తొలిమలి సంధ్యల్లో అరచేతుల్ని వెచ్చగా తాకే టీ ఒక పానీయం మాత్రమే కాదు… చాలా మందికి ఒక అనుబంధం. ఆందోళనలో ఉన్నప్పుడూ, ఆనందంగా ఉన్నప్పుడూ మంచి తోడు. అందుకే రోజులో ఒక్కసారైనా దాన్ని పలకరించని సగటు భారతీయుడు ఉండడు. లండన్‌లో పుట్టి పెరిగినా తానూ టీకి వీరాభిమానినే అంటున్నారు మీరా మానెక్. ఆ ఇష్టాన్నే వ్యాపారంగా మార్చుకున్నారు. ఇప్పుడు ఆమె పేరే అక్కడ ఓ బ్రాండ్. ‘చాయ్ బై మీరా’ టీ మిక్సులు యునైటెడ్ కింగ్‌డమ్‌లోని వందకు పైగా కేఫ్‌లు, హోటళ్లు రెస్టారెంట్లకు సరఫరా అవుతున్నాయి. అంతేకాదు, ఇటీవల ‘ద బుక్ ఆఫ్ చాయ్’ పుస్తకాన్ని రాసి టీ గురించి ఎన్నో సంగతుల్ని చెప్పే ప్రయత్నం చేస్తున్న మీరా ప్రయాణం ఆద్యంతం ఆసక్తికరం.
కొందరు టీ పెడితే తాగిన ఎవరైనా అదుర్స్ అనాల్సిందే. అరగంట నుంచీ వేధించే తలనొప్పి కూడా అరనిమిషంలో ఎగిరిపోవాల్సిందే. ఇంకొందరి చేతి చాయ్, ఇప్పుడూ అప్పుడూ అని కాదు ఎప్పుడైనా, ఎన్నిసార్లయినా తాగాలనిపిస్తుంది. మీరా మానెక్దీ అచ్చంగా అలాంటి హస్తమే. రకరకాల మసాలా దినుసుల కలబోతగా ఆమె పెట్టే టీ సువాసనే ఎదుటివాళ్లని కట్టి పడేస్తుంది. టీకి అభిమానులైన వాళ్లంతా ఆమెకూ అభిమానులుగా మారిపోతారు. తను లండన్‌లో రెస్టారెంట్ నడిపే సమయంలో అలాంటి అభిమానుల్నే సొంతం చేసుకున్నారు మీరా. కిచిడీ, పప్పు, కూరలు, టోస్ట్లలాంటివి అందులో ఎన్ని ఉన్నా మీరా చాయ్ మెనూ మాత్రం అక్కడ ప్రత్యేకంగా నిలిచేది. ఆమె తయారుచేసే రకరకాల టీలు తాగడానికి లండన్ జనం క్యూ కట్టేవారు. చాయ్ బై మీరా… అంటూ అక్కడివాళ్లు దాన్ని తెగ పాపులర్ చేయడంతో తర్వాత తాను స్థాపించిన టీ మిక్సుల సంస్థకూ అదే పేరును పెట్టుకున్నారామె.
సాధారణంగా టీ అంటే పాలు, చక్కెర, టీపొడి మాత్రమే కాకుండా మన దగ్గర అల్లం, యాలకుల్లాంటివీ వేస్తాం. మీరా వాళ్ల ఇంట్లో కూడా వీటితో పాటు పసుపు, దాల్చిన చెక్కలాంటివీ వేసేవారు. పాలతోనే కాదు, పాలు లేకుండానూ తులసి, పుదీనా లాంటి రకరకాల ఆకులు, దినుసుల సమ్మేళనంగానూ దీన్ని కాచేవారు. ఒక్కో సందర్భాన్ని, అవసరాన్ని బట్టి ఒక్కో రకం టీ తయారుచేసే వాళ్లు మీరా అమ్మమ్మ, నానమ్మ. తానూ అదే నేర్చుకున్నారు. రకరకాల దినుసులను జోడించి ఆమె టీలు చేసేవారు. అవే ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. అయితే, మీరా కేవలం ఉన్నదున్నట్టుగా పెద్దలను అనుసరించలేదు. రకరకాల దినుసులు వాటి ఉపయోగాల మీద పరిశోధనలు చేశారు. ఆయుర్వేదం మీదా పట్టు సాధించారు. మన ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచే ఆయుర్వేద జీవనశైలి, అందుకు అనుసరించాల్సిన విధానం, తీసుకోవాల్సిన ఆహారం మీదా పుస్తకాన్ని రచించారు. ఆరోగ్యకరమైన రెసిపీలను జోడించి ‘ప్రజ్ఞ’ పేరిట పుస్తకాన్ని తీసుకువచ్చారు. జీర్ణవ్యవస్థను చక్కదిద్దేందుకు మార్గదర్శిగా దీన్ని రూపుదిద్దారు. అది బాగా పాపులర్ అయ్యింది. నిజానికి భారతీయ వంటకాలంటే నూనెలూ, వేపుళ్లూ, ఎక్కువ క్యాలరీలు ఉండేవిగా చూస్తుంటారు. కానీ అది అపోహే అని చెప్పేలా తొలి పుస్తకం ‘ద శాఫ్రాన్ సోల్’ను అచ్చేశారు. ఆరోగ్యాన్ని పదిలంగా కాపాడుతూ, రుచికరంగా, సులభంగా చేసుకొనే భారతీయ వంటలు ఉంటాయిందులో.
గత పుస్తకాలు రాసేప్పుడు వివిధ రకాల మసాలా దినుసుల గురించి, వాటి ఆరోగ్య ప్రయోజనాల గురించి లోతుగా చదవడం వల్ల చాయ్ పుస్తకాన్ని మరింత సాధికారికంగా రాయగలిగారు మీరా. ఒత్తిడిగా ఉన్నప్పుడు మసాలా టీ తాగితే ఎందుకు హాయి భావన కలుగుతుందిలాంటి విషయాలను ఇందులో సహేతుకంగా వివరించారు. వాటిలోని ఏ పదార్థాలు దేనికి దోహదం చేస్తున్నాయన్నది అర్థం చేసుకున్నారు. ఆ విషయాలను తెలియజేస్తూ రాసిందే ‘ద బుక్ ఆఫ్ చాయ్’. ఉత్సాహాన్ని ఇచ్చేవి, సాంత్వన కలిగించేవి, నిద్రకు సహకరించేవి, ఒత్తిడిని తగ్గించేవి ఇలా రకరకాల టీలను ఇందులో పరిచయం చేశారు. వాటిలోనూ ఉదయం తాగేవి, సాయంత్రం తాగేవి, కాలాలను బట్టి తయారు చేసుకునేవి ఇలా ఎన్నో టీలు ఉన్నాయి. ఏ చాయ్‌ని ఎలా కాస్తే ఆరోగ్య ప్రయోజనాలు ఒనగూరుతాయో కూడా వివరించారు. ఇక, తన అనుభవంతో తయారు చేసిన టీ మిక్సులను చాయ్ బై మీరా వెబ్సైట్ ద్వారా అమ్ముతున్నారు.
మీరాకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు. అయితే ఒక్క యూకేలోనే వందకు పైగా రెస్టారెంట్లూ, హోటళ్లూ, కేఫ్‌లకు ఈమె తన ఉత్పత్తుల్ని సరఫరా చేస్తున్నారు. క్లాసిక్, శాఫ్రాన్, కోకోనట్, చాక్లెట్ చాయ్ స్పైస్ల పేరుతో వీటిని అమ్ముతున్నారు. వెల్నెస్ కోచ్‌గానూ ఆమెకు మంచిపేరు ఉంది. కార్పొరేట్ హెల్త్ వర్క్‌షాప్‌లు నిర్వహిస్తారు. ఆరోగ్యానికి సంబంధించిన శిక్షణ తరగతులూ నడుపుతున్నారు. ఆమెకు గుజరాతీ చక్కగా వచ్చు. యూనివర్సిటీ స్థాయికి వెళ్లే దాకా సంస్కృతం చదువుకున్నారు. ఉమ్మడి కుటుంబంలో పెరిగిన మీరా తన భారతీయ మూలాలను ఎంతగానో ప్రేమిస్తారు. ఇప్పటికీ ప్రతి ఏటా భారత్‌కు వస్తాననీ చెబుతున్నారు. ‘చిన్నప్పుడు అమ్మమ్మ, నానమ్మలతోపాటు గుజరాత్, ముంబయిలలో గడిపిన సమయంలో వాళ్ల ద్వారా చాలా రెసిపీలు నేర్చుకున్నా. నా వృత్తి, వ్యాపారాలకు ఇప్పుడవే పెట్టుబడులయ్యాయి. నేను ప్రేమించే వీటన్నిటినీ నలుగురికీ పరిచయం చేయాలని ఆహార రంగంలోకి అడుగుపెట్టా. నేను ఇష్టంగా చేసే ఈ పనే నాకు విజయాన్ని తెచ్చి పెట్టింది.’ అంటూ ఆనందంగా చెబుతారు మీరా. నిజమే భారతీయ టీని ఇష్టపడటమే కాదు, దానికి తానే ఓ బ్రాండ్‌గా మారడం గొప్పేమరి!