తన వయసులో ఉన్న పిల్లలంతా టీవీలు చూస్తూ.. ఫోన్స్‌లో రీల్స్ చేస్తుంటే ఆమె మాత్రం పదమూడేళ్లకే చెస్ చాంపియన్ అయింది. ఆటలో పడి చదువును నిర్లక్ష్యం చేయలేదు. చెస్ గడుల్లోనే కాదు.. బడిలోనూ ద బెస్ట్ అనిపించుకుంది హైదరాబాద్‌కు చెందిన మోదిపల్లి దీక్షిత. ఇటీవల గోవాలో జరిగిన జాతీయ చెస్ చాంపియన్‌షిప్ అండర్ 13లో సత్తాచాటిన ఈ హైదరాబాదీ.. గ్రాండ్ మాస్టర్ కావడమే తన లక్ష్యం అంటున్నది.
హైదరాబాద్‌కు చెందిన మోదిపల్లి శేషాద్రినాయుడు-రజినీ దంపతుల కుమార్తె దీక్షిత. చిన్నప్పటి నుంచి చెస్ పావులే ఆమె ఆటవస్తువులు. ఇంట్లో పెద్దవాళ్లు చదరంగం ఆడుతుంటే… చిన్నారి దీక్షిత దీక్షగా వాళ్ల ఆటను గమనిస్తూ ఉండేది. నెమ్మదిగా ఆ ఆటపై ఆసక్తి పెంచుకుంది. కూతురి అభిరుచిని గమనించిన తల్లిదండ్రులు ఆమెను చెస్ అకాడమీలో జాయిన్ చేశారు. కోచ్ కృష్ణతేజ ప్రోత్సాహంతో ఆటలో మెలకువలు ఒడిసిపట్టింది. గంటల తరబడి ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది. ఆటలో ఎంత ఆరితేరిందంటే.. ప్రత్యర్థి ఎత్తులకు తన పావులు కుదేలవుతున్నా.. ఈ చిన్నారి ముఖంలో ప్రశాంతత చెక్కుచెదరదు. చివరి మలుపులో మెరుపులాంటి ఎత్తువేసి ప్రత్యర్థిని చిత్తు చేసి అందర్నీ
ఆశ్చర్యపరుస్తుంటుంది.
ఇప్పటివరకు నాలుగుసార్లు జాతీయ స్థాయి చెస్ పోటీల్లో రాణించిన దీక్షిత ఇటీవల గోవాలో నిర్వహించిన 30వ జాతీయ చెస్ చాంపియన్‌షిప్‌లో అండర్ 13 విభాగంలో విజేతగా నిలిచింది. ఆటలోనే కాదు చదువులోనూ దీక్షిత ముందంజలో ఉంది. ఏ పరీక్షలు రాసినా 90 శాతం మార్కులు సాధిస్తూ ఉంటుంది. ఆట గురించి బాధ్యత తండ్రిది కాగా, చదువు విషయమంతా తల్లిదే! చెస్ ప్రాక్టీస్ నుంచి రాగానే కూతురికి పాఠాలు చెబుతుంటుంది తల్లి రజని. ‘మా అమ్మానాన్నల ప్రోత్సాహం వల్లే ఈ విజయాలు సాధ్యమయ్యాయి. గ్రాండ్ మాస్టర్ కావడమే నా లక్ష్యం. కోనేరు హంపి వారసత్వాన్ని అందిపుచ్చుకునేలా నిరంతరం శ్రమిస్తాను’ అంటున్న దీక్షితకు మనమూ ఆల్ ద బెస్ట్ చెబుదామా!