శ్రావణ మేఘాలు ఆకాశానికి తోరణాలు కడుతుంటే, వాన చినుకుల పరదాలు పిల్లగాలికి ఊగుతుంటే… ఆ దృశ్యాన్ని ఏ బాల్కనీ అంచునో నిలబడి ఆనందిస్తూ ఆస్వాదిస్తున్నప్పుడు… ఎవరెవరి మదిలో ఏయే ఆలోచనలు ఊసులాడతాయో…కానీ అందులో చాలామంది ఉమ్మడిగా కోరుకునే రసాస్వాదన మాత్రం… ఓ కప్పు టీ. ఇష్టమైన వారి చేతిలో చెయ్యేస్తే వచ్చే వెచ్చదనం, అంతటి కిక్‌ని చల్లగాలిలో చాయ్ కప్పూ ఇస్తుందంటారు వీళ్లంతా. అవును సందెపొద్దును తలపించే మసక వెలుతురు, మంద్రమైన సంగీతాన్ని వినిపించే చల్లగాలి, దానికి తాళం వేసే వర్షపు సడి… ఇంతటి ఆనందాన్ని అమాంతంగా జుర్రుకునే అవకాశాన్ని ఒక్క టీ కప్పు మాత్రమే ఇవ్వగలదు. అందుకే వర్షాకాలానిదీ టీదీ ఓ వెచ్చటి అనుబంధం. ఇక, అది ఆరోగ్యాన్ని కూడా ప్రసాదించేదైతే అంతకన్నా మహాభాగ్యం ఏముంది? అందుకే ఈ కాలంలో అలవాటుగా తాగే వాటికే కాదు కొత్త రకం టీలకూ యమ క్రేజ్ ఉంది. మనమూ వాటి సంగతి ఓసారి చూసేద్దాం!
మబ్బులు కమ్మడం మొదలు కాగానే ముక్కులు పట్టడమూ ప్రారంభమవుతుంది. వాన చినుకులతో పాటు నాసికా రంధ్రాలూ ధారలు కురిపిస్తాయి. కచ్చితంగా అప్పుడే వేడివేడిగా చేతిలో ప్రత్యక్షం అవుతుంది అల్లం టీ. గొంతులోకి జారుతుంటేనే ఉపశమనం ప్రారంభమైన అనుభూతి కలగడం దీని ప్రత్యేకత. దగ్గు, జలుబు, ముక్కు దిబ్బడ, తలనొప్పి… ఇలా అన్నింటికీ అమ్మ, అమ్మమ్మలు అందించే దివ్య ఔషధం ఇది. అల్లానికి ఆయుర్వేదంలో ప్రత్యేక స్థానముంది. ఇది జీర్ణవ్యవస్థను మెరుగు పరచి, ఇన్ఫెక్షన్లను పారదోలుతుంది. రక్త ప్రసరణను క్రమబద్ధీకరించి, శ్వాసకోశ సమస్యల్ని తొలగించడానికి, అలర్జీలను తగ్గించడానికీ ఉపకరిస్తుంది. ఇందులో ఉండే జింజరోల్ అనే ప్రత్యేక పోషకం నొప్పుల్ని, వాపుల్ని తగ్గిస్తుంది. ఇన్ని మంచి లక్షణాలు ఉన్నాయి కాబట్టే వానాకాలం వచ్చిందంటే పొయ్యి మీద అల్లం టీ మరుగుతూ ఉంటుంది. ఇక అల్లం టీని మనం రెండు రకాలుగా పెట్టొచ్చు. పాలు వాడి, వాడకుండా. నీళ్లను మరిగించి అందులో ఓ అల్లం ముక్కను దంచో, లేదా తురిమో వేయాలి. కావాలంటే లవంగం, దాల్చిన చెక్కలాంటివీ జోడించవచ్చు. కాసేపు మరగనిచ్చాక దించి నిమ్మరసం, తేనె కలుపుకొని తాగొచ్చు. అదే పాలతో అయితే ముందుగా దంచిన అల్లాన్ని నీళ్లలో వేసి మరగనిచ్చాక, చిక్కటి పాలు, టీ పొడి, పంచదార జోడించి కాచడం పూర్తయ్యాక దింపేస్తే సరి! ఆహా అద్రక్ టీ…అంటూ ఆస్వాదించడమే!
ఎంత మధురమైన స్వరమైనా సరే చెమ్మ చేరే కాలంలో చిన్నబోవాల్సిందే. అందుకే వానాకాలంలో రాచుకుపోయి నొప్పిచేసే గొంతుకు అతి మధురంతో చేసే టీ మందుగా పనిచేస్తుంది. వినడానికి కొత్తగా ఉన్నా తాగడానికి బాగానే ఉంటుంది ఇది. ఇక దీనితో పాటు ఈ టీలో జోడించే దాల్చిన చెక్క కూడా గొంతులో వచ్చే దురదను పోగొట్టడానికి సాయపడుతుంది. అతి మధురంలో ఉండే యాంటి ఇన్ఫ్లమేటరీ గుణాలు గొంతునొప్పిని తగ్గించి సాంత్వనను చేకూరుస్తాయి. దాల్చిన చెక్కలోని యాంటి బ్యాక్టీరియల్ గుణాలు ఇన్ఫెక్షన్లతో పోరాడతాయి. కాబట్టి ఈ రెండూ జోడించిన తేనీరు ఈ సీజన్‌కి పర్ఫెక్ట్ రెసిపీ. ఇంతకీ దీన్ని ఎలా చేయాలంటే… ముందుగా కొద్దిగా నీళ్లను పొయ్యి మీద పెట్టి గ్రీన్ టీ పొడి లేదా ఆకుల్ని వేయాలి. కాస్త మరిగాక దాల్చిన చెక్క, అతి మధురాలను జోడించాలి. కాసేపయ్యాక దించి వడగట్టాలి. తీపితో పాటు ఒక రకమైన ఘాటు రుచి కలిగి ఉంటుంది ఈ టీ.
టీ అంటే ఆకులతోనే కాదు పువ్వులతోనూ పెట్టుకోవచ్చు. ముఖ్యంగా చామంతి పూలతో చేసే చామోమిల్ టీ అన్నది ఆరోగ్యపరంగా ఎంతో మంచిది. చామంతి పూలల్లో యాంటి ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇందులో వాపులు, నొప్పుల్ని తగ్గించే యాంటి ఇన్ఫ్లమేటరీ గుణాలూ ఎక్కువే. జలుబు, దగ్గులాంటి వాటిని సులభంగా అరికడుతుంది. ఇందులో ఉండే ఎపిజెనిన్ అనే యాంటి ఆక్సిడెంట్ ఒత్తిడిని దూరం చేసి, చక్కని నిద్రకు సాయపడుతుంది. కడుపులో నొప్పి, గ్యాస్ పట్టినట్లు ఉండటం, అజీర్తిలాంటి వాటికి కూడా ఇది మంచి మందు. ఇక, ఈ టీ పెట్టుకోవాలంటే ముందుగా నీళ్లను వేడి చేసుకుని అందులో చామంతి పూలు వేసి కాసేపు మరగనిచ్చి ఒంపుకోవడమే. అయితే ఈ రకంలో ఎక్కువగా ఎండిన చామంతి పువ్వుల్ని వాడతారు. అలా కాకుండా చామోమిల్ టీ బ్యాగుల్ని వాడాలనుకుంటే వేడి వేడి నీళ్లలో ఈ బ్యాగ్ ముంచి అయిదు నిమిషాలు ఉంచి తీస్తే సరి… సువాసనలు వెదజల్లే చామంతి టీ తయారైనట్టే. కొందరు దీనిలో తేనెను కలుపుకొని తీసుకుంటారు.
కాస్త ఆరోగ్య స్పృహ ఉన్నవాళ్లు ఈ మధ్య వారంలో కనీసం రెండు మూడు సార్లు గ్రీన్‌టీకి తమ మెనూలో చోటిస్తున్నారు. వ్యాధులు ఎక్కువగా దాడి చేసే అవకాశం ఉన్న ఈ వానాకాలంలో మాత్రం దానికి ప్రాధాన్యం పెంచాల్సిందేనని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఇందులో పుష్కలంగా ఉండే యాంటి ఆక్సిడెంట్లు రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి. అంతేకాదు, శరీరంలోని వ్యర్థాలను బయటికి పంపడానికి కూడా గ్రీన్‌టీ ఉపకరిస్తుంది. ఇక, దీని తయారీ అన్నది చాలా సింపుల్. గ్రీన్ టీ ఇప్పుడు బోలెడు ఫ్లేవర్లలో దొరుకుతున్నది. మీకు నచ్చిన గ్రీన్ టీ పొడిని తీసుకుని, బాగా మరిగిన నీళ్లలో వేసి, మూడు నాలుగు నిమిషాల పాటు మూత పెట్టి ఉంచి తీసి వడపోస్తే సరి. ఆరోగ్యకరమైన గ్రీన్ టీ రెడీ! తేనె, తులసి ఆకుల్లాంటివి ఏమన్నా కలుపుకుంటే మరిన్ని ఆరోగ్య గుళికల్ని చేర్చుకున్నట్టే.
వర్షాకాలంలో ఉండే చల్లని వాతావరణం, ఉష్ణోగ్రతలో హెచ్చుతగ్గుల వల్ల శరీర జీర్ణవ్యవస్థ ప్రభావితం అవుతుంది. దాంతో ఆహారం జీర్ణమవడం కష్టంగా మారుతుంది. క్రమంగా జీవక్రియ మందగిస్తుంది. ఇలా వానాకాలంలో వచ్చే పొట్ట సమస్యల్ని దూరం చేసేందుకు కూడా ఓ మంచి చిట్కా ఉంది, అదే సోంపు టీ. సోంపు గింజలతో చేసిన చాయ్ జీర్ణరసాల ఉత్పత్తిని మెరుగు పరుస్తుంది. గ్యాస్ పట్టకుండా అరికడుతుంది. పేగుల కదలికల్ని క్రమబద్ధీకరించి, ఆహారం సునాయాసంగా జీర్ణమయ్యేలా చేస్తుంది. వానాకాలం రోజుల్లో నూనెల్లో ముంచి తీసిన ఆహారాన్ని ఇష్టపడుతుంటాం. అవి తిన్నాక ఈ టీ తాగితే కడుపులో ఉపశమనంగా ఉంటుంది.