మనసు ఒక్కోసారి నిరుత్సాహంగా, నిశ్శబ్దంగా, నిర్లిప్తంగా ఉంటుం టుంది. ఎందుకో కొన్నిసార్లు తెలుస్తుంది. కొన్నిసార్లు తెలియదు. ప్రతిసారీ చాక్లెట్టో, బిస్కెట్టో దాన్ని ఉత్సాహపరచలేవు. మరేం చేయాలి..? డోపమైన్ డ్రెస్సింగ్ ట్రై చేయాలి. నిండైన వర్ణాల కలగలుపుగా ఉండే రంగురంగుల దుస్తులు మనకి తెలియకుండానే మనసుని ఉత్తేజపరుస్తాయని పరిశోధనలు చెబుతున్నాయి. ఈ డ్రెస్సింగ్ గురించి ఎందరో ైస్టెలిస్టులూ రకరకాల విషయాలను పంచుకుంటున్నారు.
అంతేకాదు మనసును ఒక్కో రంగు ఒక్కోలా ప్రభావితం చేస్తుందనీ చెబుతున్నారు. అలాగే అందంగా కనిపించే, సౌకర్యవంతమైన వస్త్రం కూడా దీనికి తోడైతే హాయైన అనుభూతి కలుగుతుందట. తద్వారా మెదడుకు అందే సంకేతాలు ‘డోపమైన్’అనే హ్యాపీ హర్మోన్లు విడుదలయ్యేలా చేస్తాయట. ఇవి మనలోని సంతోషాన్ని రెట్టింపు చేసేందుకు సాయపడతాయి. అలా మనకు నచ్చిన నిండైన వర్ణాలను వేసుకోవడం ద్వారా సంతోషాన్ని తెచ్చుకోవడం అన్నదే ఈ డోపమైన్ డ్రెస్సింగ్ అన్నమాట.
వీటిని ఎంచుకునేప్పుడు ట్రెండ్‌తో సంబంధం ఉండనక్కర్లేదని చెబుతారు ైస్టెలిస్టులు. ఇక ఇందులో ఎరుపు శక్తినీ, పసుపు సానుకూల దృక్పథాన్నీ, నీలం ప్రశాంతతనీ, నారింజ రంగు సృజనాత్మకతనీ… ఇలా ఒక్కో వర్ణం ఒక్కో అంశాన్నీ పురిగొల్పుతాయట. ఒక రకంగా ఇదో రంగుల శాస్త్రం కూడా. కాబట్టి ఒత్తిడి గురవుతున్నా, ఏదైనా కారణాల వల్ల రోజులు సాదాగా సాగిపోతున్నాయనిపించినా మీ తరహాలో డోపమైన్ డ్రెస్సింగ్‌ను ప్రయత్నించండి. ఉరిమే ఉత్సాహంతో ఉరకలెత్తండి!