నేటి డిజిటల్ ప్రపంచంలో.. సోషల్ మీడియా అనేది ప్రతి ఒక్కరి జీవితంలో భాగమై పోయింది. వినోదంతోపాటు కమ్యూనికేషన్, సృజనాత్మకతలోనూ ఇదే కీలకంగా మారింది. అయితే, పెద్దల వరకు సత్ఫలితాలను అందిస్తున్న సామాజిక మాధ్యమం.. పిల్లలకు లేనిపోని చిక్కులు తెచ్చిపెడుతున్నది. ఈ క్రమంలో ‘డిజిటల్ భద్రత’పై పిల్లలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉన్నది.
సోషల్ మీడియా వినియోగానికి ‘13 ఏళ్లు’ అనేది చట్టపరమైన కనీస వయస్సు. అయినప్పటికీ, చాలా సందర్భాల్లో వయసు కన్నా.. అవగాహనే ముఖ్యమని పరిశీలకులు చెబుతున్నారు. దాంతోపాటు భావోద్వేగ, సామాజిక సంసిద్ధత కూడా ఉండాలని అంటున్నారు. ఇటీవలి అధ్యయనాల ప్రకారం.. మూడు నుంచి 17 ఏళ్ల పిల్లలలో 99శాతం మంది ప్రతిరోజూ ఎంతోకొంత సమయం స్క్రీన్‌పై గడుపుతున్నారట. ఇక ఆన్లైన్లో అత్యంత ప్రజాదరణ పొందిన ప్లాట్‌ఫామ్‌గా గుర్తింపున్న యూట్యూబ్‌ను 89శాతం మంది పిల్లలు ఉపయోగిస్తున్నారట. అంతేకాకుండా.. 13 ఏళ్లకన్నా తక్కువ వయసు ఉన్న పిల్లల్లో ఎక్కువ మందికి కనీసం ఒక సోషల్ మీడియా యాప్, సైట్లో సొంత ప్రొఫైల్ ఉన్నదట.
ఐదు నుంచి ఏడేళ్ల వయస్సు గల పిల్లల తల్లిదండ్రులలో.. మూడింట ఒకవంతు మంది తమ బిడ్డకు సోషల్ మీడియా ప్రొఫైల్ ఉన్నట్లు చెప్పారు. అదే ఎనిమిది నుండి 11 ఏళ్ల పిల్లలలో.. 60శాతం మంది సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నారట. దీన్నిబట్టి.. టీనేజర్లు, ప్రీ టీనేజర్లలో అధికశాతం మంది సోషల్ మీడియాను వాడుతున్నట్లు తేలింది. వీరిలో చాలామంది వినోదం కోసం, చదువుకు సంబంధించిన విజ్ఞానాన్ని పెంచుకోవడానికే యూట్యూబ్, ఇతర సామాజిక మాధ్యమాలను ఆశ్రయిస్తున్నారు. అదే సమయంలో సోషల్‌మీడియాపై అవగాహన లేమితో లేనిపోని సమస్యల్లో కూరుకుపోతున్నారు. సైబర్ బెదిరింపులు, గోప్యత, డేటా చోరీలాంటి వాటికి గురవుతున్నారు.
భద్రత, బాధ్యతే ముఖ్యం..
పిల్లలకు ఆన్లైన్ భద్రతతోపాటు బాధ్యతగా వ్యవహరించడంపై అవగాహన కల్పించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆన్లైన్ భద్రత, ఫొటోలు, వీడియోలను పంచుకోవడంతోపాటు హానికరమైన కంటెంట్‌ను గుర్తించడంలో వారికి సహాయపడాలి. దీనివల్ల సైబర్ దాడులు, ఏఐ మార్ఫింగ్ ప్రమాదాలను పిల్లలు అర్థం చేసుకుంటారు. అప్పుడే, సురక్షితమైన ఎంపికలు చేసుకోవడానికి సన్నద్ధమవుతారు. సామాజిక మాధ్యమాల్లోనూ సురక్షితంగా ఉంటారు. అంతేకాకుండా.. సోషల్ మీడియాను సురక్షితంగా ఉపయోగించినప్పుడే.. దాని నుంచి ప్రయోజనాలను పొందగలుగుతారు. లేకుంటే.. పిల్లలు క్రూరమైన, హింసాత్మక, లైంగికపరమైన చిత్రాలను చూసే అవకాశం ఉంటుంది. ఇది వారి ప్రవర్తనపై దుష్ప్రభావం చూపుతుంది. ఇక చాలా సందర్భాల్లో తెలియకుండా తీసిన ఇబ్బందికరమైన ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారు. అపరిచితులతో వ్యక్తిగత సమాచారాన్నీ పంచుకుంటున్నారు. ఫలితంగా, సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కుతున్నారు.
ఈ సూచనలు పాటించాల్సిందే!