మనిషి ఆరోగ్యంగా ఉన్నప్పుడు చేసే దాన ధర్మాలే నిజమైనవి. మంచి పనులు చేయాలని భావించి దానికి కట్టుబడి ఉండాలి. తన శక్తి మేరకు దైవ మార్గంలో ధనాన్ని ఖర్చు పెట్టాలి, దానాలు చేయాలి. మంచి పనులు చేస్తూ చనిపోతే తగినంత పుణ్యఫలం వస్తుంది. అయితే జీవితమంతా మంచిపనులు, దానాలు చేయకుండా కేవలం ముసలితనంలో, మరణ దశలో చేయడం సత్ఫలితాలను ఇవ్వవు. అల్లాహ్ను విశ్వసించి, ఆయన మార్గంలో పోరాడటం, దానం చేయడం ఉత్తమమైన సత్కార్యం.
పని రాని వాళ్లకు పనిచేసి పెట్టడం, పనిచేసే వాళ్లకు సాయపడటం కూడా పుణ్య ఫలితాన్ని కలిగించేవే. ప్రతి తస్బీహ్ పలుకు ఒక సత్కార్యమే. అల్లాహ్ను కీర్తించడం, మంచిని ఆదేశించడం కూడా మంచిపనులే. సాటివారిని నవ్వుతూ పలకరించే మంచి నడవడిక కూడా మంచిపనే. ఇతరులను మాటలతో కాని, చేతలతో కాని హింసించకుండా ఉండటం కూడా గొప్పపనే.
అందరూ ప్రార్థనలు చేసే మసీదులను శుభ్రం చేయడం దైవానికి ఇష్టమైన మంచిపని. ఇతరుల కోసం, భావితరాల కోసం పండ్ల చెట్లను నాటడం ఎంతో పుణ్యకార్యం. కష్టపడి చేసిన సత్కార్యానికి పుణ్యఫలం ఎక్కువగా ఉంటుంది. మన దగ్గర ఉన్న గుక్కెడు మేకపాలతో ఇతరుల దాహార్తి తీర్చినా పుణ్యప్రదమే. మంచి మనసుతో ఒక్క ఖర్జూరపు ముక్క దానం చేసినా మనం నరకాగ్ని నుంచి తప్పుకోవచ్చు. భూతదయ కలిగి ఉండటం, నలుగురు నడిచే బాటను శుభ్రం చేయడం, నమాజు కోసం మసీదు వైపు వేసే అడుగులు, ఇతరుల తగాదా పరిష్కరించడమూ మంచిపనుల ఖాతాలోకే వస్తాయి.
-ముహమ్మద్ ముజాహిద్, 96406 22076