అపసవ్యమైన జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్లతో ఎముకల ఆరోగ్యం దెబ్బతింటున్నది. శరీరంలో క్యాల్షియం కరువై.. బొక్కలను గుళ్ల చేస్తున్నది. తెలిసీతెలియక చేస్తున్న చిన్నచిన్న పొరపాట్లు కూడా.. సమస్యను తీవ్రం చేస్తున్నాయి. ఈ క్రమంలో ఎముకల ఆరోగ్యం కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలను వైద్య
నిపుణులు సూచిస్తున్నారు.
ధూమపానం, మధ్యపానం ఎముకల ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తాయి. ముఖ్యంగా ధూమపానం వల్ల ఎముకలకు రక్తసరఫరాలో అంతరాయం కలుగుతుంది. ఇక ఆల్కహాల్ ఎక్కువగా తాగినా.. శరీరంలో క్యాల్షియం స్థాయులు తగ్గిపోతాయి. దీర్ఘకాలంలో ఎముకలు బలహీనపడి.. చిన్నచిన్న దెబ్బలకే విరిగిపోతాయి. కాబట్టి, ఈ దురలవాట్లకు దూరంగా ఉంటే.. ఎముకలు బలంగా ఉంటాయి.
కాఫీలు, కొన్ని రకాల ఎనర్జీ డ్రింక్స్తోపాటు సోడా లాంటి కార్బొనేటెడ్ వాటర్ ఎక్కువగా తీసుకున్నా.. ఎముకలు బలహీనపడుతాయని నిపుణులు చెబుతున్నారు. కాఫీలో ఉండే కెఫిన్ వల్ల శరీరంలోని క్యాల్షియం బయటకు వెళ్లిపోతుంది. ఇక ఎనర్జీ డ్రింక్స్, సోడాలో ఉండే ఫాస్ఫరిక్ యాసిడ్.. శరీరం క్యాల్షియాన్ని శోషించుకోనివ్వదు. దాంతో, ఎముకల ఆరోగ్యం దెబ్బతింటుంది. వీటికి బదులుగా క్యాల్షియం అధికంగా లభించే పాలు, హెర్బల్ టీలు తాగడం మంచిదని సూచిస్తున్నారు. బొక్కలు గట్టిగా ఉండాలంటే.. శరీరంలో కావాల్సినంత విటమిన్-డి ఉండాలి.
దీనికోసం ఉదయపు ఎండలో 15-20 నిమిషాలు గడిపితే సరిపోతుంది. అంతేకాకుండా.. ఎముకలపై కొద్దిగా ఒత్తిడి పడినప్పుడే.. అవి మరింత దృఢంగా మారుతాయి. అలాకాకుండా, ఒకే దగ్గర గంటల తరబడి కదలకుండా కూర్చుంటే.. ఎముకల సాంద్రత తగ్గుతుంది. దాంతో అవి బలహీనంగా మారతాయి. అందుకే, ఆఫీస్లో పనిచేసేటప్పుడు గంటకొకసారైనా లేచి నిలబడి, ఓ 10-15 నిమిషాలు నడవడం మంచిది. ఎముకలతోపాటు వెన్నెముక బలంగా ఉండటానికి తగిన వ్యాయామాలు చేయాలి.