సాధారణంగా డిసెంబర్ మాసాన్ని సినిమాలకు ఆఫ్ సీజన్‌గా పరిగణిస్తారు. ఎట్లాగూ సంక్రాంతి బరిలో పెద్ద సినిమాల సందడి ఉంటుంది కాబట్టి డిసెంబర్ రిలీజ్‌ల విషయంలో దర్శకనిర్మాతలు వేచి చూసే ధోరణి అవలంభిస్తారు. అయితే ఈ ఏడాది అందుకు భిన్నమైన వాతావరణం కనిపిస్తున్నది. డిసెంబర్ నెలలో దాదాపు డజనుకుపైగా సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. వీటిలో భారీ చిత్రాలతోపాటు చిన్న సినిమాలు కూడా ఉన్నాయి. దీంతో సంక్రాంతికి ముందే తెలుగు నాట సినిమా పండుగ సందడి చేయనుంది.
Tollywood | ప్రస్తుతం దేశమంతా ‘పుష్ప-2’ మేనియాలో ఉంది. ఈ నెలలో రిలీజ్ అవుతున్న పెద్ద సినిమా ఇదే. ప్రచార కార్యక్రమాల్లో భాగంగా దేశంలోని ప్రధాన నగరాల్లో పర్యటిస్తున్న చిత్ర బృందానికి అభిమానులు బ్రహ్మరథం పడుతున్నారు. ‘పుష్ప’ సినిమా పాన్ ఇండియా స్థాయిలో అపూర్వ విజయాన్ని సొంతం చేసుకోవడం, అల్లు అర్జున్‌కు జాతీయ అవార్డు రావడంతో ‘పుష్ప’రాజ్ ఓ బ్రాండ్లా తయారయ్యాడు. ఇటీవల విడుదల చేసిన ట్రైలర్ మాస్కు బాగా రీచ్ అయింది. ఈ నెల 5న ‘పుష్ప-2’ సృష్టించే వైల్డ్‌ఫైర్ ఎలా ఉంటుందో చూద్దామని అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా దేశవ్యాప్తంగా 12వేల స్క్రీన్స్‌లో భారీ స్థాయిలో విడుదలవుతుండటం విశేషం. ‘పుష్ప-2’ రిలీజ్ తర్వాత వారం పాటు మరో సినిమా రావడం లేదు. దాదాపు రెండు వారాలపాటు బాక్సాఫీస్‌ను రూల్ చేసేందుకు ‘పుష్ప-2’ సిద్ధమవుతున్నాడు. ఈ సినిమా తర్వాత.. వేదిక ప్రధాన పాత్రలో నటించిన ‘ఫియర్’ డిసెంబర్ 14న విడుదలవుతున్నది. అరవింద్ కృష్ణ, జయప్రకాష్, పవిత్రా లోకేష్ కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా ఇప్పటికే పలు అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో అవార్డులను గెలుచుకుంది.
డిసెంబర్ ప్రథమార్థం మొత్తం థియేటర్లలో ‘పుష్ప-2’ సందడే కనిపించనుంది. ఇక మూడో వారం నుంచి వరుస సినిమా జాతర మొదలుకానుంది. ఏకంగా పదికిపైగా చిత్రాలు విడుదలకానున్నాయి. వాటిలో అల్లరి నరేష్ ‘బచ్చలమల్లి’, ప్రియదర్శి ‘సారంగపాణి జాతకం’తో పాటు కన్నడ హీరో ఉపేంద్ర డబ్బింగ్ చిత్రం ‘యూఐ’, విజయ్‌సేతుపతి ‘విడుదల పార్ట్-2’ సినిమాలు డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి. గత రెండేళ్లుగా మంచి విజయం కోసం వేచి చూస్తున్న అల్లరి నరేష్ ‘బచ్చలమల్లి’ విజయంపై కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు. నిజ జీవిత సంఘటనల స్ఫూర్తితో 1990 దశకం నేపథ్యంలో పీరియాడిక్ చిత్రంగా దీనిని తెరకెక్కించారు. సుబ్బు మంగదేవి దర్శకుడు. ‘నాంది’ తరహాలో తన కెరీర్లో గుర్తుండిపోయే సినిమా అవుతుందని అల్లరి నరేష్ ప్రచార కార్యక్రమాల సందర్భంగా చెప్పడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి.
మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో ప్రియదర్శి నటిస్తున్న ‘సారంగపాణి జాతకం’ సినిమా కూడా డిసెంబర్ రేసులో రానుంది. మనిషి భవిష్యత్తు చేతి రేఖల్లో ఉంటుందా? చేతల్లో ఉంటుందా? అనే అంశాన్ని చర్చిస్తూ హాస్యప్రధానంగా తెరకెక్కించారు. ఇటీవల విడుదలైన టీజర్‌కు మంచి స్పందన లభించింది. గత కొంతకాలంగా దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ హిట్ సినిమా కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ సినిమా ఆ లోటు తీర్చుతుందనే నమ్మకంతో ఉన్నాడాయన. కన్నడ అగ్ర నటుడు ఉపేంద్ర ‘యూఐ’ చిత్రంపై కూడా అంచనాలున్నాయి. పీరియాడిక్ సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ ఇది. ఓ గ్లోబల్ ఇష్యూని చర్చిస్తూ తెరకెక్కించామని మేకర్స్ అంటున్నారు. ఉపేంద్ర కెరీర్లోనే అత్యధిక బడ్జెట్‌తో ఈ సినిమా తీశారు. ఉపేంద్ర డైరెక్ట్ చేసే సినిమాల్లో ఏదో వైవిధ్యం ఉంటుందని ప్రేక్షకులు భావిస్తారు. దాంతో ‘యూఐ’ సినిమాపై హైప్ క్రియేట్ అయింది. ఇక వెట్రిమారన్ దర్శకత్వంలో వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ ‘విడుదల’ తమిళంలో సంచలన విజయం సాధించింది. అయితే తెలుగులో మాత్రం అంతగా ఆదరణ దక్కలేదు. ఇప్పుడు ‘విడుదల-2’ ప్రేక్షకుల ముందుకొస్తున్నది. విజయ్ సేతుపతి, సూరి, మంజు వారియర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ ఫలితం ఎలా ఉంటుందో వేచి చూడాలి.
‘ది లయన్ కింగ్’ చిత్రానికి ప్రీక్వెల్‌గా రూపుదిద్దుకున్న ‘ముఫాసా’ డిసెంబర్ 20న విడుదలకానుంది. ఇందులో ముఫాసా పాత్రకు అగ్ర హీరో మహేష్‌బాబు వాయిస్ ఓవర్ అందించడం విశేషం. రాజేంద్రప్రసాద్ మనవరాలు బేబీ సాయి తేజస్విని కీలక పాత్రలో నటించిన ‘ఎర్రచీర: ది బిగినింగ్’ చిత్రం కూడా డిసెంబర్ 20నే రిలీజ్ అవుతున్నది. మదర్ సెంటిమెంట్ ప్రధానంగా రూపొందించిన ఈ చిత్రానికి సుమన్‌బాబు దర్శకుడు. ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ‘మ్యాజిక్’ చిత్రం డిసెంబర్ 21న ప్రేక్షకుల ముందుకొస్తున్నది. అంతా కొత్తవారు నటించారు. అయితే సితార ఎంటర్టైన్మెంట్ లాంటి అగ్ర నిర్మాణ సంస్థ తెరకెక్కించడం, అనిరుధ్ మ్యూజిక్ అందించడంతో సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. కాలేజీ నేపథ్యంలో సంగీతభరిత కథాంశంతో తెరకెక్కించిన ఈ సినిమా యూత్‌ను మెప్పిస్తుందని చిత్ర బృందం చెబుతున్నది. నితిన్ హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో వస్తోన్న క్రైమ్ కామెడీ ‘రాబిన్‌హుడ్’ క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న విడుదలకానుంది.
‘భీష్మ’ లాంటి హిట్ సినిమా తర్వాత నితిన్, వెంకీ కుడుముల కాంబోలో వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే పాజిటివ్ బజ్ ఏర్పడింది. శ్రీలీల కథానాయిక. మైత్రీమూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. ఇటీవల విడుదల చేసిన టీజర్ ఆకట్టుకునేలా ఉంది. తన కెరీర్లోనే అత్యధిక బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కించారని, ఈసారి హిట్ పక్కా అని నితిన్ నమ్మకంతో ఉన్నాడు. వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రలో నటించిన డిటెక్టివ్ కామెడీ చిత్రం ‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’ డిసెంబర్ 25న విడుదల కానుంది. రైటర్ మోహన్ రూపొందించిన ఈ చిత్రంలో అనన్య నాగళ్ల కథానాయిక. ఇందులో ప్రైవేట్ డిటెక్టివ్‌గా వెన్నెల కిషోర్ పాత్ర ఆద్యంతం నవ్వుల్ని పంచుతుందని మేకర్స్ అంటున్నారు.
కీర్తి సురేష్ తొలి హిందీ చిత్రం ‘బేబీ జాన్’ డిసెంబర్ 25న రానుంది. తమిళ చిత్రం ‘తేరి’ రీమేక్ ఇది. వరుణ్‌ధావన్ కథానాయకుడిగా నటించిన ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయి. హిందీలో తనకు శుభారంభాన్నిస్తుందని కీర్తి సురేష్ నమ్మకంతో ఉంది. ప్రణవ్ కౌశిక్, ప్రీతి పగడాల, వంశీ పూజిత్ ప్రధాన పాత్రల్లో నటించిన స్పోర్ట్స్ ఎంటర్టైనర్ ‘పతంగ్’ డిసెంబర్ 27న రిలీజ్ కానుంది. ప్రణీత్ పత్తిపాటి దర్శకుడు. గాలిపటాల పోటీ నేపథ్యంలో సాగే యూత్‌ఫుల్ ఎంటర్టైనర్గా తెరకెక్కించారు. మొత్తంగా క్రిస్మస్ బరిలో 12కు పైగా చిత్రాలు ఉండటం విశేషం. ఈ నేపథ్యంలో సంక్రాంతి కన్నా ముందే వరుస సినిమాలతో బాక్సాఫీస్ కళకళలాడనుంది.