‘బిడ్డ పైచదువులకు ల్యాప్‌టాప్ కొనాలి. బడ్జెట్లో ఏమున్నాయబ్బా?’ అని ఆలోచిస్తుంటాం. కొన్నిసార్లు బ్రౌజింగ్ చేస్తున్నప్పుడు.. ఇరవై వేల రూపాయలకే కొత్త ల్యాపీ అని ప్రకటనలు కనిపిస్తాయి. ఫోన్లు, ట్యాబ్‌ల ధరలు పాతిక వేలు పలుకుతున్న ఈ రోజుల్లో ఇరవైవేల ల్యాపీలు బాగానే పని చేస్తాయా? వాటి వల్ల లాభాలు ఎంత? వాటిల్లో ఏమైనా లోపాలు ఉంటాయా? ఇలా ఎన్నో సందేహాలు తలెత్తుతాయి. వాటికి సమాధానమే ఈ కథనం..
ఇంటి అవసరాలు, వ్యక్తిగత పనులు రెండింటికీ సపోర్ట్ చేసే డివైజ్ కొనాలంటే? ఒకప్పుడు మిడ్‌రేంజ్ ట్యాబ్లెట్ల వైపు చూసేవారు. కానీ, ఇప్పుడు ఇరవై వేలు లేదా అంతకంటే తక్కువ ధరలో Primebook, Lenovo, Ultimus, Jio, Walker, Acer లాంటి కంపెనీల నుంచి కూడా ల్యాప్‌టాప్‌లు వస్తున్నాయి. ఇవి కొన్ని రకాల యూజర్లకు చాలా బాగా సరిపోతాయి.
కొత్త యూజర్లు, విద్యార్థులు: ఇవి బేసిక్ కంప్యూటింగ్ అవసరాలకు వాడొచ్చు. అంటే.. ఇంటర్నెట్ బ్రౌజింగ్, ప్రెజెంటేషన్స్ తయారు చేయడం, రీసెర్చ్, ఇ-లెర్నింగ్ కోసం మంచి ఎంపిక. తక్కువ ధరలో లభించే ఎడ్యుకేషనల్ టూల్స్‌గా ఉపయోగపడతాయి.
పరిమిత అవసరాలకే: తక్కువ స్పెసిఫికేషన్లు ఉండటం వల్ల, పిల్లలు ఆన్లైన్లో ఎక్కువ కంటెంట్ చూడటం, హై ఎండ్ గేమ్స్ ఆడటం లాంటి పనులు చేయలేరు. ఇది ఒక రకంగా
విద్యార్థి దశలో ఉన్న వారికి ఉపయుక్తం అనుకోవచ్చు.
ప్రయాణాలకు అనుకూలం: ఈ ల్యాప్‌టాప్‌లు చిన్నగా, తేలికగా ఉంటాయి. ప్రయాణాల్లో ఈజీగా క్యారీ చేయొచ్చు. ఖరీదు తక్కువే కాబట్టి.. పొరపాటున పోయినా.. బెంబేలెత్తిపోవాల్సిన
అవసరం ఉండదు.
AI సపోర్ట్: తక్కువ ధరలో ఉన్నా, చాలా ల్యాప్‌టాప్‌లు ఇప్పుడు AI చాట్బాట్లను సపోర్ట్ చేసేలా డిజైన్ చేస్తున్నారు. అంటే, తక్కువ ఖర్చుతోనే అత్యాధునిక టెక్నాలజీ అందుబాటులోకి వస్తుంది. సాధారణంగా ఈ ల్యాప్‌టాప్‌లలో ర్యామ్ సామర్థ్యం 4GB నుంచి 8GB వరకు ఉంటుంది. ఇది చాలామంది బేసిక్ అవసరాలు తీరుస్తుంది.
కెమెరా, ఆడియో నాణ్యత: తక్కువ ధర ల్యాప్‌టాప్‌లలో హార్డ్‌వేర్, సాఫ్ట్వేర్ పరంగా కొన్ని లోపాలు ఉంటాయి. ఖర్చు తగ్గించడానికి, కంపెనీలు తక్కువ నాణ్యత గల కెమెరాలు, స్పీకర్లను వాడతాయి. దీనివల్ల వీడియో కాల్స్ నాణ్యత సరిగా ఉండదు. మీరు ఆన్లైన్ క్లాసులు అటెండ్ అయ్యేవారైనా, హై-ప్రొఫైల్ క్లయింట్స్‌తో మాట్లాడేవారైనా, దీని కోసం మీరు హెడ్‌ఫోన్స్, ఎక్స్టర్నల్ స్పీకర్స్‌పై ఆధారపడాల్సి వస్తుంది.
బ్యాటరీ లైఫ్: బ్యాటరీ లైఫ్ తక్కువగా ఉండే అవకాశం ఉంది. ప్రయాణం చేసేటప్పుడు చార్జర్ తీసుకెళ్లడం తప్పనిసరి.
గేమింగ్‌కు వద్దు: ఈ డివైజ్‌లు ఎక్కువ ప్రాసెసింగ్ సామర్థ్యం కలిగిన
ఆపరేషన్స్, గేమింగ్‌కు సరిపోవు. కంపెనీలు సపోర్ట్ చేస్తాయని చెప్పినా, ప్రాక్టికల్‌గా వర్కవుట్ అవ్వదు.