స్నేహానికి – పరిమళానికి అవినాభావ సంబంధం ఉన్నదట. మహిళలు తమ స్నేహితులను ఎంపిక చేసుకోవడంలో సువాసన కీలకపాత్ర పోషిస్తుందట. ఒక వ్యక్తినుంచి వచ్చే పరిమళం, వాళ్లు వాడే పెర్ఫ్యూమ్, డియోడరెంట్.. వారి ఫ్రెండిషిప్ కెమిస్ట్రీని నిర్ణయిస్తాయని అంటున్నారు కార్నెల్ విశ్వవిద్యాలయం పరిశోధకులు. మిడిల్ టెనస్సీ స్టేట్ విశ్వవిద్యాలయం, టర్కీలోని సబాన్సీ విశ్వవిద్యాలయంతోపాటు కార్నెల్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు కొత్త స్నేహాలు చిగురించడంలో పరిమళాల పాత్రపై ఒక అధ్యయనం నిర్వహించారు. సైంటిఫిక్ రిపోర్ట్స్ జర్నల్‌లో ఈ అధ్యయనం ప్రచురితమైంది. మహిళలు ఎవరిని ఇష్టపడతారో, ఎవరితో స్నేహం చేయాలనుకుంటున్నారో నిర్ణయించుకోవడంలో ఘ్రాణ సంకేతాలు కీలకపాత్ర పోషిస్తాయని ఈ పరిశోధనలో తేలింది.
అధ్యయనంలో భాగంగా 18 నుండి 30 ఏళ్ల వయసు గల 40 మంది మహిళలను ఎంపిక చేశారు. వారితో ‘స్పీడ్ ఫ్రెండింగ్’ ప్రయోగాన్ని నిర్వహించారు. అంటే.. ఇందులో పాల్గొనేవారు చిన్నచిన్న మీటింగ్స్, డిస్కషన్స్ ద్వారా కొత్త స్నేహితులను సంపాదించుకుంటారు. వీరిలో చాలావరకు ముఖ పరిచయం లేనివారే! వారందరికీ ఒక సాధారణ కాటన్ టీ షర్టును అందించి.. రోజువారీ కార్యకలాపాల సందర్భంగా దాన్నే ధరించాలని చెప్పారు.
వారు నిత్యం ఎలాంటి పరిశుభ్రత పాటిస్తారో.. అలాగే ఉండాలనీ, సబ్బులు, సెంటుతోసహా అన్నీ సహజంగానే ఉండాలనీ సూచించారు. అయితే, వ్యక్తిగతంగా కలవడానికి ముందే.. సర్వేలో పాల్గొనేవారి ఫొటోలను ఒక్కొక్కరికీ కొన్ని సెకండ్లపాటు చూపించారు. వారు వేసుకోబోయే టీ షర్టులను వాసన చూపించారు. వారి గురించిన కొన్ని విషయాలను చెప్పి.. వారితో స్నేహితులుగా ఉండాలనుకుంటున్నారా? డేటింగ్ చేయాలనుకుంటున్నారా? భవిష్యత్తులో వారిని దూరంగా పెట్టాలని అనుకుంటున్నారా? అనే విషయాలను తెలుసుకున్నారు.
ఇందుకు సంబంధించిన ఫ్రెండ్షిప్ రేటింగ్ తీసుకున్నారు. రెండో దశలో భాగంగా.. ‘స్పీడ్ ఫ్రెండింగ్’ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఒక్కొక్కరూ ఎదుటివారితో నాలుగు నిమిషాలపాటు ముఖాముఖి సంభాషణల్లో పాల్గొన్నారు. ఈ ప్రత్యక్ష సంభాషణ తర్వాత కూడా వారు మళ్లీ అవే టీషర్టుల వాసన చూపించి.. రేటింగ్ తీసుకున్నారు. ఆశ్చర్యకరంగా మొదటి దశ ఫ్రెండ్షిప్ రేటింగ్‌కు.. వ్యక్తిగత సమావేశాల తర్వాత ఇచ్చిన రేటింగ్‌కు మధ్య బలమైన సంబంధం ఉన్నదని పరిశోధకులు కనుగొన్నారు.
మొదటి రౌండ్లో ఎదుటివారి పట్ల సానుకూల భావన ఏర్పడితే.. ముఖాముఖి తర్వాత వారిచ్చిన రేటింగ్ మరింత పెరిగిందని తేల్చారు. ఈ సందర్భంగా కార్నెల్ పరిశోధకులు మాట్లాడుతూ.. సువాసనలు వ్యక్తుల జ్ఞాపకాలతోపాటు మానసిక స్థితిని మెరుగుపరుస్తాయని వెల్లడించారు. కొన్ని పరిమళాలు మెదడులో సెరోటోనిన్, డోపమైన్, ఎండార్ఫిన్లను విడుదల చేస్తాయనీ, ఈ రసాయనాలు ఎదుటివారిలో ఆనందం, ప్రశాంత భావనలకు దారితీస్తాయని చెప్పారు. మరికొన్ని సువాసనలు ఆందోళన, నిరాశను తగ్గించడంలోనూ సహాయపడతాయట. ఇవే మార్పులు స్వచ్ఛమైన స్నేహంలోనూ కనిపిస్తాయని అంటున్నారు.