దంత సంరక్షణ కోసం రోజుకు రెండుసార్లు బ్రష్ చేసుకోవాలని వైద్యులు చెబుతుంటారు. కానీ, సమయాభావం వల్ల చాలామంది ఒక్కసారే కానిచ్చేస్తుంటారు. మరికొందరు రాత్రిపూట ‘మౌత్ వాష్’ను ఆశ్రయిస్తుంటారు. అయితే, ఇలా ప్రతిరోజూ మౌత్ వాష్‌తో నోటిని శుభ్రం చేసుకోవడం మంచిదికాదని డెంటిస్టులు హెచ్చరిస్తున్నారు.
మౌత్ వాష్ అనేది రెగ్యులర్‌గా వాడాల్సిన ఉత్పత్తి కాదని డెంటిస్టులు చెబుతున్నారు. నోటిలో, దంతాలలో ఏదైనా సమస్య ఉన్నప్పుడు మాత్రమే దీనిని వాడాలని సూచిస్తున్నారు. చాలా రకాల మౌత్ వాష్‌లు ఆల్కహాల్‌తో తయారవుతాయి. అది నోటిలో లాలాజల ఉత్పత్తిని తగ్గిస్తుంది. రెగ్యులర్‌గా వాడితే నోరు పొడిబారుతుంది. లాలాజల ఉత్పత్తి తగ్గడం వల్ల నోటిలో బ్యాక్టీరియా అధికంగా పెరుగుతుంది. మరికొన్ని రకాల మౌత్‌వాష్‌లలో ‘క్లోరెక్సిడైన్’ అనే మందును వాడుతారు. ఇది నోటిలోని బ్యాక్టీరియా, శిలీంధ్రాలు, వైరస్‌లను చంపుతుంది.
దీర్ఘకాలంలో దంతాలపై మరకలను ఏర్పరుస్తుంది. మౌత్‌వాష్‌ను రోజూ ఉపయోగిస్తే.. నోటిలో ఉండే మంచి బ్యాక్టీరియా కూడా నశిస్తుంది. మౌత్‌వాష్‌లోని రసాయనాలు.. చాలాసేపటి వరకు నోటినే అంటిపెట్టుకొని ఉంటాయి. తినే ఆహారపు రుచిని ప్రభావితం చేస్తాయి. ఆల్కహాల్ ఎక్కువగా ఉండే మౌత్వాష్లను రెగ్యులర్‌గా వాడితే.. దంతక్షయం వచ్చే ప్రమాదం
పెరుగుతుంది.
ఎప్పుడు వాడాలి?
మౌత్ వాష్ ఒక సహాయక ఉత్పత్తి మాత్రమే! బ్రషింగ్, ఫాగింగ్‌కు ఏమాత్రం ప్రత్యామ్నాయం కాదు. నోటి అనారోగ్యం, చిగుళ్ల వాపు, నోటి దుర్వాసన, అధిక క్యావిటీల్లాంటి సమస్యలు ఉన్నపుడే మౌత్ వాష్‌ను వాడాలి. అదికూడా వైద్యుల సిఫారసు మేరకే! అందులోనూ ఆల్కహాల్ లేని మౌత్ వాష్ వాడటం బెటర్. కేవలం 20 – 30 సెకన్ల పాటు మాత్రమే దీనిని వాడాలి. చిన్న పిల్లలు మౌత్ వాష్ వాడటం మంచిదికాదు.