సమానత్వ హక్కును రాజ్యాంగం ఇచ్చినా వాటిని అలంకరించి, తామే రాజులుగా భావిస్తున్న వాళ్లు మాత్రం దాన్ని మళ్లీ మళ్లీ అపహాస్యం చేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సాక్షాత్తూ అసెంబ్లీ ఎదుట గాంధీ విగ్రహం సాక్షిగా ఏకంగా శాసన సభ్యుల మీదనే ఈ వివక్షను చూపిస్తూ ఉండటం సభ్య సమాజాన్ని ఆశ్చర్యానికి గురిచేస్తున్నది. తమ నియోజక వర్గానికి ప్రతినిధులుగా మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిలు అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేందుకు శాసన సభకు వచ్చారు. అయితే చిన్న అంచు, డిజైన్ ఉన్న నలుపు రంగు చీరెను కట్టుకొచ్చారు. కేవలం ఈ కారణంగా వారిని అసెంబ్లీలోకి పోనివ్వకుండా పోలీసులు అడ్డుకున్నారు. అంటే, అసెంబ్లీ సమావేశాలకు వచ్చే మహిళా శాసన సభ్యులు ఏ రంగు చీరె కట్టుకోవాలో కూడా ప్రభుత్వం నిర్దేశిస్తుందా? ఇంతకు మునుపు దీనికి సంబంధించి ఏవైనా ఆదేశాలు జారీ చేసిందా… చేస్తే వాటిని ముందుగా శాసన సభ్యులకు చేరవేసిందా… అన్న రహస్య విషయాలు తేలాల్సి ఉంది.
ఒకవేళ ఇవేవీ లేని పక్షంలో సమావేశాలకు హాజరయ్యేందుకు వచ్చిన మహిళా శాసన సభ్యులను ఎందుకు లోనికి వెళ్లనివ్వలేదన్న ప్రశ్నకు కోర్టులో అయినా ప్రభుత్వం తప్పక సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఒకవేళ వాళ్లు ఈ ప్రభుత్వ వైఫల్యాలను విమర్శిస్తూ అంతకు ముందు నిరసన ర్యాలీలో పాల్గొన్నారే అనుకున్నా, ఆ అసంతృప్తికి ప్రతీకగా నలుపు రంగు చీరెను ఎంచుకున్నారే అని భావించినా… అదే వాళ్లను లోపలికి వెళ్లనివ్వకుండా ఉంచేందుకు అడ్డంకా?! ఆ కారణంగానే వారిని జడ పట్టుకు ఈడ్చేంత అసహనం ఏర్పడిందా! ఒకవేళ తమ బాధ ఆడవాళ్ల చీరె రంగు మీదే అయితే, తాను నిత్యం ప్రదక్షిణ చేసే అధిష్ఠాన అగ్రనేత రాహుల్ గాంధీ నేరుగా దేశ అత్యున్నత చట్టసభ పార్లమెంటుకే నల్లచొక్కాలో వెళ్లి నిరసన వ్యక్తం చేయలేదా… అప్పుడు డప్పు కొట్టి ఇప్పుడు మనుషుల్ని కొడతామంటే ఇదేం నీతి. ఇది తమ వారికో న్యాయం… ఆడవారికో న్యాయం చేయడమే!