బ్రెయిన్ ట్యూమర్.. ప్రాణాంతకమైన వ్యాధే. కానీ, ప్రాథమిక దశలో గుర్తించగలిగితే గండం నుంచి బయటపడవచ్చు. బ్రెయిన్ ట్యూమర్స్‌పై ప్రజల్లో అవగాహన కల్పించే ఉద్దేశంతో ఇరవై రెండేండ్ల క్రితం తొలిసారిగా జర్మనీలో జూన్ 8ని బ్రెయిన్ ట్యూమర్ డేగా నిర్ణయించారు. అప్పటినుంచి ఏటా ఇదే రోజున అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అసలు బ్రెయిన్ ట్యూమర్ అంటే ఏమిటి? ఎన్ని రకాలు? ఎలా గుర్తించాలి? వ్యాధి నిర్ధారణ పద్ధతులు ఏమిటి? ఎలాంటి చికిత్సా విధానాలు ఉన్నాయి? ఇలా అనేక సందేహాలు. వాటన్నిటికి నిపుణుల జవాబు..
బ్రెయిన్ ట్యూమర్.. పేరు వింటేనే వెన్నులో వణుకు. కానీ, ఇదంతా ఒకప్పటి మాట. నేడు అత్యాధునిక చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. గతంలో బ్రెయిన్ ట్యూమర్ అంటే ప్రాణాంతకమే. సర్జరీకే 7 నుంచి 8 గంటలు తినేసేది. రోగి కోలుకోవడానికి చాలా సమయం పట్టేది. కొన్ని సందర్భాల్లో.. మాటలు పడిపోయేవి. కాళ్లు, చేతులు సత్తువ కోల్పోయేవి. ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన సరికొత్త పద్ధతుల పుణ్యమాని శస్త్రచికిత్స జరిగిన కొద్ది సేపటికే రోగులు చక్కగా మాట్లాడగలుగుతున్నారు. బ్రెయిన్ ట్యూమర్‌ను గ్రేడ్-1, గ్రేడ్-2 దశలలో గుర్తిస్తే చికిత్సలో మంచి ఫలితాలు ఉంటాయనీ, చివరి దశ వరకూ వస్తే మాత్రం పరిస్థితి సంక్లిష్టంగా మారుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రజల్లో అవగాహన లేమి కారణంగానే ఈ రుగ్మతను గుర్తించడంలో ఆలస్యం జరుగుతున్నది.
మెదడులో ఉత్పత్తి అయ్యే అసహజ కణాలే ‘బ్రెయిన్ ట్యూమర్స్’. ఈ మహమ్మారి ట్యూమర్స్ ఏ వయసు వారికైనా రావచ్చు. 40-50 ఏండ్ల స్త్రీపురుషులలో ఈ సమస్య మరీ ఎక్కువ. బ్రెయిన్ ట్యూమర్స్ రెండు రకాలు. అందులో మొదటివి మెదడులో వచ్చేవి. వీటినే ‘ప్రైమరీ బ్రెయిన్ ట్యూమర్స్’ అంటారు. మెదడు కాకుండా శరీరంలోని ఇతర భాగాల్లో ఏర్పడి, మెదడుకు విస్తరించే ట్యూమర్స్‌ను
‘మెటాస్టాసిస్’ ట్యూమర్స్ అంటారు. ఇతర అవయవాల నుంచి వచ్చే ట్యూమర్స్ మెదడుకు వ్యాపిస్తాయి కానీ, మెదడులో వచ్చిన ట్యూమర్స్ మాత్రం ఇతర అవయవాలకు వ్యాపించవు. సాధారణంగా అన్నిరకాల ట్యూమర్స్‌కు ఒకే రకమైన లక్షణాలు ఉంటాయి. బ్రెయిన్ ట్యూమర్స్ రావడానికి ప్రత్యేకమైన కారణాలంటూ ఉండవు.
మెటాస్టాసిస్ ట్యూమర్స్
శరీరంలోని ఇతర భాగాల్లో ఏర్పడిన కణుతులు.. ముఖ్యంగా ఊపిరితిత్తులు, రొమ్ము, పెద్దపేగు, కడుపు తదితర భాగాల్లో ఏర్పడిన ట్యూమర్స్ మెదడుకు వ్యాపిస్తాయి. ఇలాంటి ట్యూమర్స్నే ‘మెటాస్టాసిస్ ట్యూమర్స్’ అంటారు. బ్రెయిన్ ట్యూమర్స్‌లో 40 శాతం మెటాస్టాసిస్ ట్యూమర్సే.
ప్రైమరీ ట్యూమర్స్
ప్రైమరీ ట్యూమర్స్‌లో మళ్లీ రెండు రకాలు ఉంటాయి.
1.క్యాన్సర్ ట్యూమర్స్.
2.నాన్ క్యాన్సరస్ ట్యూమర్స్.
..అంటే ట్యూమర్స్ అన్నీ క్యాన్సర్ ట్యూమర్స్ కాదు. ఇందులో కొన్ని సాధారణ ట్యూమర్స్ కూడా ఉండవచ్చు. వాటినే ‘నాన్ క్యాన్సరస్ ట్యూమర్స్’గా సంబోధిస్తారు.
క్యాన్సర్ ట్యూమర్స్
మెదడులో వచ్చే క్యాన్సర్ ట్యూమర్స్‌లో ప్రధానమైనవి..
1. గ్లయోమా ట్యూమర్స్
2. ఎపెండైమోమా ట్యూమర్స్
3. మెడుల్లోబ్లాస్టొమా ట్యూమర్స్
1. గ్లయోమా ట్యూమర్స్
మెదడులోని ‘గ్లయ’ అనే కణాలలో ఏర్పడే కణుతులను గ్లయోమా ట్యూమర్స్ అంటారు. ఇవి ఒక చోట పుట్టి, చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపిస్తాయి. వీటిని గ్రేడ్-1, గ్రేడ్-2 దశలలో గుర్తిస్తే.. సాధారణ సర్జరీ ద్వారా చికిత్స చేయవచ్చు. గ్రేడ్-3, గ్రేడ్-4 దశ చాలా ప్రమాదకరం. శస్త్రచికిత్సతో పాటు రేడియో, కీమో థెరపీ తప్పకపోవచ్చు.
2. ఎపెండైమోమా ట్యూమర్స్
మెదడులోపలి ద్రావణం (ఫ్లూయిడ్స్) ఉండే సంచులను జఠరిక అని సంబోధిస్తారు. ఈ జఠరికల లైనింగ్స్ను ‘ఎపెండిమా’ అంటారు. ఈ ఎపెండిమాల నుంచి వచ్చే ట్యూమర్స్‌ను ‘ఎపెండైమోమా’ ట్యూమర్స్ అంటారు. వీటిని కూడా ప్రారంభ దశలో గుర్తిస్తే చికిత్సలో మంచి ఫలితాలు ఉంటాయి.
3. మెడుల్లోబ్లాస్టొమా ట్యూమర్స్
ఈ ట్యూమర్స్ చిన్నమెదడు, దాని పరిసరాల్లో ఏర్పడతాయి. ఇవి కూడా ప్రమాదకరమైనవే. ప్రారంభ దశలోనే గుర్తిస్తే సమర్థంగా నివారించవచ్చు.
నాన్ క్యాన్సరస్ ట్యూమర్స్
నాన్ క్యాన్సరస్ ట్యూమర్స్‌లో ప్రధానంగా ఆరు రకాలు ఉన్నాయి. అందులో 1. మెనింజియోమా 2. న్యూరోఫైబ్రోమా 3.హిమాంజియోబ్లాస్టోమా 4.ఫెనియల్ గ్లాండ్ ట్యూమర్. 5. డెర్మాయిడ్, ఎపిడెర్మాయిడ్ 6.పిట్యూటరీ ట్యూమర్.
1.మెనింజియోమా ట్యూమర్స్
మెదడుపై మూడు రకాల పొరలు ఉంటాయి. 1. డ్యూరా, 2.ఎరక్నాయిడ్, 3. పయా. ఈ మూడు పొరలను కలిపి ‘మెనింజీస్’ అంటారు. ఈ మెనింజీస్ల నుంచి వచ్చే ట్యూమర్స్‌ను ‘మెనింజియోమా’ ట్యూమర్‌గా వ్యవహరిస్తారు.
2. న్యూరో ఫైబ్రోమా ట్యూమర్
మెదడులో ప్రధానంగా 12 రకాల నరాలు ఉంటాయి. అందులో 2,3, 4, 5, 6, 7, 8వ నరాల నుంచి వచ్చే ట్యూమర్స్‌ను ‘న్యూరోఫైబ్రోమా ట్యూమర్స్’ అంటారు.
3. హిమాంజియోబ్లాస్టొమా ట్యూమర్
మెదడులోని రక్త కణాల నుంచి వచ్చే ట్యూమర్స్‌ను ‘హిమాంజియోమా’ లేదా ‘హిమాంజియో బ్లాస్టొమా’ ట్యూమర్స్ అని పిలుస్తారు. వీటికి కూడా ఎంత వేగంగా చికిత్స అందిస్తే అంత మేలు.
4. పీనియల్ గ్లాండ్ ట్యూమర్
పీనియల్ గ్రంథి నుంచి వచ్చే ట్యూమర్సే.. పీనియల్ గ్లాండ్ ట్యూమర్స్.
5. డెర్మాయిడ్, ఎపిడెర్మాయిడ్
..ఈ ట్యూమర్స్ పుట్టుకతోనే వస్తాయి. రోగి వయసు పెరుగుతున్న కొద్దీ వీటి పరిమాణమూ పెరుగుతుంది.
6. పిట్యూటరీ ట్యూమర్
పిట్యూటరీ గ్రంథి నుంచి వచ్చే ట్యూమర్‌ను పిట్యూటరీ ట్యూమర్ అంటారు.
ట్యూమర్స్ లక్షణాలు
వ్యాధి నిర్ధారణ పద్ధతులు
అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు రోగిలో కనిపించే లక్షణాలనుబట్టే బ్రెయిన్ ట్యూమర్‌ను గుర్తిస్తారు. వెనువెంటనే వ్యాధి నిర్ధారణకు సిఫారసు చేస్తారు. ఆ పద్ధతులు కూడా గతంలో చాలా క్లిష్టంగా ఉండేవి. మూడు మార్గాల్లో బ్రెయిన్ ట్యూమర్స్‌ను గుర్తించే వారు. అందులో 1. సెరెబ్రల్ ఆంజియోగ్రామ్. ఈ పద్ధతిలో రోగి మెడ దగ్గర సూది గుచ్చి, మెదడులో రక్త నాళాల అమరికను తెలుసుకుని ట్యూమర్‌ను నిర్ధారించేవారు. 2. వెంట్రిక్యులర్ యాంజియో గ్రామ్. ఈ పద్ధతిలో పుర్రెకు రంధ్రం చేసి మొదడులోని నీటి సంచులలో ట్యూమర్స్‌ను గుర్తించేవారు. 3.న్యూమో
ఎన్సెఫ్లోగ్రామ్. ఈ పద్ధతిలో వెన్నుపూస నుంచి నీరు తీసేసి ఇంజక్షన్ ద్వారా గాలిని ఎక్కించి, ట్యూమర్‌ను నిర్ధారించేవారు. ఈ పద్ధతులు చాలా క్లిష్టమైనవి. ప్రస్తుతం అత్యాధునిక పద్ధతులు అందుబాటులోకి రావడంతో 5 నుంచి 10 నిమిషాల్లోనే బ్రెయిన్ ట్యూమర్స్‌ను నిర్ధారిస్తున్నారు. అందులోనూ 1. సీటీ-స్కాన్, 2. ఎంఆర్ఐ 3.పెట్‌స్కాన్.. మరింత కీలకమైనవి.
1.సీటీ-స్కాన్
ఇందులో రెండు రకాల పరీక్ష చేస్తారు. ఒకటి ప్లెయిన్, రెండవది విత్ కాంట్రాస్ట్. ప్లెయిన్ సీటీ-స్కాన్‌లో ట్యూమర్‌ను స్పష్టంగా గుర్తించలేం. కాంట్రాస్ట్‌లో అయితే స్పష్టంగా త్రీ-డీ కోణంలో ట్యూమర్‌ను నిర్ధారించవచ్చు. దీనివల్ల చికిత్స సులభం అవుతుంది. తక్కువ ఖర్చుతో సీటీ-స్కాన్ ద్వారా జబ్బును గుర్తించవచ్చు.
2. ఎంఆర్ఐ
ఇందులో కూడా రెండు రకాల పరీక్షలు ఉంటాయి. ఒకటి ప్లెయిన్. రెండు కాంట్రాస్ట్. సాధారణంగా బ్రెయిన్ ట్యూమర్ నిర్ధారణకు ఎంఆర్ఐ పెద్దగా అవసరం ఉండదు. తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే ఈ పరీక్షను ఎంచుకుంటారు.
3. పెట్‌స్కాన్
పెట్‌స్కాన్ చాలా ఖర్చుతో కూడినది. ఇది శరీరం మొత్తం తీయాల్సి ఉంటుంది. ‘మెటాస్టాసిస్’ ట్యూమర్స్ ఉన్నవారికి మాత్రమే ఈ పెట్‌స్కాన్ అవసరం పడుతుంది.
చికిత్సా పద్ధతులు
బ్రెయిన్ ట్యూమర్‌కు శస్త్రచికిత్స తప్ప మరో మార్గం లేదు. అయితే ట్యూమర్ అనేది 2 సెంటీమీటర్ల కంటే తక్కువగా, అదీ సున్నితమైన ప్రదేశంలో ఉన్నప్పుడు, రోగి ఆరోగ్య పరిస్థితి సర్జరీకి అనుకూలంగా లేనప్పుడు.. ఆ వచ్చిన ట్యూమర్ నాన్ క్యాన్సరస్ అయితే ‘గామా నైఫ్’ అనే అత్యాధునిక రేడియేషన్ పద్ధతి ద్వారా చికిత్స అందించవచ్చు. దీనికి ఒక రోజు చాలు. ప్రస్తుతం ఈ విధానం మన దగ్గర అందుబాటులో లేదు. ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగుళూరులో మాత్రమే ఉంది. ఇక శస్త్రచికిత్సల విషయానికి వస్తే గతంలో బ్రెయిన్ ట్యూమర్ సర్జరీకి కనీసం 7 నుంచి 8 గంటలు పట్టేది. ఇప్పుడు 3 నుంచి 4 గంటల సమయం సరిపోతుంది. ‘న్యూరో నేవిగేషన్’ అనే అత్యాధునిక పరిజ్ఞానంతో మెదడులో ట్యూమర్ ఎక్కడ ఉందో, ఎంత పరిమాణంలో ఉందో కచ్చితంగా తెలుసుకుని చికిత్స అందించవచ్చు. ‘క్యుసా’ పద్ధతి ద్వారా ట్యూమర్‌ను పీల్చేయడం జరుగుతుంది. శస్త్రచికిత్సతో పాటు క్యాన్సర్ ట్యూమర్స్‌కు రేడియో థెరపీ, కీమో థెరపీ, టార్గెటెడ్ డ్రగ్ థెరపీలతో చికిత్స చేయాల్సి ఉంటుంది. శరీరంలో ఏ చిన్న మార్పు కనిపించినా, వివిధ సందర్భాల్లో శరీరం స్పందించే తీరులో వ్యత్యాసం అనిపించినా.. వైద్యులను సంప్రదించడం ఉత్తమం. దీనివల్ల శస్త్రచికిత్స వరకూ వెళ్లాల్సిన పరిస్థితి రాకపోవచ్చు.
– డాక్టర్ పి.రంగనాథమ్
ఎంసీహెచ్ న్యూరో సర్జరీ (ఎయిమ్స్, ఢిల్లీ)
సీనియర్ కన్సల్టెంట్ న్యూరో సర్జన్
సన్‌షైన్ హాస్పిటల్, హైదరాబాద్
— మహేశ్వర్‌రావు బండారి