1910 ప్రాంతంలో మెదక్ పరిసరాల్లో తీవ్రమైన కరువు నెలకొంది. పంటల్లేక, పనుల్లేక ప్రజలు ఆకలి దప్పులతో అలమటించారు. ఆ దుస్థితిని గమనించిన క్రైస్తవ మతగురువు చార్లెస్ వాకర్ ఫాస్నెట్ చరిత్రలో నిలిచిపోయే పనికి నాందిపలికారు. కరువు పీడితుల ఆకలి తీర్చే లక్ష్యంతో చర్చి కట్టాలని నిర్ణయించుకున్నారు. అలా 1914లో మొదలైన చర్చి నిర్మాణం 1924 వరకు కొనసాగింది. అదే ఏడాది క్రిస్మస్ సందర్భంగా చర్చిలో తొలి ప్రార్థనలు జరిగాయి.
మెదక్ చర్చి ఎత్తు 175 అడుగులు. వెడల్పు 100 అడుగులు. రెండంతస్తుల్లో నిర్మించిన ఈ కట్టడం, శిఖరం వందేళ్లు దాటుతున్నా చెక్కు చెదరలేదు. నిర్మాణం పటిష్ఠంగా ఉండటానికి పురాతన భారతీయ నిర్మాణ పద్ధతులు పాటించారట. ఈ కట్టడం ఎంత అబ్బురంగా ఉంటుందో.. లోపల క్రీస్తు జీవితాన్ని వివరించే గాజు పలకల చిత్తరువులూ అంతే విశేషంగా అలరిస్తాయి. ఏసుక్రీస్తు పుట్టుక, శిలువ వేయడం ఇలా ప్రభువు జీవితంలోని ముఖ్యమైన ఘట్టాలను గాజు ముక్కలతో తీర్చిదిద్దిన తీరు అద్భుతం. బయటినుంచి సూర్యకాంతి ప్రసరించినప్పుడు ఈ గాజుకుడ్యాలు క్రీస్తు జీవితాన్ని ఆకర్షణీయంగా సాక్షాత్కరింపజేస్తాయి.
దశాబ్దం పాటు నిర్మాణం
చర్చి నిర్మాణం 1914లో మొదలైంది. 1924లో డిసెంబర్ 25న పూర్తయ్యింది. పదేళ్ల పాటు సుమారు 12 వేల మంది కూలీలు ఈ నిర్మాణంలో పాలు పంచుకుని ఉపాధి పొందారు. ఈ అద్భుత నిర్మాణానికి ఆ రోజుల్లో రూ.14 లక్షలు ఖర్చయ్యాయట. ఈ చర్చిలో అడుగడుగునా బైబిల్లో ప్రతిపాదించిన విషయాలు గోచరం అవుతాయి. చర్చికి ఐదు ద్వారాలు ఉన్నాయి. యూదా దేశ నాయకుడు రాసిన ఐదు కాండలకు (ఆది, నిర్గమ, లేవి, సంఖ్య, ద్వితీయోపదేశ) గుర్తుగా ఐదు ద్వారాలు కనిపిస్తాయి. చర్చి ప్రధాన ద్వారానికి కుడి, ఎడమల రెండేసి ద్వారాలు ఉంటాయి. తూర్పు ద్వారాల నుంచి పురుషులు, పడమటి ద్వారాల నుంచి స్త్రీలు లోనికి ప్రవేశిస్తారు. బైబిల్లోని 66 గ్రంథాలకు సూచికగా చర్చి లోపల 66 దిమ్మెలు ఏర్పాటుచేశారు. క్రీస్తు ప్రధాన శిష్యులు 12 మంది. వీరికి ప్రతీకగా చర్చిలో పన్నెండు మెట్లు నిర్మించారు. ఇలా క్రీస్తు జీవితానికి, బైబిల్‌కు ముడిపడి ఉండేలా దీనిని కట్టించారు.
వెయ్యి ఎకరాలు..
ఈ చర్చి నిర్మాణం కోసం ఆరో నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్ 1910లో సుమారు వెయ్యి ఎకరాల భూమిని కేటాయించారట. మొదట్లో చర్చి టవర్ 180 అడుగుల ఎత్తుతో నిర్మించాలని భావించారట. అయితే, చార్మినార్ ఎత్తు కన్నా ఎక్కువ ఉండరాదని నాటి పాలకుడు ఆదేశించడంతో 175 అడుగులకు పరిమితం చేశారు. చర్చి ప్రధాన హాలులో ఏకకాలంలో సుమారు ఐదువేల మంది ప్రార్థనలు చేసుకునే వీలుంది. మందిరంలో నాణ్యమైన కలపతో తీర్చిదిద్దిన ఫర్నిచర్ నేటికీ చెక్కు చెదరలేదు. శాంతి, ప్రేమకు చిరునామాగా అలరారుతున్న క్రీస్తు మందిరం క్రిస్మస్, గుడ్ ఫ్రైడే లాంటి పండుగలప్పుడు విద్యుత్ దీపాల వెలుగుల్లో మెరిసిపోతుంటుంది. కరుణామయుడి మందిరాన్ని చూసేందుకు మతాలకు అతీతంగా పర్యాటకులు మెదక్ పట్టణానికి తరలివస్తారు. ప్రభువు సన్నిధిలో ప్రశాంతంగా గడిపి సంతోషంగా తిరుగు ప్రయాణమవుతారు.
-సీహెచ్ అశోక్, మెదక్