అందంగా కనిపించాలని.. ఎక్కువమంది ముఖ సౌందర్యంపైనే శ్రద్ధ పెడతారు. కాళ్లు, చేతులు, మెడ వంటి భాగాలను పట్టించుకోరు. దాంతో ఆయా ప్రదేశాలు నల్లగా మారి.. అందవిహీనంగా కనిపిస్తాయి. కాళ్లు, చేతులను కవర్ చేసినా.. మెడపై ఉండే నలుపు (డార్క్ నెక్)తో ఎక్కువ ఇబ్బంది పడుతుంటారు. ఈక్రమంలో కొన్ని చిట్కాలు పాటిస్తే.. డార్క్ నెక్ సమస్యను ఇట్టే దూరం చేసుకోవచ్చని సౌందర్య నిపుణులు అంటున్నారు.
నల్లగా మారిన చర్మాన్ని తెల్లగా మార్చడంలో టమాట, నిమ్మరసంలో ఉండే విటమిన్ సి సాయపడుతుంది. తేనెలో ఉండే సుగుణాలు.. చర్మాన్ని మృదువుగా మారుస్తాయి. ఒక చిన్న గిన్నెలో కొద్దిగా టమాటా రసం, రెండుమూడు చుక్కల నిమ్మరసం, కొంచెం తేనె వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని మెడపై నల్లగా మారిన ప్రదేశంలో అప్లయి చేయాలి. అరగంటపాటు అలాగే వదిలేసి.. ఆ తర్వాత చల్లటి నీటితో కడిగేయాలి.
ఆలుగడ్డలు క్లెన్సర్‌గా పనిచేస్తాయి. నిమ్మరసం.. అద్భుతమైన బ్లీచింగ్ ఏజెంట్ కూడా. డార్క్ నెక్‌ను తగ్గించడంలో ఈ రెండిటి మిశ్రమం సమర్థంగా పనిచేస్తుంది. ఇందుకోసం ఆలుగడ్డను ఉడికించి.. పొట్టు తీసి మెత్తగా మెదుపుకోవాలి. దానికి కాస్త నిమ్మరసం జోడించి.. బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని మెడకు పట్టించి.. పావుగంట తర్వాత చల్లని నీటితో కడిగేస్తే సరిపోతుంది.
కీరదోసలోనూ క్లెన్సర్‌గా పనిచేసే గుణాలు అనేకం ఉంటాయి. మెడపై పేరుకున్న మురికిని పోగొట్టడంతోపాటు అవసరమైన తేమను అందించి.. చర్మాన్ని నిగనిగలాడేలా చేస్తుంది. ఒక కీరదోసను తీసుకొని చిన్నగా తురుముకోవాలి. దీనిని మెడ భాగంలో సున్నితంగా మసాజ్ చేసుకోవాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి.
కాఫీ పౌడర్.. చర్మ సంరక్షణలోనూ గొప్పగా పనిచేస్తుంది. చర్మంపై మురికిని తొలగించి.. చర్మాన్ని కాంతిమంతంగా మారుస్తుంది. కొబ్బరినూనెలో కొద్దిగా కాఫీ పౌడర్ కలిపి.. స్క్రబ్‌లా తయారుచేసుకోవాలి. దీన్ని డార్క్నెక్పై రాసి.. సున్నితంగా రుద్దాలి. ఆ తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి.