ప్రాతః స్మరామి లలితా వదనారవిందం
బింబాధరం పృథుల మౌక్తికశోభినాసమ్
ఆకర్ణ దీర్ఘనయనం మణికుండలాఢ్యం
మందస్మితం మృగమదోజ్జ్వల ఫాలదేశమ్
త్రిపురాత్రయంలో ఈమె రెండో దేవత. త్రిగుణాతీతమైన కామేశ్వర స్వరూపంలో, సకల లోకాతీత కోమలత్వంతో ప్రకాశిస్తుంది. లలితాదేవి మణిద్వీప నివాసిని. సకల సృష్టి, స్థితి, సంహార కారిణి. శ్రీవిద్యా స్వరూపిణి. ఉపాసకులకు ముఖ్య ఆరాధ్య దేవత. ‘చిదగ్నికుండ సంభూతా’ అంటుంది లలితా సహస్ర నామం. ‘చిత్’ అంటే చైతన్యం. చైతన్యం అనే అగ్నికుండం నుంచి అమ్మ ఆవిర్భవించింది. సకల విశ్వ చైతన్య శక్తి స్వరూపం శ్రీచక్రం. ఈ శ్రీచక్రానికి అధిష్ఠాన దేవత లలితా త్రిపురసుందరి. కోటి సూర్యుల ప్రకాశంతో సమానమైన కాంతి స్వరూపంతో, చేతిలో పాశం, అంకుశం, చెరకు విల్లు, పూలబాణాలు ధరించి దర్శనమిస్తుంది. లక్ష్మీ, సరస్వతి ఇరువైపులా నిల్చుని వింజామరలతో వీస్తూ అమ్మను సేవిస్తుంటారు. లలితా ఉపాసనతో దారిద్య్రం నశిస్తుంది. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. అమ్మకు పులిహోర, వడలు, పాయసం నివేదన చేయాలి.