సలాడ్, జ్యూస్, స్మూతీల్లో బీట్రూట్ భాగమే కానీ, అదెప్పుడూ ప్రత్యేకం కాదు. ఫైబర్, రంగు కోసం యూట్యూబర్లు బీట్రూట్ని ఎక్కువగా సూచిస్తుంటారు. డాక్టర్లయితే రక్తసంబంధమైన జబ్బులు రాకుండా ఉండేందుకు బీట్రూట్ రోజూ తినొచ్చని సూచిస్తున్నారు. దీనినే ఎందుకు ఎంచుకోమంటారంటే.. ఇందులో గుండెకు మేలు చేసేవి తప్ప హాని చేసేవి ఉండవు. బీట్రూట్లో కేలరీలు, కొవ్వు తక్కువగా ఉంటుంది. కొలెస్ట్రాల్ అసలే ఉండదు. ఫైబర్ అత్యధికంగా ఉంటుంది.
బీట్రూట్లో పొటాషియం, ఫోలేట్, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఫోలేట్ శరీరంలోని కణవృద్ధికి దోహదపడుతుంది. అలాగే గుండె జబ్బులు రాకుండా సాయపడుతుంది. పొటాషియం రక్త పీడనాన్ని నియంత్రణలో ఉంచుతుంది. మెగ్నీషియం కండరాలు, నరాల పనితీరుని మెరుగ్గా ఉండేలా చేస్తుంది. ఇందులో ఉండే ఫైబర్ జీర్ణ వ్యవస్థ సాఫీగా సాగేలా సాయపడుతుంది. టైప్ 2 డయాబెటిస్ నియంత్రణకు దోహదపడుతుంది.
ఎక్కువ మొత్తంలో ఉండే ఈ నాలుగు పోషకాలే కాకుండా తక్కువ మోతాదులో ఫాస్పరస్, ఐరన్, బీటా కెరోటిన్, విటమిన్-ఎ, విటమిన్-బి, విటమిస్-సి ఉంటాయి. బీట్రూట్ ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఈ ఆకులకు వాపులను తగ్గించే గుణం ఉంది. వైద్యులు నిర్వహించిన పరిశోధనల్లో బీట్రూట్ తినేవాళ్లలో రక్తపీడనం, రక్త ప్రసరణ, కాలేయ పనితీరు మెరుగ్గా ఉంటాయని నిర్ధారణ అయింది. అలాగే బీట్రూట్ తినే అథ్లెట్లు మెరుగైన ఆటతీరు కనబరుస్తారని కూడా పరిశోధకులు గుర్తించారు.