ఆరోగ్యానికే కాదు.. అందాన్ని ప్రసాదించడంలోనూ ఆవు నెయ్యి అద్భుతంగా పనిచేస్తుంది. సహజసిద్ధమైన సౌందర్యసాధనాల్లో ఇది ముందు వరుసలో ఉంటుంది. ఎలాంటి క్రీములు, మాయిశ్చరైజర్ల అవసరం లేకుండానే.. చర్మాన్ని తళతళా మెరిపిస్తుంది. ముఖాన్ని కాంతిమంతం చేయడంలోనూ, పగిలిన పెదాలు, పాదాలను సున్నితంగా మార్చడంలోనూ, కళ్లకింద నల్లటి వలయాలను తొలగించడంలోనూ ఆవు నెయ్యి సాయపడుతుంది.
అర టీస్పూన్ ఆవు నెయ్యిలో చిటికెడు పసుపు కలిపి పేస్ట్‌గా చేయాలి. దీనిని చర్మానికి రాసుకొని.. 20 నుంచి 30 నిమిషాలు అలాగే వదిలేయాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో స్నానం చేస్తే.. చర్మం మరింత మృదువుగా మారిపోతుంది.
పెదాలు పగిలిపోయి, అంద విహీనంగా కనిపిస్తుంటే.. రాత్రిపూట కొద్దిగా ఆవునెయ్యి రాస్తే సరి.
పాదాలు మృదువుగా ఉండాలంటే.. రాత్రి పడుకునే ముందు పాదాలను శుభ్రంగా కడుక్కోవాలి. పొడిబట్టతో బాగా తుడిచి.. ఆవు నెయ్యి రాసుకొని, సున్నితంగా మర్దనా చేసుకోవాలి. ఉదయం శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
ఒక టేబుల్ స్పూన్ శనగ పిండిలో ఓ టీస్పూన్ ఆవు నెయ్యి, మరో టీస్పూన్ పాలు వేసి బాగా కలపాలి. ఈ పేస్ట్‌ను ముఖానికి రాసుకుని.. 20 నిమిషాల తర్వాత కడిగేసుకుంటే.. చర్మం మెరిసిపోతుంది.
కళ్ల కింద డార్క్ సర్కిల్స్ తగ్గించడంలోనూ ఆవు నెయ్యి ముందుంటుంది. రాత్రి పడుకునే ముందు కళ్ల కింద ఆవు నెయ్యితో సున్నితంగా మర్దనా చేయాలి. ఉదయాన్నే కళ్లను శుభ్రం చేసుకోవాలి. ఇలా రెగ్యులర్‌గా చేస్తే.. కళ్లకింది నలుపు తగ్గిపోతుంది.
ఆవు నెయ్యితో మసాజ్.. చర్మాన్ని మరింత కాంతిమంతంగా మారుస్తుంది. రాత్రి పడుకునే ముందు ఆవు నెయ్యిని మాయిశ్చరైజర్‌లాగా శరీరానికి రాసుకోవాలి. ఉదయం లేవగానే గోరువెచ్చని నీటితో కడిగేసుకుంటే.. చర్మం తాజాగా తయారవుతుంది. వారంలో రెండుసార్లు ఈ చిట్కాను పాటిస్తే.. మంచి ఫలితం కనిపిస్తుంది.