వెండితెర మీద సినిమా రావాలంటే 24 క్రాఫ్ట్స్ పనిచేయాలి. కథ బాగా పండాలంటే తారాగణం అంతా తమ తమ పాత్రలు చక్కగా పోషించాలి. దాన్ని చిత్రంగా మలిచి మనకు చూపించే కెమెరా కన్ను సినిమాటోగ్రాఫర్‌దే. కథానాయికగానో, ఇతర పాత్రల్లోనో తప్ప, ఛాయా గ్రాహకులుగా పనిచేసే ఆడవాళ్లను మనం చూడటం అరుదు. అలాంటి రంగంలో అడుగు పెట్టి, సృజనాత్మకత ఉంటే చాలు మహిళలూ ఛాయాగ్రాహకులుగా దూసుకుపోవచ్చని నిరూపిస్తున్నది ఒడిశాకి చెందిన ఫల్గు సత్పతి.
‘మహిళలు అరుదుగా ఉండే సినిమాటోగ్రఫీలాంటి విభాగాల్లో పనిచేయాలంటే ముందు రెండు రకాల సవాళ్లను అధిగమించాల్సి ఉంటుంది. ఒకటి అంతర్గతమైనది. మరోటి బయటి విషయాలకు సంబంధించింది. ఒక అమ్మాయిగా మనం ఎలాంటి రంగాన్ని ఎంపిక చేసుకుంటున్నాం అన్నది మానసికమైన సవాలు. సినిమాల్లాంటి రంగాల్లో, పూర్తి టెక్నాలజీ మీద ఆధారపడి పనిచేసే చోట మహిళలకు సమాజం ఎంత ప్రాధాన్యం ఇస్తుంది, అసలు వీటిలోకి వెళ్లడానికి కుటుంబం ఎంతవరకూ దన్నుగా ఉంటుంది, శారీరకంగా ఎంత కష్టపడగలం లాంటివి అంతర్గత విషయాలు.
ఈ రెండిటినీ ధైర్యంగా ఎదుర్కోగలిగితేనే ఎవరైనా తమతమ రంగాల్లో ఉన్నతిని సాధించగలరు’ అని చెబుతుంటుంది ఫల్గు. ఒడిశా రాష్ట్రంలో ఆమె పేరెన్నికగన్న సినిమాటోగ్రాఫర్. దశాబ్దకాలంగా ఆమె ఈ రంగంలో ఉంది. ఒడియాలో మంచి హిట్ సాధించిన పుష్కర సినిమాకు ఆమే సినిమాటోగ్రాఫర్. ఈ మహిళా దినోత్సవానికి విడుదల కానున్న ‘పడే ఆకాశ’ సినిమాకు కూడా ఫల్గు ఛాయాగ్రాహకురాలిగా పనిచేసింది. ఆమె ఛాయాగ్రహణం వహించిన మరో రెండు సినిమాలు కూడా విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.
ఫల్గు ఒడిస్సీ నృత్యకారిణి. ఐదేండ్ల వయసు నుంచే ఆమె నాట్యం నేర్చుకుంది. ఇప్పటికీ కొనసాగిస్తున్నది. లెక్కకు మిక్కిలి స్టేజ్ షోలూ ఇచ్చింది. అయితే అంత చిన్న వయసునుంచే ఫల్గుకి నాటకాల మీద కూడా ఆసక్తి ఉండేది. వాటిలో నటించడం అన్నది ఆమెకు ఎంతో సరదాగా ఉండేది. ఒకసారి అలా దూరదర్శన్‌లో నటించింది. అందులో అక్కడి ప్రముఖ కళాకారులు విజయ్ మహంతి, తండ్రా రాయ్ లాంటి వాళ్లతో కలిసి కనిపించింది.
అయితే అదే సమయంలో తనకొక విషయం అర్థం అయింది. అసలు నాటకం, సినిమా అంటే ఇలా తెర మీద కనిపించే వాళ్లే కాదు, తెర వెనుక కూడా ఎంతోమంది పనిచేస్తుంటారు అని బోధపడింది. అది చిన్న వయసులో ఉన్న ఫల్గుకి ఎంతో ఆసక్తి కలిగించే విషయంగా మారింది. దీంతో వారి గురించి ఆలోచించడం, తెలుసుకోవడం ప్రారంభించింది. ఇక, ఫల్గు వాళ్ల నానమ్మకు సినిమాలంటే బాగా ఇష్టం కావడంతో ఆమెతో కలిసి తరచూ సినిమాలకు వెళ్తూ ఉండేది. ఒక్క ఒడియా సినిమాలే కాదు ఏదీ లేకపోతే ఇద్దరూ కలిసి హిందీ సినిమాలూ చూసేవారట. టీవీలోనూ వచ్చిన ప్రతి సినిమానూ విమర్శనాత్మకంగా చూసేది ఫల్గు.
ఇంటర్మీడియెట్ పూర్తయ్యే సమయానికి ఫల్గు వాళ్ల ఇంటి పక్కన ఉండే ఒక అబ్బాయి సినిమాలకు సంబంధించిన చదువులో చేరాడు. బిజూ పట్నాయక్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఒడిశా (బీపీఎఫ్టీఐఓ)లో అతను చదువుతున్నాడు. దీని గురించి ఫల్గుకి తెలియగానే తానూ అందులో చేరాలని భావించింది. అందులోనూ, తన మెదడులో ఆలోచనకు అనుగుణంగా సినిమాను అందంగా అర్థవంతంగా తెరకెక్కించే డైరెక్షన్ విభాగం ఆమెను మరింత ఆకర్షించేది.
అందుకే తానూ డైరెక్టర్ అవ్వాలని అనుకునేది. ఈ క్రమంలో బీపీఎఫ్టీఐఓకు దరఖాస్తు చేసుకునేందుకు వెళ్లింది. అయితే అక్కడ దర్శకత్వ విభాగానికి సంబంధించిన చదువు లేదు. ఇక, తనకు ఇష్టమైన తరువాతి అంశం సినిమాటోగ్రఫీ. అంటే దర్శకుడు అనుకున్న కథకు కెమెరా ద్వారా దర్శకత్వం చేసే పని అన్నమాట. అదే డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీ (డీఓపీ). అలా ఈ విభాగంలో పట్టా పుచ్చుకొని, కాలేజీలో తన సీనియర్ దగ్గర తొలుత ఒక రియాలిటీ షోకి పనిచేసింది. తర్వాత సుశాంత్ మణి, శుభ్రాంశు దాస్‌లాంటి పేరెన్నికగన్న ఛాయాగ్రాహకులతో కలిసి ఛాయాగ్రహణం చేసింది.
శిక్షా మండల్, ఫౌజీ కాలింగ్, దివానా దివానీ, హలో ఇన్ లవ్, లవ్ యూ జెస్సికా తదితర పదుల సంఖ్యలో చిత్రాలు, వెబ్ సిరీస్‌లకు సహాయ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేసింది. కెరీర్‌కు సంబంధించి ‘మనం ఏ సినిమాకు పనిచేస్తున్నాం అన్నది ఎంత ముఖ్యమో, ఎవరితో కలిసి పనిచేస్తున్నాం అన్నదీ అంతే ముఖ్యం. కష్ట సమయం వచ్చినప్పుడు మనతోటి వారు మనలో ఉత్సాహాన్నీ, ధైర్యాన్నీ నింపేలా ఉండాలి’… అని చెబుతుందామె. ఇక, ఆమె సహాయ దర్శకురాలిగా కలిసి పనిచేసిన సుశాంత్ మణినే ‘పడే ఆకాశ’ చిత్రానికి దర్శకుడు. దివ్యాంగుల హక్కుల కోసం వీల్ చైర్ నుంచే అలుపెరుగని పోరాటం చేస్తున్న ఒడియా మహిళ డా॥శ్రుతి మహాపాత్ర జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ఈ మహిళా దినోత్సవానికి విడుదల కానుంది.