ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్, డబ్ల్యూహెచ్‌వో, ఐసీఎంఆర్, యూనిసెఫ్, ఎన్ఐఎన్ కలిసి పిల్లలు ‘జంక్ ఫుడ్, స్వీట్ అండ్ బేవరేజెస్, చక్కెర కలిపిన ఆహారం’ (JUNCS) వల్ల పిల్లలు ఎదుర్కొనే సమస్యలతోపాటు తీసుకోవాల్సిన పరిమితులకు మార్గదర్శకాలు జారీ చేసింది. అన్ని వయసుల పిల్లలు జంక్స్ అండ్ బేవరేజ్ ఆహారం తినకూడదు. కానీ, ఈ రోజుల్లో అన్ని రకాల ఆహారం అన్నిచోట్లా అందుబాటులో ఉంటున్నది. కాబట్టి వాటి నుంచి తప్పించుకోవడమూ కష్టమే. ఇలాంటి జంక్స్ కేటగిరి ఫుడ్ వారానికి ఒకసారి కంటే ఎక్కువసార్లు పిల్లలు తినకూడదు.
తిన్నప్పుడు రోజూ తినే ఆహారం యాభై శాతానికి మించకూడదు. స్వీట్ అండ్ బేవరేజెస్, ఫ్రూట్ జ్యూస్‌లు రెండేళ్లలోపు పిల్లలకు తాగించకూడదు. తాగితే దంత సమస్యలు వస్తాయి. రెండు నుంచి ఐదేండ్ల లోపు వయసున్న పిల్లలు రోజుకు 120 మిల్లీ లీటర్లు మించి తాగకూడదు. అయిదు సంవత్సరాలు పైబడిన పిల్లలు 150 మిల్లీ లీటర్లు మించి తాగకూడదు. వీటి కంటే పండ్లతో తయారు చేసిన జ్యూస్ చాలా మంచిది. టీ, కాఫీ, ఎనర్జీ డ్రింక్స్ అయిదేళ్లలోపు పిల్లలను తాగనివ్వకూడదు.
అయిదు నుంచి తొమ్మిదేళ్ల లోపు పిల్లలు రోజుకు 100 మిల్లీ లీటర్లు తాగొచ్చు. 10 నుంచి 18 ఏళ్ల వయసు పిల్లలు రోజుకు 200 మిల్లీలీటర్లు మించి తాగితే చాలా ప్రమాదం. జంక్స్ క్యాటగిరి ఫుడ్ తింటే.. ఇన్సులిన్ రెసిస్టెంట్ వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి ఊబకాయం వస్తుంది. బాల్యంలోనే హైపర్ టెన్షన్ బారినపడతారు. నిద్రలేమి సమస్యలు ఉత్పన్నం అవుతాయి. కెఫిన్ ఉన్న పానీయాలు ఎక్కువగా తాగితే మానసిక సమస్యలు రావొచ్చు. దంత సమస్యలు తలెత్తుతాయి.
కెఫిన్ ఎక్కువ మోతాదులో ఉన్న పానీయాలు తాగితే… గుండె సమస్యలు వస్తాయి. జంక్స్ కేటగిరి ఆహార ప్రకటనలు టీవీల్లో వస్తున్నప్పుడు పిల్లలు చూడకుండా జాగ్రత్తపడాలి. ఆహారంలో ట్రాన్స్‌ఫ్యాట్ లేకుండా జాగ్రత్తపడాలి. శరీరానికి అందే మొత్తం శక్తిలో చక్కెర నుంచి అందే ఎనర్జీ అయిదు శాతానికి మించకూడదు. యాడెడ్ షుగర్ ఆహారం చాలా తక్కువగా తీసుకోవాలి. బయట అమ్మే స్నాక్స్‌కి బదులు ఇంట్లో తయారు చేసిన పిండి వంటల్లో ఉప్పు, పంచదార చాలా తక్కువ పరిమాణంలో ఉంటుంది. కాబట్టి పిల్లలకు ఇంట్లో తయారుచేసిన స్నాక్స్ ఇవ్వడమే మంచిది.