కొందరికి సరైన సైజు తెలియదు. కొందరికి కప్ పరిమాణం పట్ల అవగాహన ఉండదు. కొందరు నాణ్యత విషయంలో రాజీ పడతారు. బ్రా ఎంపికలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే చికాకులు తప్పవని హెచ్చరిస్తున్నారు నిపుణులు.
సరైన సైజు ..
అప్పుడే కాలేజీకి వెళ్తున్న అమ్మాయిలు, కొత్తగా బ్రా వాడేవారు తమకు సరిపోయే సైజుపై దృష్టి పెట్టరు. స్నేహితుల సలహాలకు ప్రాధాన్యం ఇస్తారు. ఎదుటివాళ్ల శరీరా కృతితో పోల్చుకుని తమ బ్రాలను ఎంచుకుంటారు. దాంతో బిగుతైపోయి నొప్పులు వస్తాయి. అసౌకర్యంగా కూడా ఉంటుంది.
‘అండర్వైర్’తో జాగ్రత్త
కొంతకాలంగా మార్కెట్లో అండర్వైర్ బ్రాలు రాజ్యమేలుతున్నాయి. అలాంటివాటిని ఎంచుకున్నప్పుడు సైజు విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. వెడల్పాటి పట్టీ వల్ల చర్మంపై వాతలు మాత్రమే పడతాయి. కానీ వైర్ బ్రాలు ఏకంగా చర్మాన్ని కోసేస్తాయి. దాంతో రక్తం వస్తుంది, విపరీతమైన నొప్పి ఉంటుంది. ఇలాంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే, సైజు చాలా ముఖ్యం. వైర్బ్రాలు తీసుకునేటప్పుడు కప్ సైజ్, వైర్ అడ్డం, నిలువు కొలతలు సరిగ్గా చూసుకోవాలి. బరువు పెరిగినా, తగ్గినా, ప్రెగ్నెన్సీ తర్వాతైనా నిపుణులను సంప్రదించాకే బ్రా సైజును ఎంచుకోవాలి. లేస్తో వచ్చే బ్రాలు యువతులను బాగా ఆకట్టుకుంటున్నాయి. వీటివల్ల ఇబ్బంది తక్కువే.
ఆరోగ్య సమస్యలు
సౌకర్యవంతంగా లేని బ్రా వల్ల అనేక ఇబ్బందులు వస్తాయి. చాలామందికి మైగ్రెయిన్ సమస్య వస్తుంది. పక్కటెముకలు, భుజాల నొప్పులు బాధిస్తాయి. రొమ్ములు సాగినట్టు అవుతాయి. శరీరాకృతిలో తేడాలొస్తాయి. చర్మ సమస్యలూ ఇబ్బందిపెట్టవచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు. 70 శాతం భారతీయ మహిళలకు తమ కప్ సైజ్ ఎంతో కూడా తెలియదని సర్వేలు చెబుతున్నాయి.