అభిరుచికి సృజన తోడైతే అద్భుతాలే! ఈ మాట ఆభరణాల తయారీకి కూడా వర్తిస్తుంది. బంగారం, వెండి వగైరా లోహాలతో చేసినవే కాకుండా కొత్తదనంతో మెరిసిపోయే మృత్తికా ఆభరణాలూ మగువల మనసులను దోచేస్తున్నాయి. చిన్నపిల్లలు బొమ్మలు చేసుకునే పాలిమర్ క్లే (చైనా క్లే)తో రూపొందే రంగురంగుల నగలు ట్రెండింగ్లో ఉన్నాయిప్పుడు.
పాలిమర్ జువెలరీకి ఓ వెసులుబాటు ఉంది. నగల దుకాణాల వెంట పరుగులు ఉండవు. స్వచ్ఛత గురించి భయమూ వద్దు. ఇంట్లోనే కూర్చుని కావలసిన డిజైన్లో ముచ్చటైన ఆభరణాలు తయారు చేసుకోవచ్చు. పాలిమర్ క్లేను అందమైన ఆకృతుల్లోకి మలుచుకోవచ్చు. ఎలాంటి పగుళ్లూ లేని మృదుత్వం కారణంగా.. మట్టితో చేసిన పూలు, పూసలు సహజంగా కనిపిస్తాయి.
తయారీ కూడా చాలా సులువు. సన్నటి లోహపు తీగల సాయంతో కావలసిన పరిమాణంలో మట్టిని మలుచుకుని.. అభిరుచికి తగినట్టు వింతవింత రంగులు వేసి.. కొంత సేపు అల్ట్రావయెలెట్ కిరణాల వెలుగులో ఉంచితే చాలు. అందమైన సొమ్ములు సిద్ధం. అంత ఓపిక లేకపోతే.. మట్టితో చేసిన గొలుసులు, జుంకాలు, పెండెంట్లు, బ్రేస్లెట్లు మార్కెట్లో తయారుగానే ఉన్నాయి. ఒకే డిజైన్తో చేసిన కాంబోలూ లభిస్తున్నాయి. సంప్రదాయ దుస్తులతోపాటు, ఆధునిక వస్ర్తాలకూ నప్పుతాయి. ధర చవక.
మహా తేలిక. సౌకర్యానికి సౌకర్యం. సోషల్ మీడియా లోనూ తయారీ వీడియోలు అందుబాటులో ఉన్నాయి. ఇంకెందుకు ఆలస్యం.. టకటకా తయారు చేసుకుని, చకచకా ధరించండి. పాలిమర్ నగలు అలంకరించుకుని, పండక్కి పంచవర్ణాల ముగ్గులేయండి. బొమ్మల కొలువులో మీరే ఓ బొమ్మలా కనిపించండి. ‘విమెన్ ఆఫ్ ద పేరంటం’ అవార్డు మీకే!