బాల్యం అందరికీ అందమైనదేం కాదు. కొందరిని బాధ పెడుతుంది.కొందరిని భయపెడుతుంది కూడా! ఆ కోవలో ముందుండే వారు బాల్యవివాహాల బారినపడే చిన్నారి పెళ్లికూతుళ్లు. ఎంత నవయుగంలోకి అడుగు పెడుతున్నా భారతదేశంలోని అనేక మారుమూల ప్రాంతాల్లో నేటికీ ఇవి జరుగుతూనే ఉన్నాయి. అలాంటి బాల్యవివాహాలను ఆపడమే కాదు, కోర్టు ద్వారా వాటిని రద్దు చేయించి ఆడపిల్లల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు రాజస్థాన్‌కి చెందిన డాక్టర్ కృతి భారతి. సారథి ట్రస్ట్ ద్వారా ఆమె చేస్తున్న సేవలకు సీబీఎస్ఈ తన సిలబస్‌లో చోటిచ్చింది. అయితే ప్రాణాలకు తెగించి చేసే సాహసమే అని ఆమె ప్రయాణం చెబుతుంది.
కష్టాలు అందరికీ ఉంటాయి. కానీ, వాటిని అధిగమించి వేరొకరి కష్టాన్ని తీర్చే ప్రయత్నం మాత్రం కొందరే చేస్తారు. అలాంటి వారిలో ఒకరే ఈ కృతి భారతి. ఒకరకంగా ఆమె బాల్యం కష్టాల కొలిమిలో కాలింది. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ ఆమెది. తను కడుపులో ఉన్నప్పుడే తల్లిని తండ్రి వదిలేశాడు. బంధువులు అబార్షన్ చేయించుకోమన్నా… సొంతంగా బిడ్డని పెంచుకుంటానందామె. మిగతా కుటుంబ సభ్యులు ఆమెను అరిష్టంగా భావించారు. వాళ్ల ఈసడింపులు, అవమానాలు భరిస్తూనే కృతి పదేళ్ల వయసుకు వచ్చింది. అయినా సరే చెడును తెచ్చిపెట్టే ఆ పిల్ల బతికి ఉండకూడదని భావించి విషప్రయోగం చేశారు వాళ్లు. దాంతో పక్షవాతం బారిన పడింది. రెండేండ్లు మంచానికే పరిమితం అయింది. అప్పుడే సమాజంలో బాలికల మీద వివక్ష ఏ స్థాయిలో ఉంటుందో అనుభవ పూర్వకంగా అర్థం చేసుకుంది. కానీ, పట్టుదల ఆమెను ఓడిపోనివ్వలేదు. రేకీ థెరపీ ద్వారా నెమ్మదిగా తిరిగి కోలుకుంది. మనుషుల మనస్తత్వాలు ఇలా ఎందుకుంటాయి, వాటినెలా మార్చాలో అర్థం చేసుకునేలా తన చదువులో సైకాలజీని ఎంచుకొని అందులో పీహెచ్డీ చేసింది. తన జీవితాన్ని సమాజంలోని అణగారిన పిల్లల కోసం అంకితం చేసింది.
దేశంలోనే తొలి రికార్డు
చదువుకుంటూనే స్వచ్ఛంద సంస్థల్లో పనిచేసింది కృతి. అప్పుడే హింసకు గురైన పిల్లలను, ముఖ్యంగా ఆడపిల్లలను దగ్గరగా చూసింది. బాల్య వివాహాల పట్ల కేవలం అవగాహన కల్పించడం సరిపోదని ఆమె గ్రహించింది. అందుకే, 2011లో సారథి ట్రస్ట్‌ను స్థాపించి, బాల్య వివాహాలను అరికట్టడంతోపాటు బాధిత పిల్లలకు చట్టపరమైన రక్షణ, విద్య, పునరావాసం, ఉపాధి అవకాశాలు కల్పించే సమగ్ర కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ ప్రయాణంలో తొలి అడుగే ఆమెకు పెద్ద సవాలుగా మారింది. దాన్ని సమర్థంగా ఎదుర్కొని దేశంలోని తొట్ట తొలిసారిగా బాల్యవివాహాన్ని రద్దు చేయించిన ఘనతను సాధించింది. ఆమె సంస్థ స్థాపించిన తొలినాళ్లలో అంటే, 2012లో లక్ష్మీ సర్గారా అనే యువతి ఒక సమస్యతో వచ్చింది. తనకు ఏడాది వయసున్నప్పుడు మూడేండ్ల అబ్బాయితో పెండ్లి జరిపించారనీ, ఆ విషయం 18 సంవత్సరాలు నిండాక అబ్బాయి ఇంటి వాళ్లు వచ్చి తీసుకెళతామని చెప్పే దాకా తెలియదనీ, ఈ వివాహాన్ని కోర్టులో సవాలు చేయాలనీ ఆమె అభ్యర్థన. నిజానికి చట్ట పరంగా ఇది చెల్లదు. అయినప్పటికీ దాన్ని రద్దు చేయించాల్సిందే. అప్పుడే ఆమెకు స్వేచ్ఛ. అందులోనూ అప్పటికి దేశంలో ఒక్క బాల్య వివాహమూ కోర్టు ద్వారా రద్దు కాలేదు. ఎటు వెళ్లాలో తెలియని చీకట్లో రకరకాల అప్పీళ్ల ద్వారా ఆమె న్యాయాన్ని అందుకుంది. ఒక బాల్య వివాహాన్ని మొట్టమొదటిసారి కోర్టులో రద్దు చేయించడం ద్వారా కృతి భారతి భారత చరిత్రలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది.
మరణానికి భయపడకుండా..
లక్ష్మీ సర్గారా తీర్పు తర్వాత వరుసగా అనేక కేసుల్లో కోర్టును ఆశ్రయించి, బాల్య వివాహాలను చట్టబద్ధంగా రద్దు చేయించింది. ఇప్పటివరకు ఆమె బృందం 50కి పైగా బాల్య వివాహాలను రద్దు చేయగా, 2100కుపైగా పెండ్లిండ్లను జరగకుండా అడ్డుకుంది. ఇలా బయట పడ్డ బాలికలకు తర్వాత బతకడం ఎలా అనే ప్రశ్న ఎదురయ్యేది. అందుకే, బాల్య వివాహం రద్దు చేయించడం ఒకటే పరిషారం కాదని కృతి భావించింది. కుటుంబాలు తిరసరించిన బాలికలకు ఆశ్రయం కల్పించడం, వారి చదువు కొనసాగేలా చూడటం, నైపుణ్య శిక్షణ ఇవ్వడం, ఉద్యోగాలు కల్పించడం, మానసిక కౌన్సెలింగ్ అందించడం వంటి పునరావాస కార్యక్రమాలను కూడా సారథి ట్రస్ట్ ద్వారా నిర్వహించడం మొదలుపెట్టింది. 30,000 మందికి పైగా మహిళలతో పాటు, వేలాది మంది పిల్లలు ఆమె సేవలతో కొత్త జీవితం ప్రారంభించారు. అయితే బాల్య వివాహాలను అడ్డుకోవడం అంత సులభం కాదు. సంప్రదాయాలను సమర్థించే వ్యక్తుల నుంచి కృతి భారతి ఎన్నోసార్లు చంపేస్తామనే బెదిరింపులు, అత్యాచార హెచ్చరికలు ఎదురొన్నారు.
గ్రామాల్లో ఆమెపై దాడి చేసే ప్రయత్నాలూ జరిగాయి.
‘ఇప్పటి వరకూ కనీసం 50 సార్లు చంపేస్తామంటూ హెచ్చరికలు వచ్చాయి. కానీ నేను మరణానికి భయపడను. చిన్నప్పుడే దాన్ని దగ్గరి నుంచి చూశాను. అమాయకమైన ఆడపిల్ల జీవితాన్ని కాపాడటంకంటే నా ప్రాణమేం ఎక్కువ అనిపించదు. నేను బతికున్నన్ని రోజులూ నా కార్యక్రమాలు కొనసాగిస్తా’ అంటూ చెబుతుంది కృతి. అసలు తన మీద హత్యాయత్నం చేసిన ఆ కుటుంబం ఇంటి పేరును ఉంచుకోవడం ఇష్టం లేక దేశం పేరునే తన ఇంటి పేరుగా మార్చుకుని కృతి భారతి అని పెట్టుకుంది.
ఆమె స్ఫూర్తిదాయక ప్రయాణాన్ని 2022లో సీబీఎస్ఈ సిలబస్‌లో పిల్లలకు పాఠంగా చేర్చారు. ప్రఖ్యాత అమెరికన్ చాకొలెట్ సంస్థ హర్షీస్ ఒక ఏడాది ఆమె కోసమే ఒక ప్రత్యేక ఎడిషన్‌ను తీసుకొచ్చింది. జీన్స్ దుస్తులకు పేరెన్నికగన్న లెవిస్ సంస్థ కూడా తన ప్రభావవంతమైన మహిళల జాబితాలో ఆమెను చేర్చి సత్కరించింది. ప్రఖ్యాత జెనెవా గ్లోబల్ యూత్ హ్యూమన్ రైట్స్ అవార్డు కూడా ఆమె సేవలకు దక్కింది. ఇవేకాక మరెన్నో అవార్డులు, రివార్డులు సొంతం చేసుకున్న ఆమె వీటికన్నా ఒక చిన్నారి పెళ్లి కూతుర్ని అర్ధరాత్రి వెళ్లి కాపాడినప్పుడే ఆనందం ఎక్కువని చెబుతుంది. వీళ్లందరికీ ఆమె నిజంగా హీరో కదూ!