ఆ కనుకొలుకులు వేనవేల పలుకులు పలుకుతాయి. ఆ కరభంగిమలు అనేక భావాలు పలికిస్తాయి. ఆ పాదాలకు జతులు తాళం వేస్తాయి. ఆ ప్రదర్శనలు ప్రబంధాలను ఆవిష్కరిస్తాయి. రంగస్థలంపై కూచిపూడి కళాకారుల నాట్య ప్రదర్శన.. నయనానంద గమనమే, శ్రవణానంద గానమే. సుప్రసిద్ధమైన ఈ శాస్త్రీయ నృత్యాన్ని ఖండాంతరాలకు మోసుకెళ్లిన కళామతల్లి బిడ్డలు
ఎంతో మంది. వారిలో హరితా కులకర్ణి ఒకరు.
డాన్స్ ఈస్ ద హిడెన్ లాంగ్వేజ్ ఆఫ్ ది సోల్
నాట్యం శాస్త్రీయమైన కళ. భరతనాట్యం, కూచిపూడి, ఒడిస్సీ, కథక్, కథకళి వంటి నృత్యరీతులు దేశవిదేశాల్లో ప్రాచుర్యం పొందాయి. విశ్వ వేదికల మీద భారతదేశ గౌరవాన్ని ఇనుమడింపజేస్తున్నాయి. వాద్య కారుల శ్రుతికి తగ్గట్టుగా.. నాట్యకారుల హావభావాలతో సాగే నృత్యకళ పట్ల ఆకర్షితులు కానివారు ఉండరు. నాట్యంతో ఏమాత్రం పరిచయం ఉన్నా.. ‘కూచిపూడి’ గురించి వినని వారూ ఉండరు. భరతుని నాట్యశాస్త్రంలో పునాదులు వేసుకొని.. నారాయణ తీర్థులవారి తరంగాలతో జీవంపోసుకుని.. యక్షగానంగా రూపాంతరం చెంది.. సిద్ధేంద్ర యోగి ప్రాపకంలో కూచిపూడి గ్రామంలో అవతరించి.. ‘పారిజాతాపహరణం’ ద్వారా పరిపూర్ణ రూపాన్ని పొందింది ఈ సంప్రదాయం. వెంపటి చినసత్యం, శోభానాయుడు తదితర దిగ్గజాలు తమ శిష్యుల ద్వారా కూచిపూడి నృత్యానికి ప్రాచుర్యం కల్పించారు. ఆ పరంపరను హరితా కులకర్ణి కొనసాగిస్తున్నారు.
కూచిపూడి కోసమే..
కూచిపూడి నాట్య గురువుగా అమెరికాలో పేరు తెచ్చుకున్న హరితా కులకర్ణి అచ్చమైన తెలంగాణ ఆడబిడ్డ. కామారెడ్డి జిల్లా సదాశివ నగర్లో జన్మించారు. నరసింహారావు, సుగుణమ్మ దంపతులకు నాలుగో సంతానం. చిన్నప్పటి నుంచీ నాట్యమంటే అభిమానం. గొప్ప నాట్యకారిణిగా గుర్తింపు పొందాలనేది జీవితాశయం. ఇంటర్మీడియెట్ వరకు కామారెడ్డిలో చదివారు. తన స్వప్నాన్ని నెరవేర్చుకోవడానికి హైదరాబాద్ వెళ్లాలనుకున్నారు. కానీ ఆర్థిక పరిమితుల కారణంగా కన్నవారు మొదట అంగీకరించలేదు. వారిని ఒప్పించేందుకు నాలుగు రోజులు పస్తులున్నారు. చివరికి కూతురి అభిరుచిని అర్థంచేసుకున్న తల్లి
దండ్రులు సుప్రసిద్ధ నృత్యకారిణి డాక్టర్ శోభానాయుడు ఆధ్వర్యంలోని శ్రీనివాస కూచిపూడి ఆర్ట్ అకాడమీలో చేర్పించారు. హాస్టల్లో ఉంటూ ఆ సంప్రదాయ నృత్యంలో మెలకువలు తెలుసుకున్నారు హరిత. పరిపూర్ణ పరిణతి సాధించాక అనేక ప్రదర్శనలు ఇచ్చారు. చండాలిక, కళ్యాణ శ్రీనివాసం, శ్రీకృష్ణ శరణం మమ, భామాకలాపం, శ్రీకృష్ణ పారిజాతం.. తదితర నృత్య రూపకాల్లో ముఖ్యపాత్రలు పోషించి మంచి పేరు సంపాదించుకున్నారు. బృందంలోనే కాకుండా.. హైదరాబాద్లోని రవీంద్రభారతి లాంటి వేదికలతో పాటు.. దేశంలోని ప్రముఖ నగరాలలో సోలో ప్రదర్శనలు ఇచ్చి ప్రేక్షకుల మెప్పు పొందారు. నాట్య గురువుల చేత శభాష్ అనిపించుకున్నారు. ప్రొఫెసర్ అరుణా భిక్షు పర్య వేక్షణలో.. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ
విద్యాలయం నుంచి కూచిపూడి నృత్యంలో డిప్లొమా పట్టా కూడా పొందారు. నృత్య సాధన కొనసాగిస్తూనే.. బీఏ పూర్తి చేశారు.
ఐటీ కంపెనీలో కొలువు.. అరుణ్ దర్పల్లితో వివాహం తర్వాత అమెరికాలోని అట్లాంటాలో స్థిరపడ్డారు హరిత. అక్కడ ప్రముఖ ఐటీ కంపెనీ ఉద్యోగంలో చేరారు. కుటుంబ, ఉద్యోగ బాధ్యతల్లో తలమునకలైనా నాట్యానికి మాత్రం దూరం కాలేదు.
అట్లాంటాలోని తెలుగు అసోసియేషన్ ఆఫ్ మెట్రో అట్లాంటా, గ్రేటర్ అట్లాంటా తెలుగు అసోసియేషన్, గ్రేటర్ అట్లాంటా తెలంగాణ అసోసియేషన్, హిందూ టెంపుల్ ఆఫ్ అట్లాంటా తదితర తెలుగు సంఘాలు నిర్వహించే కార్యక్రమాలలో, దేవాలయాలలో జరిగే
ఉత్సవాలలో నాట్య ప్రదర్శనలిచ్చి.. తన హావభావాలతో ప్రేక్షకులను కట్టిపడేశారు. ‘నృత్యం జీవించడాన్ని నేర్పిస్తుంది. ఆత్మ
సంతృప్తికి కొత్త అర్థం చెబుతుంది. కూచిపూడిలో వినోదం, విజ్ఞానం రెండూ ఉన్నాయి. మానసిక వికాసాన్ని కలిగించే కళ ఇది. ఈ వారసత్వ సంపదను పదిమందికీ పంచాలనే ఉద్దేశంతో నాట్యాలయ కూచిపూడి అకాడమీ స్థాపించాను. ఆ వేదిక మీద ఆసక్తి ఉన్నవారికి శిక్షణ ఇస్తున్నాను’ అని చెబుతారు హరిత. వయసు, ప్రాంతం, భాషతో సంబంధం లేకుండా అన్ని వయసులవారూ ఆమె దగ్గర శిష్యరికం చేస్తున్నారు. సొంతంగా కూడా నృత్య రూపకాలు తయారు చేసుకుని వాటికి తానే కొరియోగ్రఫీ అందించి ప్రదర్శనలిస్తారామె. ఇస్కాన్ వారు ఏటా నిర్వహించే కృష్ణాష్టమి ఉత్సవాల్లో సంస్థ ప్రతినిధులకు శిక్షణ అందించి.. నృత్య ప్రదర్శనలు ఇప్పిస్తారు. తెలంగాణ దశాబ్ది వేడుకల సందర్భంగా గ్రేటర్ అట్లాంటా తెలంగాణ సొసైటీ ఆధ్వర్యంలో జరిగిన ఉత్సవాలలో భక్త రామదాసుపై నృత్యరూపకం రూపొందించి ప్రదర్శించారు. కుటుంబంలో అందరూ కళాకారులు కావడం వల్లనే తనకు ఇంతటి ప్రోత్సాహం లభిస్తున్నదని చెబుతారు హరిత. ఆమె తండ్రి ఫ్లూట్ ఆర్టిస్ట్. తమ్ముడు క్లాసికల్ కీబోర్డ్ కళాకారుడు,
హరిత కూతురు అర్చిష దర్పల్లి కూడా కూచిపూడిలో తర్ఫీదు పొందుతున్నారు. ‘మనదైన నాట్య సంప్రదాయాన్ని అమెరికా వరకూ తీసుకెళ్లి.. నటరాజుకు సేవ చేసే అదృష్టం దక్కింది. ఇది నా పూర్వజన్మ సుకృతం’ అంటారామె.
…? గుళ్ళపల్లి తిరుమల కాంతి కృష్ణ