బాలీవుడ్లో బాక్సాఫీస్ కలెక్షన్లు ఎప్పుడూ చర్చనీయాంశమే! ఏదైనా పెద్ద సినిమా పెద్దగా ఆడకపోతే.. ‘కార్పొరేట్ బుకింగ్స్’ రంగంలోకి దిగుతాయట. తమ చిత్రం భారీ కలెక్షన్లు సాధిస్తున్నదని చెప్పుకోవడానికి ఆ సినిమా నిర్మాతలే.. పెద్దసంఖ్యలో సీట్లు కొనుగోలు చేస్తుంటారట. ఇలా చేయడం అన్యాయమనీ, దాని ప్రభావం మిగతా సినిమాలపై పడుతుందనీ అంటున్నది బాలీవుడ్ నటి, దర్శకురాలు దివ్య ఖోస్లా. తాజాగా, ఆన్లైన్లో ‘ఆస్క్ మీ ఎనీథింగ్’ సెషన్ నిర్వహించింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ బాలీవుడ్‌లోని విష సంస్కృతుల గురించి చెప్పుకొచ్చింది. “ఆ మధ్య బాలీవుడ్‌లోని ఓ లేడీ ఓరియంటెడ్ చిత్రం కోసం కార్పొరేట్ బుకింగ్స్ చేయించారు.
ఆ చిత్ర నిర్మాతలే బుకింగ్స్ సంఖ్యను పెంచి చూపించారు” అంటూ చెప్పుకొచ్చింది. తన నటనా ప్రయాణం, బాలీవుడ్ గురించి తన ఆలోచనలను పంచుకున్నది. బాలీవుడ్ మొత్తం మొసళ్లతోనే నిండిపోయిందని సంచలన వ్యాఖ్యలు చేసింది. బాలీవుడ్లో కొన్ని విషపు సంస్కృతులు ఉన్నాయనీ, ఇక్కడ నిజాయతీగా ఉండాలంటే.. ఎంతో ఒత్తిడిని ఎదుర్కోవాలనీ, మానసికంగానూ దృఢంగా ఉండాలని చెప్పుకొచ్చింది. “విలువల విషయంలో నేనెప్పుడూ రాజీపడను. అవకాశాల కోసం ఆత్మగౌరవాన్ని అమ్ముకోను. ఇక బాలీవుడ్లో బతకాలంటే.. నిజాయతీగా ఉండటమే నాకు తెలిసింది” అని వెల్లడించింది.
భూషణ్ కుమార్‌తో విడాకుల గురించి వస్తున్న వార్తలపై స్పందిస్తూ.. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని పేర్కొన్నది. “ఎలాంటి వాస్తవాలు తెలుసుకోకుండానే.. కొందరు తప్పుడు వార్తలను ప్రచారం చేస్తుంటారు. నా విడాకుల సంగతి కూడా అంతే! అందులో ఏమాత్రం నిజం లేదు. కానీ, మీడియా మాత్రం అది నిజం కావాలని కోరుకుంటున్నది” అంటూ విమర్శించింది. మరో నెటిజన్ ప్రశ్నకు సమాధానమిస్తూ.. “గతేడాది వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ ‘సావి’ కోసం.. దాదాపు మైనస్ 10 డిగ్రీల ఉష్ణోగ్రతలో పనిచేశాం. ఒకటికాదు రెండుకాదు.. దాదాపు 42 రోజులపాటు నిరంతరాయంగా షూట్లో పాల్గొన్నాం. ఆ షూటింగ్ నా సినిమా కెరీర్లోనే అత్యంత అద్భుతమైన పనిగా నిలిచిపోయింది.
ఇతర సినిమాలతో పోల్చడానికి.. నాకు ఒక బెంచ్‌మార్క్‌ను ఏర్పాటు చేసింది” అంటూ చెప్పుకొచ్చింది. ఢిల్లీలో పుట్టిపెరిగిన దివ్య ఖోస్లా.. నటనపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి వచ్చింది. 2000 సంవత్సరంలో ప్రముఖ ఇండీపాప్ గాయనీ ఫల్గుణి పాఠక్ నిర్మించిన ఓ ప్రైవేట్ ఆల్బమ్‌లో కనిపించింది. తెలుగు సినిమాతోనే హీరోయిన్గా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. 2004లో ఉదయ్ కిరణ్ హీరోగా వచ్చిన ‘లవ్ టుడే’తో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఆ మరుసటి ఏడాదే టీ-సిరీస్ చైర్మన్, ఎండీ భూషణ్ కుమార్‌ను వివాహం చేసుకుంది. ఆ తర్వాత బాలీవుడ్ బాటపట్టి.. ప్రత్యేక గీతాలు, అడపాదడపా సినిమాల్లో అవకాశాలు దక్కించుకున్నది. మెగాఫోన్ చేతపట్టి రెండు సినిమాలకు దర్శకత్వం వహించింది. ఈ యేడాది ‘ఏక్ చతుర్ నార్’ చిత్రంతోపాటు తెలుగు సినిమా ‘జటాధార’లోనూ కనిపించింది.