అధిక చక్కెర.. ఆరోగ్యానికే కాదు, అందానికీ చేటు చేస్తుంది. అనేక రోగాలతోపాటు వృద్ధాప్యాన్నీ స్వాగతిస్తుంది. శరీరంలో చక్కెర స్థాయులు పెరిగితే.. అందం తగ్గుతుంది. అలాకాకుండా ఉండాలంటే.. ఆహారంలో చక్కెరను తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. రక్తంలో చక్కెర స్థాయులు పెరగడం వల్ల ైగ్లెకేషన్ ప్రక్రియ వేగవంతం అవుతుంది. ఫలితంగా, చర్మంలోని ఎలాస్టిన్, కొలాజెన్ స్థాయులపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.
తద్వారా చర్మం ముడతలు పడే అవకాశం ఉంటుంది. దీనివల్ల చిన్నవయసులోనే వృద్ధాప్యఛాయలు కనిపిస్తాయి. అంతేకాకుండా.. చక్కెర వల్ల శరీరంలో ఇన్సులిన్ స్థాయులతోపాటు నూనె ఉత్పత్తులూ పెరుగుతాయి. వాటివల్ల చర్మ రంధ్రాలు మూసుకుపోతాయి. ఫలితంగా, ముఖంపై మచ్చలు, మొటిమలు ఎక్కువ అవుతాయి. ఇక చక్కెర ఎక్కువైతే.. చర్మం డీహైడ్రేట్ అవుతుంది. దాంతో చర్మం పొడిబారి.. దురద, మంటకు కారణం అవుతుంది.
అదే చక్కెర తగ్గిస్తే.. చర్మానికి కావాల్సినంత తేమ అందుతుంది. మృదువుగా, ప్రకాశవంతంగా తయారవుతుంది. అధిక చక్కెర వినియోగం.. జుట్టుకూ చేటు చేస్తుంది. శరీరంలో ఇన్సులిన్ స్థాయులు పెరిగితే.. జుట్టు కుదుళ్లు బలహీన పడతాయి. దాంతో, కేశాలు తెల్లబడటం, రాలిపోవడం లాంటి సమస్యలు చుట్టుముడతాయి. కాబట్టి, ఆహారంలో చక్కెరను తగ్గిస్తే.. ఆరోగ్యంతోపాటు అందానికీ ఎంతో మేలు కలుగుతుంది.