తగ్గేదే లే.. పుష్పలో అల్ల్లు అర్జున్ డైలాగ్ అయితే కావచ్చు కానీ, నిజానికి ఆ ‘ఐకాన్ స్టార్’ కూతురికి ఈ మాట అతికినట్టు సరిపోతుంది. అవును, చిన్నారి అల్లు అర్హ ఈ మధ్య ‘యంగెస్ట్ చెస్ ట్రైనర్’గా ప్రపంచ రికార్డు సృష్టించింది. ఈ విజయంలో మిర్యాలగూడ ఆణిముత్యం, చెస్ కోచ్ మాశెట్టి దివ్యశ్రీ పాత్ర ఎంతో ఉంది. ఆ చిన్నారికి చదరంగం పాఠాలు చెప్పిన గురువు మన దివ్య.
ప్రతిభ ఎవరి సొంతమూ కాదని నిరూపిస్తున్నది మిర్యాలగూడకు చెందిన దివ్యశ్రీ. బాల్యం నుంచే చదరంగంపై ఆసక్తి పెంచుకొన్న దివ్యను తల్లిదండ్రులు మాశెట్టి శ్రీనివాస్ (డైమండ్ శ్రీను), గీత కూడా ప్రోత్సహించారు. కోచ్‌లు సైదులు, పార్థ సారథి దగ్గర శిక్షణ ఇప్పించారు. ఎనిమిదో తరగతి చదువుతున్న రోజుల్లోనే దివ్య ఏడాదికి 40 రోజులు చదరంగం పోటీల్లో పాల్గొనేది. విద్యార్థి దశలో 25 సార్లు జిల్లా చాంపియన్‌గా సత్తా చాటింది. ఏడుసార్లు జాతీయస్థాయిలో రాణించింది. 2016లో ఫిలిప్పీన్స్‌లో జరిగిన అంతర్జాతీయ పోటీల్లోనూ దేశ గౌరవాన్ని నిలబెట్టింది. ఓ దశలో కళ్లకు గంతలు కట్టుకొని చదరంగం సాధన చేసింది.
అల్లు అర్హ గురువుగా..
ఎంతోమంది సెలెబ్రిటీల పిల్లలను గ్రాండ్ మాస్టర్స్‌గా తీర్చిదిద్దుతున్నారు దివ్య. హైదరాబాద్‌లోని రాయ్ చెస్ అకాడమీ కో-డైరెక్టర్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. నిజానికి చదరంగం తన ప్రవృత్తి మాత్రమే. దివ్యశ్రీ వృత్తిరీత్యా న్యాయవాది. పలు సంస్థలకు న్యాయ సలహాదారుగా ఉన్నారు. అనేక కుటుంబాలను నిలిపిన ఫ్యామిలీ కౌన్సెలర్ కూడా. సినీ నటుడు అల్లు అర్జున్ కూతురు అర్హకు తను వ్యక్తిగత చదరంగం గురువు. దగ్గరుండి ఎత్తులు, పైఎత్తులు నేర్పారు. నాలుగు నెలల శిక్షణతో.. ‘యంగెస్ట్ చెస్ ట్రైనర్’గా అర్హ ప్రపంచ రికార్డు సాధించడంలో కీలకపాత్ర పోషించారు. త్వరలోనే తమ అకాడమీ ఆధ్వర్యంలో 350 మందికి చదరంగంలో ఉచిత శిక్షణ ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నారు దివ్య. ‘అర్హ చాలా వేగంగా ఆలోచిస్తుంది. చక్కగా ఎత్తులు వేస్తుంది. తనకు చెస్ అంటే ప్రాణం. తాను నేర్చుకోవడమే కాదు.. తన స్నేహితులకు, ఇంట్లో పనిచేసే వారికి కూడా చదరంగంలో శిక్షణ ఇచ్చింది. అలా ఓ యాభైమందితో చదరంగం అక్షరాభ్యాసం చేయించింది’ అని వివరిస్తారు దివ్య. ఆ చిన్నారి చెస్ ప్రతిభ గురించి తెలుసుకున్న నోబుల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధి, ఆర్బిటరేటర్ చొక్కలింగం బాలాజీ అర్హకు నైపుణ్య పరీక్ష నిర్వహించి.. ‘నోబుల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’లో ఓ పేజీ కేటాయించారు. ఈ అద్భుతాన్ని సాధించిన అర్హకు, సాధన చేయించిన దివ్యశ్రీకి అభినందనలు.
– మజ్జిగపు శ్రీనివాస్‌రెడ్డి