మన శరీరానికి ఒక ఆకారాన్ని, ఎత్తును, బరువునూ నిర్ణయించేది ఎముకలే. అంతేకాకుండా శరీరంలోని ముఖ్యమైన అవయవాలన్నిటినీ.. మెదడు, గుండె, ఊపిరితిత్తులు, మూత్రపిండాలను వివిధ ఆకారాలలో ఉండే ఎముకలు రక్షిస్తూ ఉంటాయి. ఎముకల ఉపరితలం గట్టిగా ఉండి, లోపల స్పాంజిలా ఉంటుంది. దానినే బోన్‌మ్యారో అంటారు. దీనినుంచే ఎర్ర రక్తకణాల ఉత్పత్తి జరుగుతుంది.
మనుషుల్లో ఎముకల గట్టిదనం స్త్రీ, పురుషుడు అనే తేడా మీద, బాల్యం నుంచీ ఉండే అలవాట్లు, జాతి, వాతావరణం.. ఇలాంటి అనేక విషయాల మీద ఆధారపడి ఉంటుంది. చిన్నప్పటి నుంచీ అవుట్ డోర్గేమ్స్ ఆడుతూ, వ్యాయామం చేస్తూ ఉండేవారిలో ఎముకల గట్టిదనం ఎక్కువ. వయసుపైబడే కొద్దీ.. ముఖ్యంగా స్త్రీలలో ఎముకలు పెళుసుగా మారి, ఊరికే విరిగిపోవడాన్నే ‘ఆస్టియో పొరోసిస్’ అంటారు. మెనోపాజ్ దశకు చేరుకున్న స్త్రీలలో ఈ సమస్య ఎక్కువ. చిన్నప్పటి నుంచీ శరీరానికి ఎండ తగలనిస్తూ, క్యాల్షియం లోపాలు తలెత్తకుండా జాగ్రత్తపడితే మంచిది. ఎముకలకు సంబంధించి ఆస్టియో పొరోసిస్తోపాటు బోన్ టీబీ, బోన్ క్యాన్సర్ వంటి సమస్యలూ చూస్తూ ఉంటాం. కొందరిలో బోన్ టీబీ, బోన్ క్యాన్సర్ లక్షణాలు దాదాపు ఒకేలా ఉంటాయి. ఎముకల మీద గడ్డ వచ్చే ప్రదేశాన్ని బట్టి లక్షణాలు ఆధారపడి ఉంటాయి.
క్యాన్సర్ గడ్డ అయినా, కాకపోయినా ఎముక మీద గడ్డ ఏర్పడితే ఫ్రాక్చర్లకు గురయ్యే అవకాశం ఎక్కువ. క్యాన్సర్ గడ్డ వల్ల ఎముక నొప్పిగా ఉండటం, జ్వరం, రాత్రి చెమటలు, బరువు తగ్గడం, గడ్డ వచ్చిన ప్రదేశంలో ఎముకలు విరగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. గడ్డ తొలిదశలో చాలా చిన్నగా కనిపించటం వలన ఎక్స్‌రే పరీక్షతో నిర్ధారించలేకపోవచ్చు. అందుకే లక్షణాలు కనిపించినప్పుడు నిర్ధారణ కోసం CT, MRIస్కాన్ వంటి పరీక్షలు చేస్తారు. క్యాన్సర్ కాని గడ్డ అయితే గుండ్రంగా, మెల్లగా పెరుగుతుంది. క్యాన్సర్ కణితి అయితే కచ్చితమైన ఆకారం లేకుండా వేగంగా పెరుగుతుంది. కణితి కొంచెం పెద్దగా ఉంటే ఎక్స్‌రేలలో, చిన్నగా ఉంటే MRI, CT స్కాన్లలో బయటపడుతుంది. గడ్డ ఏ రకానికి చెందిందో నిర్ధారించడానికి బయాప్సీ పరీక్ష చేస్తారు.
బోన్ క్యాన్సర్ గడ్డలలో ఆస్టియో సార్కోమా, ఈవింగ్స్ సార్కోమా, కాండ్రో సార్కోమా, ఫైబ్రోసా సార్కోమా, కార్టోమా అనే రకాలుంటాయి. ఆస్టియో సార్కోమా, ఈవింగ్స్ సార్కోమా చిన్నవయసు వారిలో ఎక్కువగా కనిపిస్తే, కాండ్రో సార్కోమా మధ్యవయసు వారిలో ఎక్కువ. చాలావరకు ఎముకల క్యాన్సర్లు సెకండరీగానే ఉంటాయి. శరీరంలో మిగతా భాగాలలో వచ్చిన క్యాన్సర్ ఎముకలకు వ్యాప్తి చెందడం ఎక్కువగా కనిపిస్తుంది. ఎముకలోనే క్యాన్సర్ ముందుగా రావడం అరుదు. ఒక్కోసారి ఊపిరితిత్తులు, ప్రొస్టేట్.. ఇలా మిగతా భాగాలలో వచ్చిన క్యాన్సర్, ఎముక మీద గడ్డలాగా ముందుగా బయటపడవచ్చు.
అన్ని క్యాన్సర్ల మాదిరిగానే ఎముకల క్యాన్సర్లకూ సర్జరీ, రేడియో, కీమో థెరపీల ప్రాధాన్యత ఉంటుంది. క్యాన్సర్ గడ్డ వచ్చిన ప్రదేశాన్ని తీసివేసినప్పుడు, చిన్నగా ఉంటే సిమెంటింగ్, గ్రాఫ్టింగ్ వంటి పద్ధతులలో సరిచేస్తారు. ఎముక తీయవలసిన ప్రదేశం ఎక్కువగా ఉంటే బోన్ బ్యాంక్ నుంచి ఎముకలను తీసుకొని వేస్తారు. లేకుంటే మెటల్ ఇంప్లాంట్స్ వాడుతారు. క్యాన్సర్ కణితి పెద్దగా ఉంటే సర్జరీ కంటే ముందు కీమో, రేడియో థెరపీలతో కణితిని చిన్నగా చేస్తారు. ఆ తర్వాత సర్జరీకి వెళ్తారు. ఈ సర్జరీ తర్వాత కొత్తగా పెట్టిన ఇంప్లాంట్లకు అలవాటు పడటానికి ఫిజియోథెరపీ, రీహ్యాలిటేషన్ చేయించుకోవాలి. ఎముకల క్యాన్సర్ రావడానికి కచ్చితమైన కారణం తెలియదు కాబట్టి నివారణ మన చేతుల్లో లేనట్లే. అయితే సెకండరీ బోన్ క్యాన్సర్ ఎక్కువ కాబట్టి.. మిగతా క్యాన్సర్లను ముందుగా గుర్తించి చికిత్స తీసుకోగలిగితే ఈ క్యాన్సర్‌ను కూడా నివారించగలుగుతాం. మిగతావాటి కంటే ప్రొస్టేట్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్లకు ఎముకలకు పాకే గుణం ఎక్కువ. బోన్ క్యాన్సర్‌కు గురైనప్పుడు శరీరంలో క్యాల్షియం స్థాయులు కూడా పెరగవచ్చు. క్యాన్సర్ కణితి వల్ల నరాలమీద ఒత్తిడి ఏర్పడి కాళ్లలో లేదా చేతులలో బలహీనత, తిమ్మిర్లు, తీవ్రమైన నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. శరీరంలో ఎక్కడైనా మార్పు కనిపిస్తే వెంటనే జాగ్రత్తలు తీసుకోవాలి. క్యాన్సర్ కణాన్ని తొలిదశలో గుర్తించడం, చికిత్సలు, డాక్టర్ నిర్ధారించిన కాలవ్యవధి ప్రకారం అవసరమైన కీమోథెరపీ, రేడియోథెరపీ తీసుకోవడం ముఖ్యం. శరీరంలో ఏ అవయవంలో అయినా క్యాన్సర్ బయటపడి చికిత్స తీసుకొన్నా, తర్వాత మళ్లీ వచ్చే అవకాశం ఎక్కువ కాబట్టి వైద్యులు నిర్ధారించినట్లు కనీసం ఐదేండ్ల వరకూ పరీక్షలు చేయించుకోవటం తప్పనిసరి.
– డాక్టర్ మోహనవంశీ
చీఫ్ సర్జికల్ ఆంకాలజిస్ట్,
ఒమేగా హాస్పిటల్స్, హైదరాబాద్
98480 11421