హలో జిందగీ. ఎండకాలం తరచూ వేడి చేయడం, దానివల్ల మూత్రం మంటగా రావడం, లేదా విరేచనాలు అవ్వడంలాంటివి చాలా మందిని ఇబ్బంది పెడుతుంటాయి. ఇలా జరగకుండా ఉండాలంటే మన ఆహారంలో ఎలాంటి మార్పులు చేసుకోవాలి. తెలియజేయగలరు. సాధారణంగా మన శరీరం కాలానుగుణంగా కొన్ని మార్పులు చేసుకుంటూ ఉంటుంది. ఉదాహరణకు చలికాలంలో చర్మంలోపల కొవ్వుల్ని తయారుచేస్తుంది. అంటే చలిని తట్టుకునేలా మనల్ని సంసిద్ధుల్ని చేయడం అన్నమాట. దీన్నే థర్మోరెగ్యులేషన్ అంటారు. ఈ శరీర ధర్మం వేసవిలోనూ పనిచేస్తుంది.
బయట వేడిగా ఉంటుంది కాబట్టి మన శరీరంలో క్రియలన్నీ సక్రమంగా జరిగేందుకు కొంత శాతం నీటిని అది నిల్వ చేసే ప్రయత్నం చేస్తుంటుంది. ఇంకా ఈ కాలంలో వేడి వల్ల చెమట రూపంలో కొంత నీరు బయటికి వెళుతూ ఉంటుంది. అలాంటి సమయంలో మనం నీరు ఎక్కువగా తీసుకోవాలి. కేవలం నీరు మాత్రమే అంటే ఎక్కువ తాగలేం కాబట్టి, శరీరాన్ని చల్లబరిచే ఆహారం తీసుకోవడమూ ముఖ్యం. ఆకుకూరలు, పుచ్చకాయ, కమలా, దోసకాయ, కీరలాంటి వాటితోపాటు కొబ్బరి నీళ్లు, నిమ్మకాయ నీళ్లలాంటివి ఆహారంలో చేర్చుకోవాలి. విటమిన్ సి శరీరాన్ని చల్లబరుస్తుంది.
అది ద్రవాలను పట్టి ఉంచుతుంది. అలాగే పుదీన నీళ్లు తీసుకుంటే అందులోని మెంథాల్ కూలింగ్ ఎఫెక్ట్ను కలగజేస్తుంది. ఎండకాలంలో శరీరంలో నీటి స్థాయులు తగ్గిపోయి ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ జరుగుతుంది. కొబ్బరి నీళ్లు వాటి స్థాయుల్ని సమతులీకరిస్తాయి. పంచదార నీళ్లు కూడా ఇదే రీతిలో వేగంగా ఎలక్ట్రోలైట్లను అందిస్తాయి. మజ్జిగ కూడా అంతే, నోరు ఎండిపోయినట్టు లేకుండా చేస్తుంది. దాహాన్ని తగ్గిస్తుంది. ఈ ఆహారాలన్నీ శరీర ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరిస్తాయి.
సాధారణంగా ఎండకాలంలో శరీరం నీటిని దాచుకున్నప్పుడు మూత్రంలో నీటి శాతం తగ్గుతుంది. కిడ్నీల్లో ఫిల్టరై బయటికి వచ్చే వ్యర్థాల గాఢత పెరుగుతుంది. క్లోరైడ్, అమ్మోనియాలాంటివి అందులో ఉండటం వల్ల మూత్రానికి వెళ్లినప్పుడు అక్కడి చర్మం మంట వస్తుంది. కాబట్టి ఎండకాలంలో వేడి చేయకుండా ఉండాలంటే నీటితోపాటు, నీటిశాతం ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకుంటే సరి!
– మయూరి ఆవులన్యూట్రిషనిస్ట్
Mayuri.trudiet@gmail.com