హీరో పక్కన దోస్తు ఉండటం సినిమాల్లో రివాజు. విలన్ల పక్కన గ్యాంగ్ ఉండటం మామూలే! కానీ, విలన్‌కు ఓ ఫ్రెండ్ లాంటివాడు ఉండేవాడు. ఈ ఇద్దరి జోడీ సినిమాను కదం తొక్కించేది. కమెడియన్ జోడీ సంగతి సరేసరి. రేలంగి జమానా నుంచి నిన్నమొన్నటి వరకు ఆ సూత్రాన్ని పాటించారు సినీదర్శకులు. ఒక్కసారి ప్లాష్‌బ్యాక్‌లోకి వెళ్తే ఈ హిట్ కాంబోలు ఎంత సందడి చేశాయో, ఎన్ని సినిమాల్ని ఆడించాయో తెలుస్తుంది. కానీ, కొన్నాళ్లుగా ఈ కాంబో దాదాపు తెరమరుగైంది. హీరోహీరోయిన్ల హిట్‌పెయిర్ కన్నా.. ఎక్కువ ఆదరణ ఆ జోడీకి ఉండేది. కమర్షియల్ చట్రంలో ఇరుక్కున్న తెలుగు సినిమా.. ఒకప్పుడు కలెక్షన్లు కొల్లగొట్టిన హిట్ కాంబినేషన్‌కు దాదాపు స్వస్తి పలికింది.
రేలంగి, రమణారెడ్డి! తొలితరంలో కామెడీ కాంబినేషన్‌కు శ్రీకారం చుట్టింది వీళ్లే! రమణయ్య కన్నింగ్ మామగా, రేలంగి ఫన్నింగ్ అల్లుడిగా ఎన్ని సినిమాలు చేయలేదు. ‘అప్పు చేసి పప్పు కూడు’, ‘లక్షాధికారి’, ‘గుడిగంటలు’ ఒకటా రెండా డజన్ల కొద్దీ సినిమాల్లో నవ్వులు పంచారు. వీరిద్దరి కాంబినేషన్లో పాటలు కూడా వచ్చాయంటే.. ఎంత హిట్ పెయిరో అర్థం చేసుకోవచ్చు. ‘ఇల్లరికం’ సినిమాలో ‘భలే చాన్సులే.. లక్కీ చాన్సులే..’ పాట పాడుతూ ఇల్లరికంలో ఉన్న మజాను ఎంజాయ్ చేస్తుంటాడు రేలంగి. చివర్లో ఎంట్రీ ఇస్తాడు రమణారెడ్డి మామయ్య. ఇంకేముంది, నవ్వుల జల్లు! ‘రాముడు భీముడు’లో ‘తగునా ఇది మామ’ పాటలో రమణారెడ్డిది పైచేయి అవుతుంది. వీరిద్దరూ పేచీ పడినా, అందులో పైచేయి ఎవరు సాధించినా.. సినిమాకు మాత్రం ప్లస్సే అయ్యేది. అప్పట్లో డిస్ట్రిబ్యూటర్లు… రేలంగోడు, రమణయ్య కాంబినేషన్ ఉంటేనే సినిమాకు ఫైనాన్స్ చేస్తామనేవాళ్లంటే.. ఈ కాంబో ఏ రేంజ్ హిట్టో అర్థం చేసుకోవచ్చు. రేలంగికి మరో జతగాడు పద్మనాభం. వీళ్లద్దరూ తండ్రీకొడుకులుగా చాలా సినిమాల్లో కనిపించారు. ఈ ఇద్దరికీ ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.
నాగభూషణం పక్కా విలన్. సెటైర్లు వేస్తూ హీరో గాలి తీసేసే బాపతు విలనిజం పండించేవాడు. ఆయన సరసన అల్లు రామలింగయ్య ఉండేవాడు. నాగభూషణం జమీందార్ అయితే.. అల్లు దివాన్‌గా అల్లుకుపోయేవాడు. ఆయన షావుకారు అయితే.. ఈయన చిట్టాపద్దులు రాసుకునే గుమాస్తాగా ఇరగదీసేవాడు. ఇలా వీరిద్దరి హవా చాలా సినిమాల్లోనే నడిచింది. నాగభూషణానికి మరో కొరుకుడుపడని జోడి రాజబాబు. వీరిద్దరూ తండ్రీకొడుకులుగా పదికిపైగా సినిమాల్లో కనిపించారు. నాగభూషణం దుందుడుకుతనానికి రాజబాబు కామెడీగా కళ్లెం వేయడం నవ్వుల పువ్వులు పూయించేది.
విలనిజానికి కేరాఫ్‌గా నిలిచిన రావు గోపాలరావులో కామెడీ టైమింగ్ కూడా అదే స్థాయిలో ఉండేది. అందుకు కారణం ఆయన పక్కన అల్లు రామలింగయ్య చేరడమే. వీరిద్దరూ కలిసి డజన్ల కొద్దీ సినిమాలో పెయిర్‌గా కనిపించారు, నవ్వించారు. రావు గోపాలరావు బావ పాత్ర పోషిస్తే.. బావమరిదిగా అల్లు ఉండేవాడు. ఇన్స్పెక్టర్గా ఆయనుంటే ఈయన కానిస్టేబుల్‌గా కనిపించేవాడు. కన్నింగ్ బిజినెస్ పార్ట్‌నర్స్‌గా మనల్ని నవ్విస్తూనే హీరోను అష్టకష్టాలు పెట్టేవారు. వీరిద్దరూ ఉంటే సినిమా హిట్టే అన్నంతగా పేరుపొందారు. ‘ముందడుగు’, ‘గ్యాంగ్‌లీడర్’, ‘రాజా విక్రమార్క’, ‘అత్తకు యముడు అమ్మాయికి మొగుడు’ ఇలా ఎన్నో చిత్రాల్లో వీళ్లిద్దరూ తెరమీద కనిపించగానే.. కథ మలుపు తిరిగేది, ప్రేక్షకులకు కొత్త ఉత్సాహం వచ్చేది. డేట్లు కుదరక.. వీళ్లిద్దరి కాంబినేషన్ కుదరకపోతే… ఒకరి సినిమాలో మరొకరు అతిథి పాత్రలు వేసిన సందర్భాలూ ఉన్నాయి. ‘కల్పన’ సినిమాలో రావు గోపాలరావు ప్రధాన తారగణం లిస్ట్‌లో లేడు. అందులో అల్లు రామలింగయ్య ఓ బృహత్ నవల రాయడానికి పూనుకుంటాడు. ఆయన ఒక్కో పాత్ర పరిచయం చేసే కొద్దీ.. అవి అలా కండ్లముందుకు వచ్చేస్తుంటాయి. పైగా ప్రధాన పాత్రకు రావు గోపాలరావు ప్రత్యక్షమవుతూ ఉంటాడు. అల్లును గిల్లుతూ తన పాత్రను అలా కాదు, ఇలా మార్చమని వేధిస్తూ ఉంటాడు. కామెడీగా అనిపించినా.. వీరిద్దరి కాంబోలో మేజిక్ కోసం దర్శకుడు ఈ సీక్వెన్స్ సృష్టించాడన్నమాట.
హాస్యానికి సిసలైన నిర్వచనం ఇచ్చిన దర్శకుడు జంధ్యాల. ఆయన అద్భుతమైన జోడీని తెలుగు తెరకు పరిచయం చేశాడు. వాళ్లే సుత్తి వీరభద్రరావు, సుత్తి వేలు. ఆయన దర్శకత్వంలోనే కాదు.. ఎన్నో సినిమాల్లో వీరిద్దరూ చేరి కడుపుబ్బా నవ్వించారు. ‘ఆనందభైరవి’ సినిమాలో ఇద్దరి కాంబినేషన్ సీన్లు తలుచుకుంటే చాలు నవ్వొస్తుంది. ప్రాసలతో ప్రశ్నించే తండ్రిగా వీరభద్రరావు, కోడలేదంటే గోడలకేసి, నీడలకేసి చూసే ఊడల జుట్టున్న కొడుకుగా వేలు నటన ఎంజాయ్ చేయడానికి ఎన్ని వేలు పోసినా తక్కువే! ‘పుత్తడి బొమ్మ’లో మేక (మేధాకవి)గా వీరభద్రరావు, ఆయన మేధోమథనానికి తూలిపోయే తాగుబోతుగా వేలు పండించిన హాస్యం అద్భుతం. ‘నాలుగు స్తంభాలాట’ సినిమాకు వీరిద్దరి కామెడీ మూలస్తంభం అంటే అతిశయోక్తి కాదు! మొత్తంగా సుత్తి ధ్వయాన్ని ఎంత స్తుతించినా తక్కువే!!
కాంబినేషన్ సినిమాను ఎంత హిట్ చేస్తుందో చెప్పిన జోడి కోట శ్రీనివాసరావు, బాబు మోహన్. ఏ సీన్లో కలిశారో కానీ, సిల్వర్‌స్క్రీన్‌పై బంగారు కాసులు వర్షించాయి. వీళ్లిద్దరూ డైరెక్ట్ కాంబినేషన్‌గా చేసిన సినిమాలు యాభైకి పైగానే ఉంటాయి. ‘బొబ్బిలిరాజా’ సినిమాతో మొదలైన ఈ కాంబో ఓ పదిహేనేండ్లపాటూ అదే ఇదిగా కొనసాగింది. ‘మామగారు’ సినిమాలో ఇంట్లోవాళ్లు పట్టించుకోని వ్యక్తిగా కోట, బిచ్చగాడిగా బాబు మోహన్ ఆల్‌టైమ్ హిట్ కామెడీని పండిచారు. ‘బావా బావమరిది’, ‘నంబర్ వన్’, ‘చిన్నరాయుడు’, ‘మాయలోడు’, ‘బిగ్ బాస్’ ఇలా ఎన్నెన్నో సినిమాలు సూపర్ హిట్ సాధించాయి. వీళ్లిద్దరి డేట్స్ కోసం హీరోల కాల్ షీట్స్ కూడా అడ్జెస్ట్ చేసుకున్న సందర్భాలు ఉన్నాయంటే ఈ జోడీకి ఎంత క్రేజ్ ఉండేదో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి హిట్ కాంబో మళ్లీ వెండితెర మీద చూడటం సాధ్యం కాదేమో!!
ఇవన్నీ చెప్పొచ్చేది ఎందుకంటే.. సినిమా ఫార్ములా మారింది. కాస్టింగ్‌లో బలమైన జోడీ లేకుండా పోతున్నది. హీరోల పక్కన కొందరు కమెడియన్లు నవ్వు తెప్పిస్తున్నా.. ప్రేక్షకుల మనసులో ముద్రకు నోచుకోవడం లేదు. ఈ విషయంలో బ్రహ్మానందం వెరీ స్పెషల్ అనిపించుకున్నాడు. ఓ రెండు దశాబ్దాలపాటు హీరో పక్కనే కామెడీగా సెటిలయ్యాడు. రెండు తరాల హీరోలతో జట్టుకట్టి తనను అందరికీ సరైన జోడి అనిపించుకున్నాడు. వేణుమాధవ్ కూడా దాదాపు అందరి హీరోలతో కామెడీ షేర్ చేసుకున్నాడు. కానీ, ఇప్పుడు హీరో టైమింగ్‌కు స్పందించే జోడీ కనిపించడం లేదు. విలన్ విలక్షణ డైలాగ్‌లకు వంతపాడేవాడు చెంతన లేడు. వెరసి.. వెండితెరపై నవ్వించే, కవ్వించే, వెంటాడే జోడి మిస్సైపోయింది.