చదువే జీవితాన్ని మారుస్తుందని ఆ అమ్మానాన్నల ఆలోచన. అమ్మానాన్నల మాటలే స్ఫూర్తిగా తన జీవిత లక్ష్యాన్ని ఎంచుకుంది దొంగరి ప్రతిభ. పేదరికం, సామాజిక వెనుకబాటుతనం, గ్రామీణ నేపథ్యం వంటి అవరోధాలెన్నో దాటి స్వయం కృషితో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ గ్రూప్ వన్ అధికారిగా ఎంపికైంది. నేరాలు అరికట్టే ఉద్యోగం నుంచి నేరాలు లేని సమాజాన్ని నిర్మించేందుకు మరో ఉద్యోగం సాధిస్తానంటున్న ప్రతిభ జిందగీతో పంచుకున్న ముచ్చట్లు ఆమె మాటల్లోనే..
జగిత్యాల జిల్లాలో మారుమూల అటవీ ప్రాంతంలో ఉన్న సారంగాపూర్ మండలంలోని అర్పపల్లి గ్రామం మాది. నాన్న రాజు బతుకుదెరువు కోసం హైదరాబాద్‌కి వలసవెళ్లాడు. ప్రైవేట్ దవాఖానలో ల్యాబ్ టెక్నీషియన్‌గా పని చేశాడు. మా అమ్మ పేరు షైని. కేరళ నుంచి హైదరాబాద్‌కు వచ్చేసి ఓ ఉద్యోగం చేస్తుండేది. అమ్మానాన్నకు పరిచయం ఏర్పడింది. ప్రేమించి పెండ్లి చేసుకున్నారు. కొన్నాళ్లకు అమ్మానాన్న మా సొంతూరు అర్పపల్లికి వచ్చారు. నాన్న ఆర్ఎంపీ వైద్యుడిగా, అమ్మ అంగన్వాడీ టీచర్‌గా కొత్త జీవితం ప్రారంభించారు.
ఆసక్తిగా వినేదాన్ని
నాకు అన్న, అక్క ఉన్నారు. ముగ్గురం మొదట మా ఊరి ప్రభుత్వ పాఠశాలలో చదివేవాళ్లం. తర్వాత సిద్ధార్థ హైస్కూల్ (జగిత్యాల)లో పదో తరగతి వరకు చదివాం. బీటెక్ తర్వాత అన్నయ్య దుబాయ్‌కి వెళ్లాడు. అక్క పెండ్లి చేశారు. నేను డిగ్రీ బీఎస్సీలో జాయిన్ అయ్యా. అమ్మ ఐసీడీఎస్‌లో సూపర్వైజర్గా ప్రమోట్ అయింది. తరచూ ప్రభుత్వ సమావేశాలకు వెళ్తూ ఉండేది. అక్కడి నుంచి వచ్చిన తర్వాత ‘మీటింగ్‌లో ఇలా జరిగింది, కలెక్టర్ గారు ఇలా అన్నారు’ అని చెబుతూ ఉండేది. కలెక్టర్‌కి ఉండే అధికారాలు, ప్రజల అవసరాలు చెబుతుంటే నేను ఆసక్తిగా వినేదాన్ని. ఆ మాటలు నాకు స్ఫూర్తినిచ్చాయి. అందువల్ల కలెక్టర్ కావాలనే కోరిక కలిగింది. కొన్నాళ్లకు సివిల్స్‌కు ప్రిపేర్ కావాల్సిందే. ఐఏఎస్ సాధించాల్సిందేనని బలంగా నిర్ణయించుకున్నా. ఉస్మానియా యూనివర్సిటీలో ఎమ్మెస్సీ కెమిస్ట్రీలో చేరాను.
సివిల్స్ బాట
పీజీ పూర్తయ్యాక నా లక్ష్యం దిశగా అడుగులు వేశా. అయితే, నాన్న ఆదాయం అంతంతమాత్రమే. ఆర్ఎంపీ ప్రాక్టీస్ మాని, వ్యవసాయ కూలీగా మారిపోయాడు. అమ్మకు వచ్చే జీతం అప్పులకు, ఇంటి ఖర్చులకే సరిపోయేది. సివిల్స్ ప్రిపరేషన్‌కు అయ్యే ఖర్చు వారిపై మోపలేక, ఏదైనా ఉద్యోగం చేసి, ఆ డబ్బుతో కోచింగ్ తీసుకోవాలని అనుకున్నాను. రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్‌లో గెస్ట్ లెక్చరర్‌గా ఏడాదిపాటు పని చేశాను. హైదరాబాద్‌లోని ఎస్సీ స్టడీ సర్కిల్ సివిల్స్ కోచింగ్‌కు 2020లో ఎంపికయ్యాను. మూడుసార్లు యూపీపీఎస్సీ ప్రిలిమ్స్ రాశాను. కానీ, సాధించలేకపోయాను. కొంత నిరాశ కలిగింది. అయినా పట్టుదలతో చదివాను. టీజీపీఎస్సీ గ్రూప్-1కు దరఖాస్తు చేశాను. ప్రతి రోజు 8 నుంచి 10 గంటలు చదువుకే కేటాయించాను. డీఎస్పీ ఉద్యోగానికి ఎంపికైనప్పుడు నా కష్టానికి తగ్గ ఫలితం దక్కిందని సంతోషపడ్డాను. పిల్లలు చదువుకుంటే బాగుపడతారని అమ్మనాన్నలు శ్రమించారు. వాళ్ల ప్రేమ, త్యాగం ఫలించాయి. గ్రూప్ 1, 2, 3, 4 ఉద్యోగాలు సాధించాను. అమ్మ ఇచ్చిన స్ఫూర్తితోనే ఇక్కడి వరకు వచ్చాను. డీఎస్పీగా పనిచేస్తూనే సివిల్స్ రాస్తాను. ఐఏఎస్ సాధించడమే నా అంతిమ లక్ష్యం.
..? కొత్తూరి మహేశ్ కుమార్, బండ స్వామి
ఎక్కల్దేవి రవి కుమార్