చలికాలంలో ప్రతి ఇంట్లోనూ మాయిశ్చరైజర్ కనిపిస్తుంది. అయితే, ఒక్కదాన్నే ఇంటిల్లిపాదీ వాడుతుంటారు. కానీ, చర్మ తత్వాన్ని బట్టి.. మాయిశ్చరైజర్ వాడాలని నిపుణులు చెబుతున్నారు. లేకుంటే, లాభం కంటే నష్టమే ఎక్కువని అంటున్నారు. పొడి చర్మం: తగినంత తేమ లేకపోవడం వల్ల.. కొందరి చర్మం పొడిగా మారిపోతుంది. చలికాలంలో పొలుసులుగా మారడం, దురద, గరుకు వంటి సమస్యలు కనిపిస్తాయి.
ఇలాంటి వారు నూనె ఆధారిత మాయిశ్చరైజర్లు, క్రీములు ఎంపిక చేసుకోవాలి. హైలురోనిక్ యాసిడ్, గ్లిజరిన్ వంటివి తేమను ఆకర్షిస్తాయి. సెరామైడ్లు చర్మాన్ని బలోపేతం చేయడానికి సాయపడతాయి. స్నానం చేసిన వెంటనే.. చర్మం తడిగా ఉన్నప్పుడే మాయిశ్చరైజర్ రాయాలి. అప్పుడే చర్మంలో తేమను ఎక్కువసేపు నిలిపి ఉంచుతుంది. ఇక ఉదయం-రాత్రి రోజుకు రెండుసార్లు ముఖాన్ని శుభ్రం చేసుకొని, మాయిశ్చరైజర్ రాసుకోవాలి.
జిడ్డు చర్మం: కొందరి శరీరంలో సెబమ్ (నూనె) ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. దాంతో, వారి చర్మం జిడ్డుగా మారిపోతుంది. జన్యువులు, హార్మోన్లలో మార్పులు, ఒత్తిడి లాంటి అనేక కారణాలతో ఈ సమస్య వస్తుంది. మొటిమలు, మచ్చలు వంటి సమస్యలకూ దారితీస్తుంది. ఇలాంటి వారు సున్నితమైన, నూనె తొలగించే క్లెన్సర్లను వాడాలి. జిడ్డును నివారించడానికి పుష్కలంగా నీళ్లు తాగాలి. ఆహార నియమాలను పాటించడంతోపాటు ప్రతిరోజూ రెండుసార్లు ముఖం కడుక్కోవాలి. నూనె లేని, తేలికైన మాయిశ్చరైజర్లను ఎంపిక చేసుకోవాలి.