుడి ఎంపికను అంగీకరించడం అలవరచుకోండి. మీకు నచ్చినట్టే వాళ్ల జీవితం ఉండాలనేం లేదు. ఎదుటి మనిషి అభిరుచిని గౌరవించడం ఉత్తమ సంస్కారం కూడా.
క్షమించేయండి: మనం ఎదుటివారి నుంచి కోరుకున్నవన్నీ మనకు దక్కాలనేం లేదు. ఏ బంధమూ పరిపూర్ణం కాదు. మీ నేస్తం చిన్నాచితకా తప్పులు చేసినా క్షమించండి.
హద్దే ముద్దు: ఎంత నేస్తాలైనా కొన్ని హద్దులు మంచివే. ఎదుటివారంటే ఎంత ఇష్టమున్నా అన్నీ చెప్పుకోలేరు కొంతమంది. అంతమాత్రాన మనకు వాళ్లు దూరమైనట్టు కాదు.
చులకన వద్దు: మీకు నచ్చిన దుస్తులు కొనుక్కోలేదనో, మీకు నచ్చని వ్యక్తితో చనువుగా ఉన్నారనో, చెబితే వినకుండా ఏ ఇన్వెస్ట్మెంటో చేశారనో నలుగురి ముందూ చులకన చేయొద్దు. దీర్ఘ కాలంలో అది మీ బంధానికి గాయాలు చేస్తుంది.