నాదొక సున్నితమైన సమస్య. మేమంతా దగ్గరి బంధువులం. మా పెద్దమ్మవాళ్ల పెద్దకూతురు కొడుకును.. అంటే మా పెద్దక్క కొడుకును గత నెలలో మొదటిసారి చూశాను. వాళ్లు ఆస్ట్రేలియాలో స్థిరపడ్డారు. నా వయసు పద్దెనిమిది, అతనికి ఇరవై అయిదు. తొలి పరిచయంతోనే స్నేహం కుదిరింది. ఇద్దరి ఇష్టాలూ ఒకటే. అన్ని విషయాలూ షేర్ చేసుకున్నాం. గతవారం నన్ను పెండ్లి చేసుకుంటానని ప్రపోజ్ చేశాడు. ఇలా జరుగుతుందని నేను ఊహించనే లేదు. నిజానికి, అతనంటే నాకూ ఇష్టమే. కానీ వరసలు అడ్డొస్తున్నాయి. ఆస్ట్రేలియాలో అలాంటి వివాహాలు చట్ట బద్ధమేనని చెబుతున్నాడు. పెండ్లి చేసుకుంటే తప్పేమీ లేదని సర్దిచెబుతున్నాడు. ఆ మరుసటి రోజే మా అమ్మనాన్నలకు చెప్పాడు. వాళ్ల్లూ నిర్ఘాంతపోయారు. పెద్దక్కకు తెలియడంతో ఆమె కూడా కలవరపడుతున్నది. మా కుటుంబాల్లో ఎవరికీ వంశ పారంపర్య వ్యాధులు కానీ, జన్యు సమస్యలు కానీ లేవు. ఇంట్లో వాళ్లు కాదంటే మాత్రం పారిపోవాలని అనుకుంటున్నాం. చట్టం మమ్మల్ని ఆపగలదా?
– ఓ సోదరి
ఇది రెండు కుటుంబాలకు సంబంధించిన విషయమే కాదు.. సంస్కృతి, సంప్రదాయాలతో ముడిపడిన వ్యవహారం కూడా. విదేశాల్లో ఇవన్నీ చెల్లుబాటు అవుతాయేమో కానీ, మన దేశంలో వివాహ వ్యవస్థకు, కుటుంబ బంధాలకు అపారమైన విలువ ఉంది. అయితే, కొన్ని తెగల్లో దగ్గరి బంధువుల మధ్య వివాహాలను ప్రోత్సహిస్తున్నారు. అటువంటి అనుకూలత మీ బంధుత్వాల్లో ఉందేమో సరిచూసుకోండి. ఇటువంటి వివాహాల వల్ల పుట్టబోయే పిల్లలకు వైకల్యాలు వచ్చే ప్రమాదం లేకపోలేది.
జన్యుపరమైన సమస్యలూ ఉత్పన్నం కావచ్చు. ఇక చట్టం విషయానికి వస్తే.. మీరిద్దరూ మేజర్లు కాబట్టి ఎలాంటి అవరోధాలు ఉండకపోవచ్చు. మీరే అన్నట్టు ఇదో సున్నితమైన సమస్య. ఆలోచించి నిర్ణయం తీసుకోండి. తొందరపాటు వద్దు. ఆలస్యమైనా ఫర్వాలేదు. తల్లిదండ్రులను ఒప్పించే ప్రయత్నం చేయండి. ఆత్మీయుల మద్దతు ఉంటేనే జీవితం సాఫీగా సాగుతుంది. పంతాలకు పోతే రెండు కుటుంబాలూ మిమ్మల్ని వెలివేసే ప్రమాదం ఉంది. మీరిద్దరూ కలిసి సమాజాన్ని ఎదిరించాల్సి ఉంటుంది.