ప్రస్తుతం వస్త్ర వ్యాపారం షోరూమ్‌లలో కన్నా ఆన్లైన్లోనే ఎక్కువగా సాగుతున్నది. మార్కెటింగ్‌లో ఎంబీఏ చదివిన భువనగిరి బిడ్డ రౌతు ప్రవీణకు ఈ ముచ్చట తెలుసు! ఆన్లైన్ స్టోర్స్ అనగానే కార్పొరేట్ పేర్లే తప్ప.. లోకల్ ఫ్లేవర్స్ ఎందుకు కనిపించవు? అని అనుకుందామె! లోకల్ ఉత్పత్తులకు గ్లోబల్ గుర్తింపు రావాలని భావించింది. ‘ఆరూ’ బ్రాండ్‌తో విపణిలోకి అడుగుపెట్టింది. సరసమైన ధరలకు మన్నికైన దుస్తులను అందుబాటులోకి తెచ్చి అతివల మనసు గెలుచుకుంది. పక్కా లోకల్ బ్రాండ్‌ను విదేశాలకు సరఫరా చేసే స్థాయికి తన స్టార్టప్‌ను పరుగులు పెట్టిస్తున్న ‘ఆరూ టెక్స్టైల్స్ అండ్ గార్మెంట్స్’ మేనేజింగ్ డైరెక్టర్ రౌతు ప్రవీణ ప్రయాణమిది.
భువనగిరికి చెందిన ప్రవీణ ఎంబీఏ చేసింది. చదువు పూర్తయిన తర్వాత బోధనపై ఆసక్తితో ఓ ప్రొఫెసర్ దగ్గర సహాయకురాలిగా పనిలో కుదిరింది. ప్రవీణ తండ్రి ఎలక్ట్రిక్ వస్తువులు విక్రయించేవాడు. ఆయన స్ఫూర్తితో తనూ సొంతంగా వ్యాపారం చేయాలని భావించిందామె. అతివలకు అందమైన వస్త్ర శ్రేణిని అందుబాటులోకి తీసుకురావాలనుకుంది. తన కొడుకు ఆరుష్ పేరుమీద ‘ఆరూ’ బ్రాండ్‌తో స్టార్టప్ జర్నీ మొదలుపెట్టింది. ఇ-కామర్స్, బడా వ్యాపార సంస్థలతో గ్రామస్థాయికి విస్తరించిన వస్త్ర వ్యాపారంలోకి అడుగుపెట్టింది. పదిమంది మహిళలకు ఉపాధి కల్పిస్తూ సరసమైన ధరలో ఉండే దుస్తులు విక్రయించడం మొదలుపెట్టింది. 2023లో మొదలైన ఆమె స్టార్టప్ జర్నీ.. ఆశించిన ప్రగతి సాధిస్తూ, లాభాల పట్టాలెక్కింది.
ప్రవీణ వస్త్ర ప్రపంచంలో అడుగుపెట్టే నాటికే మార్కెట్లో వందలాది బ్రాండ్స్ అందుబాటులో ఉన్నాయి. వేటికవే ప్రత్యేకతను సంతరించుకున్నాయి. ఈ పోటీ ప్రపంచంలో నిలబడాలంటే నాణ్యత విషయంలో రాజీ పడొద్దనీ, తమ ఉత్పత్తులు అందుబాటు ధరలో ఉండేలా చూసుకోవాలని భావించింది ప్రవీణ. ఈ క్రమంలో మగువలు మనసుపడే అన్ని రకాల వస్త్ర శ్రేణిని అందుబాటులోకి తీసుకొచ్చింది. ట్రెండింగ్ ప్యాటర్న్స్, విభిన్నమైన రంగులు ఉండే వస్ర్తాలను కొనుగోలు చేసి ఉత్పత్తి ప్రారంభించింది. చుడీదార్లు, టాప్స్, కుర్తీలు, ఫ్రాక్స్ ఇలా యువతులు, మహిళలు ఇష్టపడే అన్నిరకాల దుస్తులను అందుబాటులోకి తెచ్చింది. ప్రవీణ మొదట కేవలం హోల్‌సేల్ మార్కెట్ లక్ష్యంగా వ్యాపారం ప్రారంభించింది. అయితే, నిర్వహణ, వ్యాపార లావాదేవీలు పెంచుకునేందుకు వీలుగా రిటైల్ షోరూం కూడా మొదలుపెట్టింది. కొనుగోలుదారుల నుంచి మంచి స్పందన రావడంతో.. ఆన్లైన్ అంగట్లోనూ విక్రయాలు ప్రారంభించింది. వాట్సాప్, ఫేస్బుక్, ఇన్‌స్టా ఇలా సామాజిక మాధ్యమాలు వారధిగా ‘ఆరూ’ బ్రాండ్‌కు ఆదరణ పెరిగింది.
వ్యాపారం ప్రారంభించిన తొలినాళ్లలో అందరికీ ఎదురైన అనుభవాలనే ప్రవీణ కూడా చవిచూసింది. కానీ, పట్టుదలతో ముందడుగు వేసింది. పోటీదారుల కన్నా తక్కువ ధర ఉన్నప్పుడే మార్కెట్లో నిలబడగలమని నిశ్చయించుకుంది. అంతేకాదు, సొంతంగా డిజైన్లు చేసి కొనుగోలుదారుల దృష్టిని ఆకర్షించింది. ఆరు నెలల్లో ‘ఆరూ’ అమ్మకాలు ఊపందుకున్నాయి. రెండేండ్లలో గణనీయమైన అభివృద్ధి చెందింది. లోకల్ ఫ్లేవర్ మిస్సవ్వకుండా ‘ఆరూ’ బ్రాండ్ అందిస్తున్న డిజైనరీ దుస్తులు గ్రామీణ ప్రాంతాలకూ చేరుతున్నాయి. భువనగిరి కేంద్రంగా ఉత్పత్తి అవుతున్న ఆరూ ఉత్పత్తులు ఆరు జిల్లాలకు చేరాయి. ఆన్లైన్ వేదికగా ఇతర దేశాల నుంచి కూడా ఆర్డర్లు రావడం మొదలైంది. వాట్సాప్, సోషల్ మీడియా వేదికలతోపాటు https://aarugarments.com/ వెబ్సైట్ ద్వారా విక్రయాలు కొనసాగుతున్నాయి. వ్యాపారంలో నిలదొక్కుకోవాలన్న ప్రవీణ ఆసక్తిని గమనించిన వీ హబ్.. ఆమెకు అండగా నిలిచింది. వ్యాపార విస్తరణ, అకౌంట్ నిర్వహణ, మార్కెటింగ్ తదితర అంశాలపై వీ హబ్‌లో శిక్షణ తీసుకుంది. వీ హబ్ చొరవతో ఆంత్రప్రెన్యూర్‌గా స్థిరపడాలన్న తన అభిరుచికి ఒక రూపం వచ్చిందని ప్రవీణ చెబుతున్నది. ప్రస్తుతం తనలాగే వ్యాపారరంగంలోకి అడుగు పెట్టాలనుకునేవారికి తోడుగా ఉంటుందామె. సొంతూరిలోనే తక్కువ పెట్టుబడితో వస్త్ర వ్యాపారాన్ని ప్రారంభించేలా సాటి మహిళలకు చేయూతనిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నది.
నిజానికి వస్త్ర వ్యాపారంలో నిలబడాలంటే నాణ్యమైన వస్త్రంతోనే సాధ్యం అవుతుంది. మీషో, అజియో లాంటి ఇతర ఈ కామర్స్ వెబ్సైట్లలో దొరికే డిజైన్ల కన్నా వైవిధ్యంగా ఉండేలా, అన్ని పరిమాణాల్లో ఉండే వస్ర్తాలను అందుబాటులో ఉంచుతున్నా. కుర్తాలు, పైజమాలు, లెహంగా, పార్టీవేర్, నైటీలు ఇలా అన్ని రకాల దుస్తులు, సరైన కొలతలతో సొంతంగా డిజైన్ చేస్తున్నాం. ఉత్పత్తుల నాణ్యత బాగుండటంతో రెగ్యులర్ కస్టమర్ల సంఖ్య గణనీయంగా పెరిగింది.