తనను వేధిస్తున్న ఇద్దరు ఆకతాయిలను ధైర్యంగా తరిమికొట్టిందో యువతి. తనతో అనుచితంగా ప్రవర్తించిన యువకులపైకి అపరకాళీలా దూసుకెళ్లింది. ఈ విషయాన్ని ఆమె తల్లి సోషల్ మీడియా వేదికగా పంచుకున్నది. బెంగళూరులో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పోస్ట్.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సందర్భంగా అమ్మాయిలపై వేధింపులు, భద్రత తదితర విషయాలపై మరోసారి చర్చకు దారితీసింది.
బెంగళూరులో నివాసం ఉండే 20 ఏళ్ల యువతి.. రోడ్డు దాటడం కోసం ఇంటి వద్ద వేచి చూస్తున్నది. అప్పుడే బైకుపై వచ్చిన ఇద్దరు వ్యక్తులు.. ఆమెను ఇబ్బందిపెట్టే ప్రయత్నం చేశారు. మొదట్లో వారికి దూరంగా వెళ్లాలని భావించిన యువతి.. చివరికి వారిని ఎదుర్కోవాలనే నిర్ణయించుకుంది. గట్టిగా అరుస్తూ.. వారివైపు బెబ్బులిలా దూసుకెళ్లింది. దాంతో ఆకతాయిలు తోకముడిచి పలాయనం చిత్తగించారు.
విషయం తెలుసుకున్న ఆమె తల్లి పూర్ణిమ ప్రభు.. ఆ ఘటన గురించి ఎక్స్ వేదికగా సోషల్ మీడియాతో పంచుకున్నది. ఆకతాయిల ఆటకట్టించిన తన కూతురి ధైర్యసాహసాలను చూసి గర్వపడుతున్నానని చెప్పుకొచ్చింది. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా.. ధైర్యంగా ఎదుర్కొనేలా తన కుమార్తెను సిద్ధం చేశానని ఆమె పేర్కొన్నది.
బాధితులు నిశ్శబ్దంగా ఉండటం ఆకతాయిలకు మరింత బలాన్ని ఇస్తుందనీ, ధైర్యంగా తిరగబడితేనే మనగలుగుతామనీ పోస్ట్‌లో రాసుకొచ్చింది. ఈ పోస్ట్‌ను చూసిన అనేకమంది నెటిజన్లు.. ఆడవాళ్లపై వేధింపుల గురించి తమ సొంత అనుభవాలు, అభిప్రాయాలను పంచుకున్నారు. మహిళల సాధికారత, భద్రత గురించి విస్తృతంగా చర్చించారు. సదరు యువతి ధైర్యాన్ని ప్రశంసించారు. ఈ ఘటనను ప్రతి యువతీ ఆదర్శంగా తీసుకోవాలని ఆకాంక్షించారు.